నిందితుడి ఊహాచిత్రం
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈకేసులో అనుమానితుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని పెద్దతిప్ప సముద్రంలో అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాంతోపాటు చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన ఊహా చిత్రాన్ని విడుదల చేశారు.
(చదవండి : లైంగికదాడి.. హత్య!)
ఫంక్షన్ హాల్‌లోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. దారుణానికి పాల్పడిన వ్యక్తులు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. ఇక ఈ ఘటనకు పాల్పడినవారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని, కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment