
హరీశ్వర్ అలక!
⇒ గులాబీ గూటిలో అసమ్మతి కుంపటి!
⇒ సీఎం కేసీఆర్ ‘పదవి’ హామీ
⇒ నిలబెట్టుకోలేదని అసంతృప్తి
⇒ అధినాయకత్వం తీరుపై పెదవి విరుస్తున్న దిగువ శ్రేణి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గులాబీగూటిలో అసమ్మతి కుంపటి రాజుకుంటోంది. పదవుల పందేరంలో సీనియర్లను పక్కన పెడుతున్నారన్న అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించిన నేతలను తోసిరాజని.. ఎన్నికల వేళ కారెక్కిన నేతలకు అధిష్టానం పెద్దపీట వేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. టీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి పార్టీలో నెలకొంటున్న తాజా పరిణామాల పట్ల తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడి అందరికన్నా ముందు కారెక్కిన తనను ఆదరించకపోవడంపై హరీశ్వర్, ఆయన వర్గీయుల్లో నిరసన వ్యక్తమవుతోంది.
ఈ పరిణామంతో అధికార పార్టీలో అసమ్మతి రాబోయే కాలంలో తీవ్రమయ్యే అవకాశాలుంటాయని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే హరీశ్వర్ పలుమార్లు కేసీఆర్‌ను కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోవడం, పుండు మీద కారం చల్లినట్లుగా పార్టీలో ఇటీవల చేరినవారికీ పదవులు కట్టబెట్టడంపై ఆయన శిబిరంలో అసంతృప్తిని మరింత ఎగదోసినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీపై తిరుగుబాటు చేసిన కొప్పుల.. టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కు కూడా లేదు.
హరీశ్వర్ రాకతో ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. ప్రస్తుత ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా ఆయనతోపాటే కారెక్కారు. ఈ క్రమంలోనే పరిగి నుంచి శాసనసభ్యుడిగా గెలిస్తే మంత్రి పదవి కట్టబెడతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా, దురదృష్టవశాత్తు హరీశ్వర్ మాత్రం పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన హరీశ్వర్‌ను ఓదార్చిన కేసీఆర్.. సీనియర్ నేతగా తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. శాసనమండలికి అవకాశం కల్పించడం ద్వారా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెప్పుకున్నారు.
ముఖ్యమంత్రి హామీతో ఎమ్మెల్సీ పదవిపై గంపెడాశ పెట్టుకున్న హరీశ్వర్‌కు చుక్కెదురైంది. ఓడిపోయిన నేతలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అలాకాకుండా ప్రభుత్వంలో కీలకభూమిక పోషించే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పీఠానికి నామినేట్ చేస్తానని బుజ్జగించారు. ఈ పోస్టును ‘మీ కోసమే..’ సృష్టిస్తున్నానని చెప్పడంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న హరీశ్వర్‌కు రెండోసారి నిరాశే ఎదురైంది.
ఈ నామినేటెడ్ పదవిని పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్‌రెడ్డికి ఇవ్వడంతో ఆయన ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా సీఎం వ్యక్తిగత సహాయకుడి నుంచి సమాచారం అందినా హరీశ్వర్ పట్టించుకోలేదు. నమ్మినవారిని పట్టించుకోకుండా తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టడంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఆయన వర్గీయులు.. తమ నేతకు పదవి రాకుండా ప్రత్యర్థివర్గం పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా, మరికొందరు నేతలు సైతం గులాబీపార్టీ అధినాయకత్వం తీరుపై పెదవి విరుస్తున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమను కాదని.. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని సీఎం నిర్ణయించడంపై నిరసనగళం వినిపిస్తున్నారు.