పేదల ఇంటికి ని‘బంధనాలు’ | Government regulations on poor homes | Sakshi
Sakshi News home page

పేదల ఇంటికి ని‘బంధనాలు’

Published Sat, Apr 16 2016 1:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Government regulations on poor homes

ప్రభుత్వ నిబంధనలతో పేదోడి సొంతింటి కల నెరవేరేలా కనిపించడంలేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా నియోజకవర్గంలో 1,250 ఇళ్లు నిర్మిస్తామన్న ప్రకటనతో ఆనందం వ్యక్తం చేసిన ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. 300 చదరపు గజాల స్థలం ఉన్న వారికే ఇల్లు అని మెలిక పెట్టడంతో పేదలు తమ పరిస్థితి ఏంటని మదనపడుతున్నారు. అంత స్థలమే ఉంటే తామే సొంతంగా ఇల్లు  నిర్మించుకునే వారమని.. ఇప్పుడేంటి ఈ ని‘బంధనాల’ని వాపోతున్నారు.
 
శ్రీకాకుళం టౌన్ : అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన పేదలందరికి ఈ పథకం ద్వారా ఇళ్ల నిర్మిస్తామని చెప్పింది. 300 చ.గజాల స్థలం ఉన్న వారికి ఇళ్లు ఇస్తామని తెలిపింది. ఒక్కో నియోజకవర్గానికి 1,250 ఇళ్లు ఈ పథకం కింద మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఇంతవరకు యూనిట్ విలువ ఖరారు కాకపోవడం, అర్హులకు ఇళ్లు మంజూరు చేయకుండా మొక్కుబడిగా శంకుస్థాపనలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

పాతులవలసలో శంకుస్థాపనతో సరి?
ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాల్లో మూడేసి గ్రామాలు, శ్రీకాకుళం నియోజకవర్గంలో నాలుగు, పాతపట్నం నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలతోపాటు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలున్న పాలకొండ, రాజాంలలో ఒక్కో గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి అక్కడ శంకుస్థాపనలు చేయాలని అధికారులు ఎమ్మెల్యేలకు సూచించారు. అన్ని నియోజకవర్గాలకు 1,250 ఇళ్లను మంజూరు చేస్తే ఈ నాలుగు నియోజకవర్గాల్లో శంకుస్థాపనలకు ఎందుకు మోకాలడ్డుతున్నారంటూ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కేవలం శ్రీకాకుళం నియోజకవర్గంలోని పాతులవలస గ్రామంలో మాత్రమే ఇళ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేయడం విశేషం.
 
గత లేవుట్లలోనే..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు కాలేదు. ఎట్టకేలకు ఎన్టీఆ ర్ గృహ నిర్మాణ పథకం మొదలైనా వాటికి నిబంధనలు అడ్డుగా చూపుతున్నారు. గ్రూపు ఇళ్ల కోసం ఒకేచోట భూమినిసేకరించాలి. గత ప్రభుత్వం పేదల కు ఇళ్లు కట్టేందుకు భూమిని సేకరించి లే అవుట్లను సిద్ధం చేసింది. ఆ లేవుట్లలోనే ఇప్పుడు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంకింద ఇళ్లుమంజూర్లు చేయాల్సి ఉంది.
 
గ్రామాల్లో స్థలాభావం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారునికి 300 చదరపు గజాల సొంత స్థలం ఉన్నట్టయితే ఇళ్లు మంజూరవుతుంది. గ్రామాల్లో 300 చదరపు గజాల స్థలం పేదలకు ఉండడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. మత్య్సకార గ్రామాల్లో స్థలాభావం ఉంది. దీంతో ఇక్కడ నివశిస్తున్న పేదలకు ఇళ్లు కట్టివ్వలేమని గృహ నిర్మాణశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. నిబంధనల పేరుతో అధికారులు వివక్ష చూపుతున్నారని, ఇలాగైతే ప్రజల మద్యకు ఎలా వెళ్లగలమని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న చిన్నపాటి స్థలంలో ఇళ్లు మంజూరు చేయకుండా 1,250 ఇళ్లు ఎవరికి ఇవ్వాలో మీరే చెప్పండంటూ ఎమ్మెల్యేలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.  

* పలాస ఎమ్మెల్యే గౌతుశ్యామసుందర శివాజీ తన నియోజకవర్గంలోని బ్రాహ్మణతర్లా గ్రామంలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని కోరారు. నిబంధనల పేరుతో అధికారులు ఆ జాబితాను తిరస్కరించారు.
* మంత్రి అచ్చెన్నాయుడు తన నియోజకవర్గ పరిధిలోని టెక్కలి,కోటబొమ్మాళిమండలాల్లో మూడు చోట్ల కాలనీలు మంజూరుచేశారు. వాటికి నిబంధనల ప్రకా రం లేఅవుట్లు వేసి కాలనీ ఏర్పాటు చేయనున్నారు.
* పాలకొండ నియోజకవర్గంలోని భామిని మండలం కోసలి, రాజాం నియోజకవర్గంలో దేవకి వాడ గ్రామాల్లో శంకుస్థాపనకు సిద్ధం చేశారు. మిగిలిన గ్రామాల్లో లేఅవుట్లు లేవంటూ లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు అడ్డమని అధికారులు చెబుతున్నారు.
* ఇన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ గృహనిర్మాణం లబ్ధిదారుల దరి ఎలా చేరుతుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement