సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన టీఆర్‌ఎస్ అధిష్టానం... అసంతృప్తులను కలుపుకుపోవడంలోనూ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీలో అసమ్మతిని పూర్తిగా తొలగించాలని భావిస్తోంది. నియోజకవర్గాలవారీగా పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన రీతిలో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఆయా సెగ్మెంట్లలో అసమ్మతి నేతలు, అసంతృప్తులను కలుపుకొని వెళ్లేలా కార్యాచరణ ప్రారంభించింది. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కె. తారక రామారావు, టి. హరీశ్ రావు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక పరిస్థితులున్న నియోజకవర్గాల విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పరిస్థితులను చక్కబెడుతున్నారు. చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ విషయంలో బుజ్జగింపుల ప్రక్రియ విజయవంతమైంది.
టికెట్ కోల్పోయిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీపైనా, కేసీఆర్‌పైనా పూర్తి విధేయత ప్రకటించారు. టికెట్ కేటాయింపులో ఇబ్బందికర పరిస్థితులున్న నియోజకవర్గాల్లో చెన్నూరు తరహా విధానాన్ని అనుసరించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. అసమ్మతి నేతలు ఉండే నియోజకవర్గాలను పరిశీలించి మరో వారంలో సర్దుబాట్లు చేయాలని నిర్ణయించింది. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల అసమ్మతి నేతలతో చర్చించి ఒప్పించే సమయం టీఆర్‌ఎస్‌కు ఏర్పడింది. చర్చలతో మెజారిటీ అసమ్మతి నేతలు పార్టీ దారిలోకి వచ్చి అభ్యర్థుల కోసం పని చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. భవిష్యత్తు అవకాశాల విషయంలో అసంతృప్తులకు భరోసా కల్పిస్తామని చెప్పి వారిని దారికి తెస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన వారితో కేటీఆర్, హరీశ్‌రావు సంప్రదింపులు జరుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వస్తే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన వారిపై ద్వితీయశ్రేణి నేతల్లో ఉండే అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులపై ద్వితీయశ్రేణి నేతలు చేసే ఫిర్యాదులను సావధానంగా విని సర్ది చెబుతున్నారు. అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు, నేతలు ఎన్నికల్లో కలసి పని చేసేలా ఒప్పిస్తున్నారు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో విభిన్న పరిస్థితులు ఉన్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం దక్కని వారు సైతం పోటీలో ఉంటామని ప్రకటిస్తున్నారు. చివరి వరకు తమకే అవకాశం వస్తుందని చెబుతూ ప్రచారం సైతం కొనసాగిస్తున్నారు. వారి విషయంలో చెన్నూరు తరహాలో పిలిచి ఒప్పించే ప్రక్రియను మొదలుపెడుతున్నారు.
కేసీఆర్ మాట శిరోధార్యం: నల్లాల ఓదెలు
చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సెప్టెంబర్ 6 నుంచి చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై సీఎంగారు నాతో చర్చించారు. 2001 నుంచి వెన్నంటి ఉన్న నాకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న దృష్ట్యా చెన్నూరు విషయంలో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
నా దగ్గర నామినేషన్‌కు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మొదటిసారి టికెట్ ఇచ్చి కోటీశ్వరుడిపై పోటీ చేసే అవకాశం కల్పించారు. మూడుసార్లు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. సీఎం కేసీఆర్ నా వెంట ఉన్న కార్యకర్తలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మాటే నాకు శిరోధార్యం. ఆయన మాట ప్రకారం నడుచుకుంటా. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే చెన్నూరు నియోజకవర్గంలో మళ్లీ టీఆర్‌ఎస్ గెలవాలి. అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందామని కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. కార్యకర్తలు తొందరపడకుండా పార్టీ వెంటే నడవాలని కోరుతున్నా’అని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment