పిడుగురాళ్ల పట్టణంలో శ్రీనివాసకాలనీలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇంటి నిర్మాణం
జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం నత్తకే నడక పాఠాలు నేర్పుతోంది. 2016–17, 2017–18 సంవత్సరాలకు రెండు విడతల్లో జిల్లాకు మొత్తం 25,537 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వీటిలో 4770 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. మరో 10,294 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 10,473 ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకూ పూర్తికాలేదు. లబ్ధిదారుల వద్ద నగదు లేకపోవడం, బిల్లుల మంజూరులో జాప్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గృహాలు మంజూరైనప్పటికీ లబ్ధిదారులు మాత్రం నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడంలేదు. లబ్ధిదారుల వద్ద నగదు లేనందునే పక్కా ఇళ్ల నిర్మాణలో జాప్యం నెలకొంది. జిల్లాకు 2016–17 సంవత్సరంలో మొదటి విడత కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 14,578 గృహాలు, 2017–18లో రెండో విడత కింద 10,959 గృహాలు చొప్పున మొత్తం 25,537 ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకంలో 60 శాతం గృహాలను అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. రెండు విడతల్లో కేటాయించిన ఇళ్లలో ఇప్పటి వరకు 15,064 గృహాల నిర్మాణం మాత్రమే ప్రారంభమైంది.
మిగిలిన 10,473 ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకూ చేపట్టలేదు. జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు 4770 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మరో 10,294 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేటాయించిన 15,321 గృహాల్లో కేవలం 2330 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మొత్తంగా16 శాతంలోపే ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఎక్కువ భాగం ఇళ్లు ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. రెండు విడతల్లో మంజూరైన గృహాల నిర్మాణం పూర్తయితేనే మూడో విడత కింద జిల్లాకు మరి కొన్ని గృహాలు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లు ఎలా మంజూరు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకొన్నారు. గృహాల నిర్మాణం పూర్తిచేయించేందుకు నానాతంటాలు పడుతున్నారు.
ముందుకురాని లబ్ధిదారులు
పక్కా ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడంలేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఇళ్లపై ఆసక్తి చూపడంలేదు. గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు సరిపోవటం లేదని, పునాది వేసేందుకే తమ వద్ద డబ్బులు లేవని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు పేర్కొంటునారు. దీనికితోడు గృహ నిర్మాణ సామగ్రి, కూలి ధరలు పెరిగాయని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు ఏమూలకూ చాలడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి అదనంగా రూ.2 లక్షలకు పైగా వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. అదనంగా డబ్బులు పెట్టలేక నిర్మాణం చేపట్టిన వాటిలో చాలా వరకు మ«ధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు సైతం ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇవ్వాలని, లేకపోతే యూనిట్ ధర పెంచాలని కోరుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం చేస్తే తప్ప గృహా నిర్మాణాలను చేపట్టలేమని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను మొండికేస్తున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment