ఒక్క ఇల్లూ కట్టలేదు | People worry on own house dream | Sakshi
Sakshi News home page

ఒక్క ఇల్లూ కట్టలేదు

Published Tue, Jan 10 2017 3:09 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ఒక్క ఇల్లూ కట్టలేదు - Sakshi

ఒక్క ఇల్లూ కట్టలేదు

కలగా మిగిలిపోతున్న సొంతింటి కల
కొత్త ఇళ్లు మంజూరు కాక అభాగ్యుల అవస్థలు
మంజూరైన వాటికీ బిల్లులు నిలిపివేసిన ప్రభుత్వం
అప్పులపాలవుతున్న లబ్ధిదారులు
ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కాగితాల్లోనే
అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లూ నిర్మించని టీడీపీ సర్కారు.. శంకుస్థాపనలతో సరి

‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించాలనే ఎన్టీఆర్‌ కల సాకారం చేసేందుకు రాష్ట్రంలో రూ.16 వేల కోట్లతో 6 లక్షల రెండు పడకల ఇళ్లు నిర్మిస్తాం.’

– అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తూ 2016 ఏప్రిల్‌ 14న సీఎం చంద్రబాబు అన్న మాటలివి.

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాల కింద కొత్తగా 4 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, మరో 2 లక్షల పాత ఇళ్లకు మరమ్మతులు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగపూర్, మలేíసియా, చైనా తదితర దేశాల్లో అమలవుతున్న టెక్నాలజీని ఉపయోగించి రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి, పేదల కలలను సాకారం చేస్తామన్నారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం సృష్టించేలా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో పలు జిల్లాల్లో పాత ఇళ్లను తొలగించి వాటి స్థానంలో ప్రజా ప్రతినిధులు కొత్త ఇళ్ల కోసం శంకుస్థాపనలు చేశారు.

జక్కంపూడితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాలకులు వేసిన శిలాఫలకాలు ఇప్పటికీ దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. శంకుస్థాపనల మహోత్సవం పేరిట ఉన్న ఇళ్లను కూలగొట్టి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో కొందరు పశువుల పాకల్లో, మరికొందరు గుడిసెల్లో కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఇల్లు మంజూరు కాక, గతంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు అందక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదు. కనీసం లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేయలేదు. ఇందిరమ్మ పథకం కింద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 44.80 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 25.63 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు నిలిపివేయడంతో 19.16 లక్షల ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల కాలనీలు మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి.

రూ.350 కోట్లు ఏమయ్యాయి?
అందరికీ ఇల్లు పథకం (హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌) కింద 2015–16లో కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 37 నగర, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 1,93,647 ఇళ్లు కేటాయించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు కేవలం 35,510 మందికి అధికారికంగా ఇళ్లు మంజూరు చేశారే తప్ప నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదు. వీటిని రాష్ట్రంలో ఎన్టీఆర్‌ పట్టణ గృహ నిర్మాణం పేరిట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం మొదటి విడతగా కేంద్రం ఇప్పటికే రూ.350 కోట్లు విడుదల చేసింది. అయితే ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. ఈ నిధులు ఏమయ్యాయో సవివరంగా నివేదిక పంపితే మరిన్ని నిధులు విడుదల చేస్తామని కేంద్రం లేఖ రాసి నాలుగు నెలలు దాటినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.

ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులు మంజూరు చేసినా లబ్ధిదారులను ఎంపిక చేయలేని దుస్థితిలో ఉండటం మా ఖర్మ అంటూ అధికార పార్టీ  ఎమ్మెల్యేలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించడం వల్ల క్షేత్ర స్థాయిలో గందరగోళం నెలకొందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణాలను ప్రీకాస్ట్, ప్రీఫ్యాబ్, పటిష్టమైన షియర్‌వాల్, స్టీల్‌ స్ట్రక్చర్, ఈపీఎస్‌ ప్యానెల్స్, కాంపోజిట్‌ స్ట్రక్చర్, చైనా స్టీల్‌ కన్‌స్ట్రక్షన్‌ తదితరాల్లో ఏ నిర్మాణం ఉపయోగించాలో నిర్ణయించి చెబుతానని ముఖ్యమంత్రి చెప్పి నాలుగు నెలలైనా ఇప్పటికీ తేల్చలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement