గ్రామాల్లోనూ భూగర్భ డ్రైనేజీ!
– నియోజకవర్గానికి ఓ పల్లె ఎంపిక
– ఇక మిగిలింది సర్వే మాత్రమే
– సర్వే యంత్రానికి రూ.10 లక్షలు అద్దె
అనంతపురం సిటీ: 5,000 జనాభాపైగా గ్రామాల్లో అండర్ డ్రైనేజీ పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆదేశాలతో ఆ శాఖ అధికారులు ఈ సర్వే చేపట్టారు. ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల ఎంపికను పూర్తి చేసినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. డ్రైనేజీ పనులు చేపట్టేందుకు గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంది. గ్రామంలో ఎంత పొడవు ఈ డ్రైనేజీని వేయాలి, ఎంత వ్యయంతో వేయవచ్చన్న అంచనాలను రూపొందించాలి. ఆయా డివిజన్‌ల డీఈ, జేఈలు ఇప్పటికే ఈ సర్వేపై కూడా ఒక అంచనాకు వచ్చామని చెబుతున్నారు.
సర్వే ఇలా
5,000 మంది జనాభ కలిగిన గ్రామంలో అండర్ డైనేజీ వేయాలంటే కనీసం 9 కిలో మీటర్లు పొడవు నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఒక కిలోమీటర్‌కు రూ. 20 నుంచి 25 లక్షలు నిర్మాణ వ్యయం అవుతుంది. 14 నియోజకవర్గాల్లోని 14 గ్రామాల్లో పనులు చేపట్టాలి. సర్వే చేపట్టేందుకు టోటల్ స్టేషన్ అనే యంత్రాన్ని తెప్పించాల్సి ఉంది.
నేతల జేబులు నింపేందుకే
నియోజక వర్గానికి ఒక గ్రామాన్ని అండర్ డ్రైనేజీ పనుల కోసం ఎంపిక చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అందిన ఆదేశాల వెనుక అసలు కుట్ర నేతల జేబులు నింపేందుకేనని స్పష్టమౌతోంది. నియోజక వర్గానికి చెందిన ప్రతి నేతకు ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అందించనుందని సమాచారం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చే సర్వే రిపోర్టు ఆధారంగా ఈ నిర్మాణాలు ఉండవని శాఖలో కొందరు అధికారులు చెబుతున్న వాదన. ఆ గ్రామాలు కూడా నేతలు చెప్పినవే సర్వే చేయబడతాయని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు కొళ్లగొట్టేందుకు ఈ ప్రణాళిక అధికారపార్టీకి బాగా కలిసి వస్తుందని చర్చ జరుగుతోంది.
ఉన్న డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దండి
జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలు మురికి కూపాలుగా మారిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. వీటిని శుభపరిచే దిక్కులేక ప్రజలు అనారోగ్యాలతో మంచాలు పడుతున్నారు. గ్రామాలకు గ్రామాలు విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో అల్లాడిపోతుంటే పట్టించుకోని పాలకులు...తాజాగా దోపిడీకి మరో శ్రీకారం చుట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీల్లో ఎలాగూ ప్రజల సౌకర్యాలు అరకొరగా ఉంటాయని, మారు గ్రామాల పరిస్థితే దయనీయంగా ఉందని గ్రామీణులు వాపోతున్నారు. కేవలం ఓట్ల కోసం మేజర్ పంచాయతీలపై కపట ప్రేమను చూపడం సరైంది కాదంటున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.