మాపై కేసులా..మీ శక్తి వృథా!
న్యూఢిల్లీ: తమ పార్టీ నేతలపై ఢిల్లీ రాష్ట్ర పోలీసులు యథేచ్ఛగా కేసులు నమోదు చేస్తూ వారి శక్తిని వృథా చేసుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. పోలీసులు తమపై కేసులు బుక్ చేయడంతో ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయాన్ని కాస్తా చెడగొట్టుకుంటున్నారని ఆప్ ఢిల్లీ కన్వీనర్ దిలీప్ పాండే విమర్శించారు. ప్రత్యేకంగా మహిళల్లో పోలీసులపై సదాభిప్రాయం లేదన్నారు. పశ్చిమ ఢిల్లీలో రోన్ హోలా ప్రాంతంలో గత గురువారం ఒక పోలీసు కానిస్టేబుల్, అతని స్నేహితుడు కలిసి ఒక మహిళపై అత్యాచారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పాండే తెలిపారు.
'మమ్మల్ని టార్గెట్ చేసుకుని ఢిల్లీ పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు. ఆప్ నేతలనే లక్ష్యంగా చేసుకుని కేసులు ఎలా పెట్టాలనేదానిపై పోలీసులు బిజీగా ఉంటున్నారు. ఆ తప్పుడు కేసులతో పోలీసులు వారి శక్తిని వృథా చేసుకుంటున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో రక్షణ కరువైంది. సరైన రక్షణ లేదని ప్రజలు అపోహపడుతున్నారు. ముందు వాటిపై దృష్టి పెట్టండి. మాపై కేసులు పెడితే.. మీ శక్తి వృథానే' అంటూ ఇటీవల తమ పార్టీ ఎమ్మెల్యే సురిందర్ సింగ్ పై పోలీసులు నమోదు చేసిన కేసును ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోలీసులు తమపై కేసులు అదే పనిగా నమోదు చేస్తున్నందునే ఇక్కడి పూర్తిస్థాయి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని కేంద్రాన్ని పదే పదే కోరుతున్నట్లు పాండే పేర్కొన్నారు.