పల్లెలకూ జియో ట్యాగింగ్
హిందూపురం రూరల్ : పల్లెలోని..ఇళ్లు.. ఇతర నిర్మాణాలను జియో ట్యాగింగ్ చేసేందుకు కసరత్తు మొదలైంది. జిల్లాలోని 1003గ్రామ పంచాయతీల్లో 7,11,992 లక్షల గృహాలు ఉండగా వీటన్నింటికీ జియో ట్యాగింగ్ పరిధిలోకి తీసుకురానున్నారు. వీటితో పాటు ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు, బడి, గుడి, పార్కు, మిల్లులు, కుటీర పరిశ్రమల వంటి ఇతర నిర్మాణాలను సైతం ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పటీకే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో ఈ విదానాన్ని పూర్తి చేయగా అనంతపురం జిల్లాలో 827 పంచాయతీల్లో జియో ట్యాకింగ్ చేపట్టి 35,545 ఇళ్ల వివరాలను సర్వే పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లో పంచాయతీరాజ్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ (పీఆర్‌ఐఎస్) సర్వే నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు.
ప్రతి ఇంటినీ ఫొటో తీస్తారు
ప్రతి ఇంటిని ఫొటో తీసి జియో ట్యాగింగ్‌కు అనుసంధానిస్తారు ఇంటి కొలతలు తీసి..ఇంటి స్వరూపం(పెంకుటిళ్లు, పూరెగుడిసె,భవనం,ఆర్‌సీబిల్డింగ్),యజమాని పేరు, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ప్రతి ఇంటికి కొత్త డోర్ నంబర్,అసెస్‌మెంట్ నంబర్ కేటాయిస్తారు. వీటినే శాశ్వత నంబర్లుగా గుర్తిస్తారు. సర్వే సందర్భంగా ఇళ్లతో పాటు గ్రామాంలోని ఆలయాలు, బడులు, పార్కులు, కుటీర పరిశ్రమలు, రైస్‌మిల్లు, రోడ్లు, కాలువలను సైతం ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. తద్వారా ఏగ్రామానికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా, చిరునామాలు అవసరమైనా ఆన్‌లైన్‌లో చిటికెలో తెలుసుకోవచ్చు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వైబ్‌సైట్‌లో ఉంచుతుంది. పీఆర్‌ఐఆర్.జీఓవీటీ.ఇన్ అనే వెబ్‌సైట్ ద్వారా ఎవరైనా ఏ గ్రామంలోని వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చు.
పెరుగునున్న ఇంటి పన్నులు:
ఇది పూర్తియితే గ్రామాల్లో ఇళ్ల పన్నులు పెరుగుతాయిని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ల నిర్ణయం మేరకు పన్నులు విధించే పరిస్థితి ఉంది. ఆన్‌లైన్ ద్వారా సమగ్రమైన కొలతలతో పాటు ఆయా నిర్మాణాలు ఎందుకు ఉపయోగించుకుంటున్నారో కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల పన్నులు నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇంటి పన్నులు భారీగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
ఫొటోకు రూ.8 చొప్పున చెల్లింపు : జిల్లా పంచాయితీ అధికారి సుధాకర్‌రెడ్డి
జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో సర్వే ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం ఆండ్రాయిడ్‌ఫోన్ ఉన్న వారికి వినియోగిచుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. ఇలా ఫోన్ ద్వారా ఒక్కో ఫొటో తీసి అప్‌లోడ్ చేసినందుకు రూ.8 చొప్పున పంచాయతీల నుంచి చెల్లించాల్సిందిగా ఆదేశాలిచ్చాం.