హింసించి కాన్పుచేశారు
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళను వైద్యసిబ్బంది హింసించి ప్రసవం చేయించారని, దీనికారణంగానే పురిటిబిడ్డ మృతిచెందిందని బంధువులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు బి.కొత్తకోటలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. పురిటిబిడ్డ మరణంపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు.
బాధితుల కథనం మేరకు బి.కొత్తకోట మండలంలోని దిన్నిమీదపల్లెకు చెందిన గర్భవతి జీ.సిద్దమ్మ (25)కు మంగళవారం తెల్లవారుజామున పురిటినొప్పులొచ్చారుు. భర్త వెంకటనారాయణ 108కు ఫోన్‌చేశాడు. అది రాగానే ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాలని కోరారు. దగ్గరలో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రి ఉండటం, సిద్దమ్మకు మూడో కాన్పు కావడంతో బి.కొత్తకోటకే తరలించారు.
నర్సులు వరలక్ష్మి, జ్యోత్స్న పరీక్షించారు. కాన్పు ఇబ్బందికరమైతే మదనపల్లెకు పంపాలని వారిని వెంకటనారాయణ కోరాడు. నర్సులు అవసరంలేదంటూ కాన్పు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో నర్సులు తీవ్రంగా హింసించారని బాలింత సిద్దమ్మ విలపించింది. చెంపలపై కొట్టారని, కడుపుపై చేతులుపెట్టి గట్టిగా నొక్కారని చెప్పింది. చెంపలపై కొట్టిన దెబ్బలకు చె వి, ముక్కులోంచి రక్తం కారిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ప్రసవం జరగ్గా మరణించిన మగశిశువును అప్పగించారని భర్త వెంకటనారాయణ పేర్కొన్నాడు. ప్రసవం ఇబ్బంది అయితే మదనపల్లెకు రెఫర్ చేయాలని కోరినా పట్టించుకోకుండా ఇలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని సిబ్బంది నిర్లక్ష్యంపై నిలదీశారు. దీనిపై వైద్యాధికారిణి గంగాదేవి మాట్లాడుతూ ప్రసవ సమయంలో పురిటిబిడ్డ తల బయటకు రాకుండా ఇరుక్కుపోవడంవల్లే ప్రాణం పోయిందని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్పారు.
నిరసనగా రాస్తారోకో
పురిటిబిడ్డ మరణంపై బాధిత కుటుంబీకులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ప్రసవం కోసం వస్తే పురిటిబిడ్డ ప్రాణాలు తీశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి దశరధరామయ్య ఆందోళనకారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక తహశీల్దార్ శివయ్య బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మనోహర్‌రెడ్డి, మహమ్మద్‌ఖాసీం, అషఫ్రల్లీ, రఘునాథ్, చిన్నరెడ్డెప్ప, సలీంబాషా పాల్గొన్నారు.
నర్సుల నిర్లక్ష్యమని తేలితే చర్య
పురిటిబిడ్డ మరణం విషయంలో నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే చర్యలు తప్పవని జిల్లా అదనపు వైద్యాధికారి, జిల్లా ప్రాజెక్టు అధికారి మునిరత్నం చెప్పారు. పురిటిబిడ్డ మరణంపై వైద్యాధికారులు మంగళవారం సాయంత్రం ఆయన విచారణ చేపట్టారు. ఆయన వెంట మదనపల్లె, తంబళ్లపల్లె క్లస్టర్ అధికారులు లక్ష్మీనరసింహులు, వెంకటస్వామి, స్థానిక వైద్యాధికారిణి గంగాదేవి ఉన్నారు. బాధితురాలు ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ప్రవసం అయ్యే దాకా వైద్యపరంగా తీసుకున్న చర్యలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి సంబంధిత నివేది కను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అప్పగిస్తామని మునిరత్నం చెప్పారు.