అప్పుల్లో ఇల్లు | NTR House Seems Is Not Good In Tirupati | Sakshi
Sakshi News home page

అప్పుల్లో ఇల్లు

Published Wed, Apr 25 2018 10:19 AM | Last Updated on Wed, Apr 25 2018 10:20 AM

NTR House Seems Is Not Good In Tirupati - Sakshi

–ఎస్‌.రేష్మా, రెడ్డివారిపల్లె, పెద్దమండ్యం మండలం

జిల్లాలో ఎన్టీఆర్‌ గృహ పథకం లబ్ధిదారులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించుకోవడం కోసం నానాతంటాలు పడుతున్నారు.  నిర్మాణరంగ వ్యయం అధికభారమైంది. ఇంటినిర్మాణానికి ప్రభుత్వమిస్తున్న రూ.1.5లక్షలు ఏమూలకూ సరిపోవడం లేదు. దీనికితోడు నిర్మాణాలకు వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

బి.కొత్తకోట : ఎన్టీఆర్‌ గృహనిర్మాణానికి బిల్లుల చెల్లింపు శాపమైంది. విపరీత జాప్యం వెంటాడుతోంది. దీంతో పేదలు ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారు. గడచిన రెండు నెలలుగా నిర్మాణాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. గత ఫిబ్రవరి 12 నుంచి బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలి చిపోయాయి. లబ్ధిదారులకు అందిస్తున్న సిమెంటుతో నిర్మాణాలు కొంతమేర సాగుతున్నాయి. జిల్లాలో ఎన్టీఆర్‌ గ్రామీణ, పట్టణ పథకాల కింద 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబం ధించి 57,785 ఇళ్లు మంజూరు చేశారు.

ఇందులో 17,817 పూర్తి చేయించగా 12,046 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమే కాలేదు. మిగిలిన వాటిలో పునాదిలోపు స్థాయిలో 9,728, పునాది స్థాయిలో 9,401, లింటిల్‌లెవల్‌ స్థాయిలో 261, రూఫ్‌ లెవల్‌ స్థాయిలో 2,208  నిర్మాణాలున్నాయి. బిల్లులు రాక క్షేత్రస్థాయిలో లబ్ధి దారులు ఇంటి నిర్మాణ పనులపై ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. ఫిబ్రవరి నుంచి నిధులు విడుదల చేయడం లేదు. ఫిబ్రవరి 12 నుంచి ఆ నెలాఖరు వరకు కొద్దిపాటి బిల్లులు చెల్లించినా మార్చి ఒకటి నుంచి ఇప్పటి వరకు బిల్లుల మాటేలేదు. నిర్మాణాలు చేసినా బిల్లులు ఇవ్వరన్న అభిప్రాయంతో పనులపై లబ్ధిదారులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు.
పెండింగ్‌లో రూ.35కోట్లు..
మార్చి ఒకటి నుంచి ఇప్పటివరకూ రూ.35కోట్లమేర పెండింగ్‌ బిల్లులున్నాయని అధికారిక సమాచారం. ఇది మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండల స్థాయిలో అధికారులు రోజూ నిర్మాణ వివరాలు నమోదు చేస్తూ బిల్లుల మంజూరుకు ఆన్‌లైన్‌లో సిఫారసు చేస్తారు. ఇలా నిత్యం సిఫారసులు చేయడమే కనిపిస్తోంది తప్ప డబ్బులు రావడం లేదు. లబ్ధిదారులు గృహనిర్మాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
మోల్డింగ్‌ వేసినా పునాది బిల్లే 
సొంతిల్లు లేకపోవడంతో ఎన్టీఆర్‌ గృహం మంజూ రు చేశారు. ఇంటి నిర్మాణ పనులు చేపట్టి మోల్డింగ్‌ చేయించాం. మూడు విడతల బిల్లులు మంజూరు కావాల్సివుండగా పునాది బిల్లు రూ.14,450 మా త్రమే మంజూరైంది. గోడలకు రూ.25వేలు, మోల్డింగ్‌కు రూ.40వేలు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అప్పులకు వడ్డీ పెరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement