దేశ రాజధాని ఢిల్లీలోని ఓ షెల్టర్ హోహ్‌లో చిన్నారుల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌లో నెల రోజుల వ్యవధిలోనే 13 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక వికలాంగుల షెల్టర్‌హోమ్‌లో 13 మంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు సబ్ డివిజనల్ కార్యాలయం జరిపిన విచారణలో తేలింది. రోహిణిలో ప్రాంతంలోని ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌లో జనవరి నుంచి ఇప్పటి వరకు 27 మరణాలు నమోదయైనట్లు వెల్లడైంది. అయితే షెల్టర్ హోమ్‌లో చిన్నారుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
దివ్యాంగ చిన్నారులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని, నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా చనిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గత ఏడాది కంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, పోస్ట్‌మార్టం నివేదికల తర్వాత మరణాలకు అసలు కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. పిల్లలకు అందిస్తున్న తాగునీటి శుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆప్ ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. షెల్టర్‌హోమ్‌కు నిజానిజాలు తేల్చేందుకు ఓ బృందాన్ని పంపింది.
‘అనేక సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ షెల్టర్ హోమ్ ఆశను కోల్పోయింది. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. వాటిని భరించలేక ప్రాణాలు విడుస్తున్నారు. అయినా ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.దీనిపై విచారణకు మేము బృందాన్ని పంపాము. వివరాలు తెలుసుకుంటాం’ అని కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లపై కూడా ఎన్‌సీడబ్ల్యూ ఆడిట్ చేస్తోందని చెప్పారు.
అయితే మృతుల సంఖ్యపై ఢిల్లీ మంత్రి అతిషి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని కోరారు. 2024 జనవరి నుంచి షెల్టర్ హోమ్‌లో 14 మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఈ మరణాలకు కారణమైన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మరోవైపు షెల్టర్ హోమ్‌లో మరణాల నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. అక్కడి పిల్లలకు స్వచ్ఛమైన నీళ్లు, ఆహారం, వైద్యం అందించడం లేదని ఆరోపిస్తోంది. ఈ మరణాలకు కారణమైన అధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మరణాలను సమీక్షించేందుకు ఢిల్లీ బీజేపీకి చెందిన బృందం కూడా ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment