b.kotta kota
-
వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈకేసులో అనుమానితుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని పెద్దతిప్ప సముద్రంలో అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాంతోపాటు చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. (చదవండి : లైంగికదాడి.. హత్య!) ఫంక్షన్ హాల్లోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. దారుణానికి పాల్పడిన వ్యక్తులు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. ఇక ఈ ఘటనకు పాల్పడినవారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని, కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
అప్పుల్లో ఇల్లు
జిల్లాలో ఎన్టీఆర్ గృహ పథకం లబ్ధిదారులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించుకోవడం కోసం నానాతంటాలు పడుతున్నారు. నిర్మాణరంగ వ్యయం అధికభారమైంది. ఇంటినిర్మాణానికి ప్రభుత్వమిస్తున్న రూ.1.5లక్షలు ఏమూలకూ సరిపోవడం లేదు. దీనికితోడు నిర్మాణాలకు వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. బి.కొత్తకోట : ఎన్టీఆర్ గృహనిర్మాణానికి బిల్లుల చెల్లింపు శాపమైంది. విపరీత జాప్యం వెంటాడుతోంది. దీంతో పేదలు ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారు. గడచిన రెండు నెలలుగా నిర్మాణాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. గత ఫిబ్రవరి 12 నుంచి బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలి చిపోయాయి. లబ్ధిదారులకు అందిస్తున్న సిమెంటుతో నిర్మాణాలు కొంతమేర సాగుతున్నాయి. జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ పథకాల కింద 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబం ధించి 57,785 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 17,817 పూర్తి చేయించగా 12,046 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమే కాలేదు. మిగిలిన వాటిలో పునాదిలోపు స్థాయిలో 9,728, పునాది స్థాయిలో 9,401, లింటిల్‌లెవల్ స్థాయిలో 261, రూఫ్ లెవల్ స్థాయిలో 2,208 నిర్మాణాలున్నాయి. బిల్లులు రాక క్షేత్రస్థాయిలో లబ్ధి దారులు ఇంటి నిర్మాణ పనులపై ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. ఫిబ్రవరి నుంచి నిధులు విడుదల చేయడం లేదు. ఫిబ్రవరి 12 నుంచి ఆ నెలాఖరు వరకు కొద్దిపాటి బిల్లులు చెల్లించినా మార్చి ఒకటి నుంచి ఇప్పటి వరకు బిల్లుల మాటేలేదు. నిర్మాణాలు చేసినా బిల్లులు ఇవ్వరన్న అభిప్రాయంతో పనులపై లబ్ధిదారులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. పెండింగ్‌లో రూ.35కోట్లు.. మార్చి ఒకటి నుంచి ఇప్పటివరకూ రూ.35కోట్లమేర పెండింగ్ బిల్లులున్నాయని అధికారిక సమాచారం. ఇది మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండల స్థాయిలో అధికారులు రోజూ నిర్మాణ వివరాలు నమోదు చేస్తూ బిల్లుల మంజూరుకు ఆన్లైన్లో సిఫారసు చేస్తారు. ఇలా నిత్యం సిఫారసులు చేయడమే కనిపిస్తోంది తప్ప డబ్బులు రావడం లేదు. లబ్ధిదారులు గృహనిర్మాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మోల్డింగ్ వేసినా పునాది బిల్లే సొంతిల్లు లేకపోవడంతో ఎన్టీఆర్ గృహం మంజూ రు చేశారు. ఇంటి నిర్మాణ పనులు చేపట్టి మోల్డింగ్ చేయించాం. మూడు విడతల బిల్లులు మంజూరు కావాల్సివుండగా పునాది బిల్లు రూ.14,450 మా త్రమే మంజూరైంది. గోడలకు రూ.25వేలు, మోల్డింగ్‌కు రూ.40వేలు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అప్పులకు వడ్డీ పెరుగుతోంది. -
హింసించి కాన్పుచేశారు
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళను వైద్యసిబ్బంది హింసించి ప్రసవం చేయించారని, దీనికారణంగానే పురిటిబిడ్డ మృతిచెందిందని బంధువులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు బి.కొత్తకోటలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. పురిటిబిడ్డ మరణంపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. బాధితుల కథనం మేరకు బి.కొత్తకోట మండలంలోని దిన్నిమీదపల్లెకు చెందిన గర్భవతి జీ.సిద్దమ్మ (25)కు మంగళవారం తెల్లవారుజామున పురిటినొప్పులొచ్చారుు. భర్త వెంకటనారాయణ 108కు ఫోన్‌చేశాడు. అది రాగానే ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాలని కోరారు. దగ్గరలో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రి ఉండటం, సిద్దమ్మకు మూడో కాన్పు కావడంతో బి.కొత్తకోటకే తరలించారు. నర్సులు వరలక్ష్మి, జ్యోత్స్న పరీక్షించారు. కాన్పు ఇబ్బందికరమైతే మదనపల్లెకు పంపాలని వారిని వెంకటనారాయణ కోరాడు. నర్సులు అవసరంలేదంటూ కాన్పు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో నర్సులు తీవ్రంగా హింసించారని బాలింత సిద్దమ్మ విలపించింది. చెంపలపై కొట్టారని, కడుపుపై చేతులుపెట్టి గట్టిగా నొక్కారని చెప్పింది. చెంపలపై కొట్టిన దెబ్బలకు చె వి, ముక్కులోంచి రక్తం కారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రసవం జరగ్గా మరణించిన మగశిశువును అప్పగించారని భర్త వెంకటనారాయణ పేర్కొన్నాడు. ప్రసవం ఇబ్బంది అయితే మదనపల్లెకు రెఫర్ చేయాలని కోరినా పట్టించుకోకుండా ఇలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని సిబ్బంది నిర్లక్ష్యంపై నిలదీశారు. దీనిపై వైద్యాధికారిణి గంగాదేవి మాట్లాడుతూ ప్రసవ సమయంలో పురిటిబిడ్డ తల బయటకు రాకుండా ఇరుక్కుపోవడంవల్లే ప్రాణం పోయిందని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్పారు. నిరసనగా రాస్తారోకో పురిటిబిడ్డ మరణంపై బాధిత కుటుంబీకులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ప్రసవం కోసం వస్తే పురిటిబిడ్డ ప్రాణాలు తీశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి దశరధరామయ్య ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక తహశీల్దార్ శివయ్య బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మనోహర్‌రెడ్డి, మహమ్మద్‌ఖాసీం, అషఫ్రల్లీ, రఘునాథ్, చిన్నరెడ్డెప్ప, సలీంబాషా పాల్గొన్నారు. నర్సుల నిర్లక్ష్యమని తేలితే చర్య పురిటిబిడ్డ మరణం విషయంలో నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే చర్యలు తప్పవని జిల్లా అదనపు వైద్యాధికారి, జిల్లా ప్రాజెక్టు అధికారి మునిరత్నం చెప్పారు. పురిటిబిడ్డ మరణంపై వైద్యాధికారులు మంగళవారం సాయంత్రం ఆయన విచారణ చేపట్టారు. ఆయన వెంట మదనపల్లె, తంబళ్లపల్లె క్లస్టర్ అధికారులు లక్ష్మీనరసింహులు, వెంకటస్వామి, స్థానిక వైద్యాధికారిణి గంగాదేవి ఉన్నారు. బాధితురాలు ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ప్రవసం అయ్యే దాకా వైద్యపరంగా తీసుకున్న చర్యలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి సంబంధిత నివేది కను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అప్పగిస్తామని మునిరత్నం చెప్పారు.