jio tagging
-
దీన్ని తగిలిస్తే సరి! ఎక్కడున్నా ఇట్టే దొరికిపోతుంది!!
చాలా మంది కొన్ని సార్లు వస్తువులు ఎక్కడో పెట్టి మరిచిపోతుంటారు. అవసరానికి ఆ వస్తువు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా జియోట్యాగ్ ఎయిర్ పేరుతో కొత్త ట్రాకింగ్ డివైజ్ ను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన జియోట్యాగ్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైజ్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.జియోథింగ్స్ యాప్‌తో మాత్రమే పని చేసే జియోట్యాగ్ మాదిరిగా కాకుండా, జియోట్యాగ్ ఎయిర్ యాపిల్ ఫైండ్ మై ఫీచర్‌కూ అనుకూలంగా ఉంటుంది. ఇది తాళం చెవిలు, ఐడీ కార్డులు, వాలెట్లు, పర్సులు, లగేజీలు ఇలా ఏ వస్తువుకైనా దీన్ని తగిలించవచ్చు. పెంపుడు జంతువుల మెడలోనూ వేయొచ్చు. ఇవి కనిపించకుండా పోయినప్పుడు ఈ గ్యాడ్జెట్ సాయంతో ట్రాక్ చేయొచ్చు.ఇది ఐఓఎస్ 14 ఆపైన వెర్షన్ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ 9 ఆపైన వెర్షన్ ఆండ్రాయిడ్ డివైజ్ లలో పనిచేస్తుంది. వైర్ లెస్ డివైజ్ ట్రాకింగ్ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3ను ఇందులో అందించారు. 90-120 డెసిబుల్స్ శబ్దం చేసే ఇన్‌బిల్ట్ స్పీకర్ ఇందులో ఉంది. జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. రూ.2,999 ధరతో లిస్ట్ అయిన జియోట్యాగ్ ఎయిర్‌ను ప్రారంభ ఆఫర్ కింద రూ.1,499కే లభిస్తుంది. బ్లూ, రెడ్, గ్రే కలర్ వేరియంట్లు ఉన్నాయి. పేటీఎం, క్రెడ్ యూపీఐ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. -
ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఇంటి నంబర్ కనుక్కోవడం ‘కత్తి మీద సామే’. ఒకరకంగా పజిల్‌ను తలపిస్తుంది. ఈ సంక్లిష్టతను ఛేదిస్తూ ఇంటి నంబర్ల ఆచూకీని సులభతరం చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌ను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటి నంబర్ల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(టీఎండీపీ) కింద డిజిటల్ డోర్ నంబరింగ్(డీడీఎన్) సిస్టంను ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని శ్రీరాంనగర్‌లో పైలట్ ప్రాజెక్టు కింద విజయవంతంగా అమలు చేశారు. దానిని మరింత అభివృద్ధి చేస్తూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ 5వ, బాచుపల్లి 17వ, బండ్లగూడ 19వ డివిజన్లో కూడా డిజిటల్ నంబరింగ్ విధానం తీసుకొస్తున్నారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. ప్రతి ఇంటికీ కేటాయించిన ‘క్యూఆర్’కోడ్‌ను స్కాన్ చేస్తే ఇంటి యజమాని పేరు, చిరునామా వివరాలన్నీ తెలుస్తాయి. జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేసి, ఇతర ప్రభుత్వ శాఖలకు లింక్ చేయడంతో పన్నుల వసూళ్లు, ఇతర వివరాలన్నీ ఆ నంబర్ ద్వారా తెలిసిపోతుంది. క్యూఆర్ కోడ్, డిజిటలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ దేశంలోని వివిధ పట్టణాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ఆధార్ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఈ డీడీఎన్ ప్రాజెక్టును అనుసంధానించాలని సర్కార్ నిర్ణయించింది. ముందుగా 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 16 అంకెల డిజిటల్ నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని నగరాలు, మునిసిపాలిటీల్లో ... గత కొన్నేళ్లుగా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లను మార్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ఏదీ విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సహాయంతో డిజిటల్ డోర్ నంబరింగ్ విధానాన్ని రూపొందించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. డిజిటల్ డోర్ నంబరింగ్‌లో 16 అంకెలతో కూడిన కోడ్ ఉంటుంది. ఈ అంకెల్లోనూ మూడు విభాగాలుంటాయి. నగరం/పట్టణాన్ని తెలిపే కోడ్‌తోపాటు స్థానిక డివిజన్/వార్డును తెలిపేందుకు మరో కోడ్, స్థానిక కాలనీని తెలిపేందుకు ఇంకో కోడ్ ఉంటుంది. ఈ మూడు కోడ్ల తర్వాత ఇంటికి ప్రత్యేక డోర్ నంబరును కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఆధారంగా ఇల్లు ఏ నగరం /పట్టణం... ఏ వార్డు/డివిజన్లో ఉన్నదో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఇంటి పలకపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన సమగ్ర వివరాలతోపాటు ఇంటి పన్ను, ఇతర పన్నుల వివరాలన్ని తెలిసిపోతాయి. చెల్లింపులు, బకాయి వివరాలు ప్రత్యక్షమవుతాయి. జీహెచ్ఎంసీ పరిధిలో క్యూ ఆర్ కోడ్ విధానంలో డిజిటల్ నంబరింగ్ సిస్టమ్‌ను త్వరగా అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆయా ఇళ్ల నుంచి చెత్త సేకరించేవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, రోజుకు ఎన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారన్న విషయం తెలుస్తుంది. ఆస్తుల బదిలీకి అనుసంధానం డిజిటల్ డోర్ నంబరింగ్‌లో కొత్తగా కేటాయించే డిజిటల్ నంబర్, క్యూఆర్ కోడ్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే లావాదేవీలకు అనుసంధానం చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిజిటల్ నంబర్ కేటాయింపు అనంతరం మనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఈ నంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. -
గణపయ్యకూ జియోట్యాగింగ్
సాక్షి, మహబూబ్‌నగర్ : వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా పోలీసుశాఖ గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ప్రతీ విగ్రహానికి జియోట్యాగింగ్ చేస్తోంది. రెండ్రోజుల కిందట ఊరూరా.. వాడవాడలా గణనాథులు కొలువుదీరగా నిర్వాహకులు మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఏడాది నుంచి పోలీసుశాఖ ఎన్ని విగ్రహాలు, ఎన్ని మండపాలు పెడుతున్నారో పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తోంది. అనుమతి లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు తీసుకుంటామని ఇదివరకే ఆదేశాలు జారీ చేయడంతో యువజన సంఘాల సభ్యులు సైతం సహకరిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 2,238 మండపాలను ఏర్పాటు చేయగా వీటి వద్ద అనుకోని ఘటనలు జరిగితే పోలీసులు నేరుగా అక్కడికి చేరుకోవడానికి జియోట్యాటింగ్ చేస్తున్నారు. అడ్రస్‌లు సరిగా తెలియక ఆలస్యం అవుతుంది. ఇప్పుడిక నిమిషాల్లో చేరుకునే విధంగా పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందించింది. అనుమతి తప్పనిసరి సాంకేతికతను జోడించడానికి పోలీసులు ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సాగుతున్నారు. మండపాల ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని చెబుతూ వచ్చారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఠాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను పోలీసు అధికారులు పరిశీలించి అనుమతులు ఇచ్చారు. వీటిల్లో కొలువుదీరిన విగ్రహాలకు జియోట్యాగింగ్ చేస్తున్నారు. సమస్త వివరాలు తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. మండపాల దగ్గర కానీ, నిమజ్జన ఊరేగింపు సమయంలో గానీ అనుకోని ఘటనలు జరిగితే క్షణాల్లో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తున్నారు పోలీస్ శాఖలో బ్లూకోల్ట్స్‌గా పని చేస్తున్న సిబ్బంది వద్ద ట్యాబ్‌లు ఉన్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని గణపతి మండపాలను పరిశీలిస్తారు. కమిటీ నిర్వాహకుల పేర్లు, ఫోను నెంబర్లు, మండపం ఏ ప్రాంతంలో ఉందో అనే పూర్తి వివరాలను రాసుకుంటారు. ఆ తర్వాత ట్యాబ్‌లో గణపయ్య విగ్రహాన్ని ఫొటో తీస్తారు. ఆన్లైన్ ద్వారా జియోట్యాగింగ్ చేస్తారు. అందులోని లొకేషన్ ఆప్షన్‌ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతంలోని గుర్తులు నమోదవుతాయి. అలాగే నిమజ్జనం ఏ రోజున, ఏ చెరువులో చేస్తారనే వివరాలను తీసుకుంటారు. ఆన్లైన్ దరఖాస్తులు ఇలా.. ఒకప్పుడు పోలీస్ శాఖకు రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడు ఆన్లైన్ విధానం వచ్చింది. జిల్లాలో వచ్చిన 2238 దరఖాస్తులకు ఓ పోర్టల్‌ను ఓపెన్ చేసి అందులో వివరాలను పొందుపరుస్తున్నారు. ఇంకా చేసుకోనివారు స్మార్ట్‌ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. దరఖాస్తులను సంబంధిత పోలీస్‌స్టేషన్ సీఐ పరిశీలించి, డీఎస్పీ లేదా ఏఎస్పీకి పంపిస్తారు. అక్కడి నుంచి ఎస్పీ వద్దకు వెళ్తాయి. ప్రతీ విగ్రహానికి జియోట్యాగింగ్ జిల్లాలో ఉన్న ప్రతి విగ్రహం దగ్గరకు మా సిబ్బంది వెళ్లి విగ్రహం ఫొటో తీసి ఆన్లైన్లో పెడుతున్నారు. దీని వల్ల భద్రత పరంగా ఎలాంటి సమస్య ఉండదు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేశాం. బ్లూకోర్ట్స్, పెట్రోలింగ్, రక్షక్ ఇలా ప్రతి ఒక్కరు మండపం దగ్గరకు వెళ్లి పరిశీలిస్తారు. జిల్లాలో 2238 విగ్రహాలకు దరఖాస్తులు వచ్చాయి. –భాస్కర్, డీఎస్పీ మహబూబ్‌నగర్ -
ఎన్టీఆర్ ఇళ్లు.. అనర్హుల లోగిళ్లు
చీమలు పెట్టుకున్న పుట్టలను పాములు కబ్జా చేసి నివాసంగా మార్చుకోవడం తెలిసిందే.. అది ప్రకృతి సహజం.. ఆటవిక నీతి.. విశాఖ మహానగరంలోనూ అదే ఆటవిక నీతి అమలవుతోంది.. బలమున్నోడే.. పలుకుబడి కలిగినవాడే రాజు అన్నట్లు పరిస్థితి తయారైంది.. చీమల్లాంటి పేదలకు అందాల్సిన ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం నిధులను.. పాముల్లాంటి పెద్దోళ్లు.. ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులుగా చెలామణీ అవుతున్నవారు కొట్టేస్తున్నారు.. పూరిపాకలకే దిక్కులేని పేదలను వెక్కిరిస్తూ.. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ఈ పథకం నిధులు మళ్లుతున్నాయి.. ఆర్థికంగా పచ్చగా లేనివారిని కాదని.. రాజకీయ పచ్చరంగు పులుముకున్న వారిని, తమ బినామీలనూ జన్మభూమి కమిటీలు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాయి.. ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టీడీపీ ఎమ్మెల్యే బండారు వారి ఇలాకా పెందుర్తి నియోజకవర్గంలో దర్జాగా సాగిపోతున్న ఈ అవినీతి బండారం ‘సాక్షి’ పరిశీలనలో బట్టబయలైంది. సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం పేరుతో గత మూడేళ్లుగా అమలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో పేదలకు అందాల్సిన ఆ పథకం అధికార టీడీపీకి చెందిన అనర్హుల పాలవుతోంది. ఎంత ధనవంతులైనా.. ఏ అర్హతలు లేకపోయినా.. ఇప్పటికే పక్కా ఇళ్లున్నా.. టీడీపీ సానుభూతిపరులైతే చాలు.. మళ్లీ ఈ పథకం కింద నిధులు కొట్టేయొచ్చు.. ఇల్లు మీద ఇల్లు.. అంతస్తుల మీద అంతస్తులు కట్టేయొచ్చన్నట్లు పరిస్థితి తయారైంది. నిన్న గాక మొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఏకంగా పక్క ఇళ్లకు జియోట్యాగింగ్ చేసి దర్జాగా ఎన్టీఆర్ హౌసింగ్ నిధులు దోచేసిన ఘటనలు వెలుగు చూస్తే.. తాజాగా పెందుర్తి నియోజకవర్గంలో అడ్డగోలుగా హౌసింగ్ పథకం మంజూరు చేసి ఎడాపెడా దోచుకుతింటున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది. పశువుల పాకల, దుకాణ సముదాయాలు, వైన్ షాపులు, రెండు మూడంతస్తుల భవనాలకే కాదు.. చివరికి డూప్లెక్స్ స్థాయి భవనాలకు సైతం అడ్డగోలుగా ఎన్టీఆర్ హౌసింగ్ నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇలా దారి మళ్లిన నిధులు రూ.4 కోట్లకు పైగానే ఉంటాయని తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విచారిస్తే ఏ స్థాయిలో ఎన్టీఆర్ హౌసింగ్ నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయో అర్ధమవుతుంది. అధికారులకు బెదిరింపులు ఇలాంటి భవన సముదాయాలకు హౌసింగ్ నిధులు మంజూరు చేయలేమని ఒకరిద్దరు అధికారులు తిరస్కరించగా.. జన్మభూమి కమిటీ సిఫార్సులున్నాయి కదా.. మీకేంటి అభ్యంతరం అంటూ బెదిరించి మరీ వారితో శాంక్షన్ ఆర్డర్స్ ఇప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ దందా అంతా చోటా మోటా నాయకులు చేస్తున్నారనుకుంటే పొరపాటే. క్షేత్ర స్థాయిలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జన్మభూమి కమిటీ సిఫార్సుల మేరకు లబ్ధిదారుల జాబితా తయారవుతుంది. ఎమ్మెల్యే ఆమోద ముద్ర వేసిన తర్వాతే ఆ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు హౌసింగ్ నిధులు మంజూరవుతాయి. ఈ లెక్కన ఎమ్మెల్యేకు తెలియకుండా అనర్హులకు రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు. సందట్లో సడేమియా మూడేళ్ల పాటు పేదలకు ఒక్క ఇల్లూ నిర్మించలేని ప్రభుత్వం గత కొద్ది కాలంగా నానా హడావుడి చేస్తుండటంతో సందట్లో సడేమియా అన్నట్లు టీడీపీ నేతలు అనర్హులను అందలమెక్కిస్తున్నారు. గ్రూప్ హౌసింగ్ అంటూ హంగామా చేసిన ప్రభుత్వం చివరకు సొంత స్థలాలుండి ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు రూ.1.50 లక్షల చొప్పున హౌసింగ్ రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇందులో రూ. 92వేలు రాష్ట్ర ప్రభుత్వం, రూ. 58 వేలు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నాయి. ♦ హౌసింగ్ శాఖ ద్వారా 2016–17, 2017–18కే కాదు..చివరికి ఇంకా మొదలు కాని 2018–19 ఆర్థిక సంవత్సరానికి సైతం అడ్వాన్స్‌గా హౌసింగ్ రుణాలు మంజూరు చేసేస్తున్నారు. ♦ గ్రామీణ జిల్లాలో 2016–17లో 5560 ఇళ్లు మంజూరు చేస్తే.. నేటికి 1450 ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ప్రారంభించిన వాటిలో బేస్మెంట్ స్థాయి కంటే తక్కువలో 764, బేస్మెంట్ స్థాయిలో 1322, రూఫ్ స్థాయిలో 517, శ్లాబ్ లెవల్లో 1298 ఉన్నాయి. ♦ 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11,374 ఇళ్లు మంజూరు చేయగా, 5845 ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటిలో బేస్మెంట్ స్థాయి కంటే తక్కువలో 857, బేస్మెంట్ స్థాయిలో 1858, లింటల్ లెవల్లో 593, రింటల్ స్థాయిలో 281, ఆర్సీ స్థాయిలో 1210 ఉన్నాయి. ♦ 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 10,178 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 6522 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటిలో 1380 బీబీఎల్ స్థాయిలో, 1376 బీఎల్ స్థాయిలో, 372ఇళ్లు లింటల్ లెవల్లోనూ, 193 రింటల్ స్థాయిలో 335 ఆర్సీ స్థాయిలో ఉన్నాయి. సగానికి పైగా అనర్హులకే.. ఇక పెందుర్తి నియోజకవర్గానికి వస్తే మూడేళ్ల(2016–19)కు గానూ 2157 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో1618 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. సబ్బవరం మండలంలోని సుమా రు పది గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన జరపగా.. దాదాపు ప్రతి గ్రామంలోనూ మంజూరైన ఇళ్లలో కనీసం 50 శాతం అనర్హులకే దక్కాయి. కొన్ని గ్రామాల్లో అయితే రూ.50 లక్షల నుంచి రూ.కోటి విలువైన ఇళ్లకు సైతం ఎన్టీఆర్ హౌసింగ్ నిధులు మంజూరయ్యాయంటే ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రామల్లో వందలాది మంది అర్హులు హౌసింగ్ రుణం కోసం దరఖాస్తు చేస్తే..వారిలో టీడీపీ సానుభూతిపరులకు మాత్రమే జన్మభూమి కమిటీలు పచ్చజెండా ఊపగా.. ఆ జాబితాలకే ఎమ్మెల్యే ఆమోదముద్ర వేశారు. అయితే ఆ జాబితాల్లో ఉన్న వారు అర్హులా.. అనర్హులా అన్న కనీస పరిశీలన కూడా చేయకుండానే హౌసింగ్ అధికారులు రుణాలు మంజూరు చేసేశారు. జన్మభూమి కమిటీల వసూళ్లు ఇక ఇళ్ల మంజూరు పేరిట జన్మభూమి కమిటీలు ఒక్కో ఇంటికి రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేసినట్లు పలువురు లబ్ధిదారులు బాహటంగానే చెబుతున్నారు. సాక్షి పరిశీలనలో గుర్తించిన అనర్హులు ఏకంగా 150 మందికిపైగా ఉన్నారు. వారిలో మాజీ జెడ్పీటీసీ రొంగలి శ్రీరాములమ్మ, ఎంపీటీసీ బంధువు బోకం రామయ్యమ్మలతో పాటు దాదాపు ప్రతి ఒక్కరు టీడీపీలో గ్రామస్థాయి పదవులు నిర్వ హిస్తున్న వారు, జన్మభూమి కమిటీ సభ్యుల బంధువులే ఉన్నారు. -
మరీ ఇంత నిర్లక్ష్యమా?
♦ ఎన్ని సార్లు చెప్పినా మీ వైఖరి ఇంతేనా? ♦ గడువు ముగిసినా జియోట్యాగింగ్ చేయరా! ♦ 50 శాతం కంటే తక్కువ చేసిన కార్యదర్శులకు నోటీసులు ♦ చెత్త సంపద కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై చర్యలు ♦ పంచాయతీ అధికారులపై డీపీవో కోటేశ్వరరావు ఆగ్రహం అరసవల్లి : ‘మీకు ఎన్ని సార్లు మీటింగులు పెట్టి చెప్తున్నా వైఖరిలో మార్పు రావడం లేదు. జియోట్యాగింగ్ ఎంతో కీలకమైందని చెప్పాం. గడువు పూర్తవుతున్నా ఇంకా పూర్తి చేయలేదు.. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకే జిల్లాలో 50 శాతం కంటే తక్కువ ట్యాగింగ్ చేసిన పంచాయతీల కార్యదర్శులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నా..’’ అని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాలో మూడు డివిజన్లలోని పంచాయతీ అధికారులతో స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సగం కూడా పూర్తికాలేదు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ జియోట్యాగింగ్, చెత్త నుంచి సంపద కేంద్రాల ఏర్పాటు తదితర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌కు ఫైలు పంపిస్తున్నామని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జియోట్యాగింగ్‌ను తొలుత ఆగస్టు 15 కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా ఇప్పటికీ సగం కూడా పూర్తికాకపోవడం దారుణమమన్నారు. పైలట్ ప్రాజెక్టుగా భావించిన సోంపేటలో మాత్రమే 100 శాతం పూర్తి అయ్యిందన్నారు. పాలకొండ, భామిని, బూర్జ, రేగిడి ఆమదాలవలస, ఇచ్ఛాపురం, సంతకవిటి, కోటబొమ్మాళి, జలుమూరు మండలాల్లో పనితీరు చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పంచాయతీలు ప్రిస్లో లాగిన్ కాలేదని వీరిపైనా చర్యలకు దిగుతామని స్పష్టం చేశారు. అన్ని పంచాయతీల్లో సంపద కేంద్రాలు డీపీఆర్సీ జిల్లా కో–ఆర్డినేటర్ హేమసుందరరావు మాట్లాడుతూ జిల్లాలో చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్మాణాలను అన్ని పంచాయతీల్లో చేపట్టాలని, స్థల వివాదాలుంటే తహసీల్దార్లను సంప్రదించాలన్నారు. జిల్లాలో పొగిరి, వీరఘట్టం, అవలింగి, పోలాకి తదితర చోట్ల ఆదర్శంగా ఉండే చెత్త సంపద కేంద్రాలను తయారుచేశామని, వీటిని నమూనాగా చేసుకుని ప్రతి పంచాయతీ కేంద్రంలోనూ వీటిని ఓ పార్కుల్లా నిర్మించుకోవాలని కోరారు. పెర్ఫార్మెన్స్ గ్రాంట్లను ఎలా వినియోగించాలో తెలియని కార్యదర్శులు న్నారని, ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా వాటిని ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల 2వతేదీ నాటికి ప్రతి పంచాయతీని శుభ్రంగా తయారుచేసేలా అందరూ కృషిచేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం, పాలకొండ డీఎల్పీవోలు రమాప్రసాద్, సత్యనారాయణ, డీపీఆర్సీ సభ్యుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలకూ జియో ట్యాగింగ్
హిందూపురం రూరల్ : పల్లెలోని..ఇళ్లు.. ఇతర నిర్మాణాలను జియో ట్యాగింగ్ చేసేందుకు కసరత్తు మొదలైంది. జిల్లాలోని 1003గ్రామ పంచాయతీల్లో 7,11,992 లక్షల గృహాలు ఉండగా వీటన్నింటికీ జియో ట్యాగింగ్ పరిధిలోకి తీసుకురానున్నారు. వీటితో పాటు ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు, బడి, గుడి, పార్కు, మిల్లులు, కుటీర పరిశ్రమల వంటి ఇతర నిర్మాణాలను సైతం ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పటీకే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో ఈ విదానాన్ని పూర్తి చేయగా అనంతపురం జిల్లాలో 827 పంచాయతీల్లో జియో ట్యాకింగ్ చేపట్టి 35,545 ఇళ్ల వివరాలను సర్వే పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లో పంచాయతీరాజ్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ (పీఆర్ఐఎస్) సర్వే నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ప్రతి ఇంటినీ ఫొటో తీస్తారు ప్రతి ఇంటిని ఫొటో తీసి జియో ట్యాగింగ్‌కు అనుసంధానిస్తారు ఇంటి కొలతలు తీసి..ఇంటి స్వరూపం(పెంకుటిళ్లు, పూరెగుడిసె,భవనం,ఆర్‌సీబిల్డింగ్),యజమాని పేరు, ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రతి ఇంటికి కొత్త డోర్ నంబర్,అసెస్మెంట్ నంబర్ కేటాయిస్తారు. వీటినే శాశ్వత నంబర్లుగా గుర్తిస్తారు. సర్వే సందర్భంగా ఇళ్లతో పాటు గ్రామాంలోని ఆలయాలు, బడులు, పార్కులు, కుటీర పరిశ్రమలు, రైస్‌మిల్లు, రోడ్లు, కాలువలను సైతం ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. తద్వారా ఏగ్రామానికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా, చిరునామాలు అవసరమైనా ఆన్లైన్లో చిటికెలో తెలుసుకోవచ్చు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వైబ్సైట్లో ఉంచుతుంది. పీఆర్‌ఐఆర్.జీఓవీటీ.ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఎవరైనా ఏ గ్రామంలోని వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చు. పెరుగునున్న ఇంటి పన్నులు: ఇది పూర్తియితే గ్రామాల్లో ఇళ్ల పన్నులు పెరుగుతాయిని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ల నిర్ణయం మేరకు పన్నులు విధించే పరిస్థితి ఉంది. ఆన్లైన్ ద్వారా సమగ్రమైన కొలతలతో పాటు ఆయా నిర్మాణాలు ఎందుకు ఉపయోగించుకుంటున్నారో కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల పన్నులు నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇంటి పన్నులు భారీగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఫొటోకు రూ.8 చొప్పున చెల్లింపు : జిల్లా పంచాయితీ అధికారి సుధాకర్‌రెడ్డి జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో సర్వే ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం ఆండ్రాయిడ్ఫోన్ ఉన్న వారికి వినియోగిచుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. ఇలా ఫోన్ ద్వారా ఒక్కో ఫొటో తీసి అప్లోడ్ చేసినందుకు రూ.8 చొప్పున పంచాయతీల నుంచి చెల్లించాల్సిందిగా ఆదేశాలిచ్చాం.