ఎన్టీఆర్‌ ఇళ్లు.. అనర్హుల లోగిళ్లు | tdp leaders fraud in ntr housing scheme | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఇళ్లు.. అనర్హుల లోగిళ్లు

Published Tue, Dec 26 2017 12:47 PM | Last Updated on Fri, Aug 10 2018 8:34 PM

tdp leaders fraud in ntr housing scheme - Sakshi

చీమలు పెట్టుకున్న పుట్టలను పాములు కబ్జా చేసి నివాసంగా మార్చుకోవడం తెలిసిందే.. అది ప్రకృతి సహజం.. ఆటవిక నీతి.. విశాఖ మహానగరంలోనూ అదే ఆటవిక నీతి అమలవుతోంది.. బలమున్నోడే.. పలుకుబడి కలిగినవాడే రాజు అన్నట్లు పరిస్థితి తయారైంది.. చీమల్లాంటి పేదలకు అందాల్సిన ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం నిధులను.. పాముల్లాంటి పెద్దోళ్లు.. ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులుగా చెలామణీ అవుతున్నవారు కొట్టేస్తున్నారు.. పూరిపాకలకే దిక్కులేని పేదలను వెక్కిరిస్తూ.. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ఈ పథకం నిధులు మళ్లుతున్నాయి.. ఆర్థికంగా పచ్చగా లేనివారిని కాదని.. రాజకీయ పచ్చరంగు పులుముకున్న వారిని, తమ బినామీలనూ జన్మభూమి కమిటీలు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాయి.. ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టీడీపీ ఎమ్మెల్యే బండారు వారి ఇలాకా పెందుర్తి నియోజకవర్గంలో దర్జాగా సాగిపోతున్న ఈ అవినీతి బండారం ‘సాక్షి’ పరిశీలనలో బట్టబయలైంది.

సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం పేరుతో గత మూడేళ్లుగా అమలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో పేదలకు అందాల్సిన ఆ పథకం అధికార టీడీపీకి చెందిన అనర్హుల పాలవుతోంది. ఎంత ధనవంతులైనా.. ఏ అర్హతలు లేకపోయినా.. ఇప్పటికే పక్కా ఇళ్లున్నా.. టీడీపీ సానుభూతిపరులైతే చాలు.. మళ్లీ ఈ పథకం కింద నిధులు కొట్టేయొచ్చు.. ఇల్లు మీద ఇల్లు.. అంతస్తుల మీద అంతస్తులు కట్టేయొచ్చన్నట్లు పరిస్థితి తయారైంది. నిన్న గాక మొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఏకంగా పక్క ఇళ్లకు జియోట్యాగింగ్‌ చేసి దర్జాగా ఎన్టీఆర్‌ హౌసింగ్‌ నిధులు దోచేసిన ఘటనలు వెలుగు చూస్తే.. తాజాగా పెందుర్తి నియోజకవర్గంలో అడ్డగోలుగా హౌసింగ్‌ పథకం మంజూరు చేసి ఎడాపెడా దోచుకుతింటున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది. పశువుల పాకల, దుకాణ సముదాయాలు, వైన్‌ షాపులు, రెండు మూడంతస్తుల భవనాలకే కాదు.. చివరికి డూప్లెక్స్‌ స్థాయి భవనాలకు సైతం అడ్డగోలుగా ఎన్టీఆర్‌ హౌసింగ్‌ నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇలా దారి మళ్లిన నిధులు రూ.4 కోట్లకు పైగానే ఉంటాయని తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విచారిస్తే ఏ స్థాయిలో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయో అర్ధమవుతుంది.

అధికారులకు బెదిరింపులు
ఇలాంటి భవన సముదాయాలకు హౌసింగ్‌ నిధులు మంజూరు చేయలేమని ఒకరిద్దరు అధికారులు తిరస్కరించగా.. జన్మభూమి కమిటీ సిఫార్సులున్నాయి కదా.. మీకేంటి అభ్యంతరం అంటూ బెదిరించి మరీ వారితో శాంక్షన్‌ ఆర్డర్స్‌ ఇప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ దందా అంతా చోటా మోటా నాయకులు చేస్తున్నారనుకుంటే పొరపాటే. క్షేత్ర స్థాయిలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జన్మభూమి కమిటీ సిఫార్సుల మేరకు లబ్ధిదారుల జాబితా తయారవుతుంది. ఎమ్మెల్యే ఆమోద ముద్ర వేసిన తర్వాతే ఆ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు హౌసింగ్‌ నిధులు మంజూరవుతాయి. ఈ లెక్కన ఎమ్మెల్యేకు తెలియకుండా అనర్హులకు రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు.

సందట్లో సడేమియా    
మూడేళ్ల పాటు పేదలకు ఒక్క ఇల్లూ నిర్మించలేని ప్రభుత్వం గత కొద్ది కాలంగా నానా హడావుడి చేస్తుండటంతో సందట్లో సడేమియా అన్నట్లు టీడీపీ నేతలు అనర్హులను అందలమెక్కిస్తున్నారు. గ్రూప్‌ హౌసింగ్‌ అంటూ హంగామా చేసిన ప్రభుత్వం చివరకు సొంత స్థలాలుండి ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు రూ.1.50 లక్షల చొప్పున హౌసింగ్‌ రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇందులో రూ. 92వేలు రాష్ట్ర ప్రభుత్వం, రూ. 58 వేలు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నాయి.
హౌసింగ్‌ శాఖ ద్వారా 2016–17, 2017–18కే కాదు..చివరికి ఇంకా మొదలు కాని 2018–19 ఆర్థిక సంవత్సరానికి సైతం అడ్వాన్స్‌గా హౌసింగ్‌ రుణాలు మంజూరు చేసేస్తున్నారు.
గ్రామీణ జిల్లాలో 2016–17లో 5560 ఇళ్లు మంజూరు చేస్తే.. నేటికి 1450 ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ప్రారంభించిన వాటిలో బేస్‌మెంట్‌ స్థాయి కంటే తక్కువలో 764, బేస్‌మెంట్‌ స్థాయిలో 1322, రూఫ్‌ స్థాయిలో 517, శ్లాబ్‌ లెవల్‌లో 1298 ఉన్నాయి.
2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11,374 ఇళ్లు మంజూరు చేయగా, 5845 ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటిలో బేస్‌మెంట్‌ స్థాయి కంటే తక్కువలో 857, బేస్‌మెంట్‌ స్థాయిలో 1858, లింటల్‌ లెవల్‌లో 593, రింటల్‌ స్థాయిలో 281, ఆర్‌సీ స్థాయిలో 1210 ఉన్నాయి.
2018–19 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 10,178 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 6522 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటిలో 1380 బీబీఎల్‌ స్థాయిలో, 1376 బీఎల్‌ స్థాయిలో, 372ఇళ్లు లింటల్‌ లెవల్‌లోనూ, 193 రింటల్‌ స్థాయిలో 335 ఆర్‌సీ స్థాయిలో ఉన్నాయి.

సగానికి పైగా అనర్హులకే..
ఇక పెందుర్తి నియోజకవర్గానికి వస్తే మూడేళ్ల(2016–19)కు గానూ 2157 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో1618 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. సబ్బవరం మండలంలోని సుమా రు పది గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన జరపగా.. దాదాపు ప్రతి గ్రామంలోనూ మంజూరైన ఇళ్లలో కనీసం 50 శాతం అనర్హులకే దక్కాయి. కొన్ని గ్రామాల్లో అయితే రూ.50 లక్షల నుంచి రూ.కోటి విలువైన ఇళ్లకు సైతం ఎన్టీఆర్‌ హౌసింగ్‌ నిధులు మంజూరయ్యాయంటే ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రామల్లో వందలాది మంది అర్హులు హౌసింగ్‌ రుణం కోసం దరఖాస్తు చేస్తే..వారిలో టీడీపీ సానుభూతిపరులకు మాత్రమే జన్మభూమి కమిటీలు పచ్చజెండా ఊపగా.. ఆ జాబితాలకే ఎమ్మెల్యే ఆమోదముద్ర వేశారు. అయితే ఆ జాబితాల్లో ఉన్న వారు అర్హులా.. అనర్హులా అన్న కనీస పరిశీలన కూడా చేయకుండానే హౌసింగ్‌ అధికారులు రుణాలు మంజూరు చేసేశారు. 

జన్మభూమి కమిటీల వసూళ్లు
ఇక ఇళ్ల మంజూరు పేరిట జన్మభూమి కమిటీలు ఒక్కో ఇంటికి రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేసినట్లు పలువురు లబ్ధిదారులు బాహటంగానే చెబుతున్నారు. సాక్షి పరిశీలనలో గుర్తించిన అనర్హులు ఏకంగా 150 మందికిపైగా ఉన్నారు. వారిలో మాజీ జెడ్పీటీసీ రొంగలి శ్రీరాములమ్మ, ఎంపీటీసీ బంధువు బోకం రామయ్యమ్మలతో పాటు దాదాపు ప్రతి ఒక్కరు టీడీపీలో గ్రామస్థాయి పదవులు నిర్వ హిస్తున్న వారు, జన్మభూమి కమిటీ సభ్యుల బంధువులే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement