under ground drainage
-
ఎన్నాళ్లీ నరకం?
సాక్షి, కడియం (తూర్పుగోదావరి) : వాడుక నీరు గొట్టాల్లోకి వెళ్లి అక్కడి నుంచి ఎవరో ఒకరి ఇంటి ఆవరణలోకి వస్తోంది. లేకపోతే మ్యాన్‌హోల్స్ నుంచి లీకై నేరుగా రోడ్డు మీదకే చేరుతోంది. దుర్వాసనతో కూడిన ఆ మురుగు నీటిలో ఇటుకలు వేసి వాటి మీద నుంచి అక్కడి ప్రజలు నడవాల్సిన దుస్థితి. ఇదీ మోడల్‌గా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన దుళ్ళ గ్రామంలోని ఎర్రకాలనీ, బీసీ కాలనీల్లోని పరిస్థితి. ఈ నరకం నుంచి తమకు విముక్తి కలిగించండి మహాప్రభో అంటూ వాటిని చూసేందుకు వచ్చిన అధికారులు, నాయకులను స్థానికులు వేడుకొంటున్నారు. అప్పటి మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించిన పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో సాగిన ఈ నిర్లక్ష్య నిర్మాణం కారణంగా తాము పడుతున్న కష్టాలను కనిపించిన ప్రతి ఒక్కరికీ వారు వివరిస్తున్నారు. కేవలం రెండంటే రెండు వర్షాలు కురిశాయో లేదో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వేసినంత మేరా అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే ఎంతటి దుర్భర పరిస్థితులుంటాయోనని దుళ్ళ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కూలికి వెళ్తేనే కానీ రోజు గడవని ఆ కుటుంబాలు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా ఏర్పడిన మురికి కూపంలో బతకలేక తల్లడిల్లుతున్నారు. నిర్మాణ సమయంలో వచ్చిన అధికారులు కానీ, నాయకులు కానీ ఇప్పుడు కనిపించడం లేదని, తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు గొట్టాలు ఏర్పాటు చేసేందుకు జరిపిన తవ్వకాల్లో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు కూడా దెబ్బతిన్నాయి. పనులు జరుగుతున్నంతసేపూ నీటిని విడుదల చేయకుండా కాంట్రాక్టర్లు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తీరా ఇప్పుడు తాగునీరు విడుదల చేస్తూంటే ఎక్కడికక్కడ నీరు లీకైపోతోంది. ముఖ్యంగా బీసీ కాలనీలో మొత్తం తాగునీటి పైపులైన్ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. దీంతో నెల రోజులుగా నీటిని విడుదల చేయడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం తలాతోకా లేకుండా, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకుండా చేసిన పనులకు దుళ్ళలో జరిగిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పరాకాష్టగా కనిపిస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► దుళ్ళ గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి వాడిన పైపులైన్ల సామర్థ్యం వాస్తవంగా సరిపోతుందా? ► పనులు చేసిన కాంట్రాక్టర్లకు తగిన అనుభవం ఉందా? ► పనులు జరుగుతున్నప్పుడు అసలు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు పర్యవేక్షించారా? ► మోడల్‌గా నిర్మించామని చెబుతున్నారు. ఒకవేళ విఫలమయితే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా? ► ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సక్రమంగా పని చేయడం లేదు. ఇందుకు కాంట్రాక్టర్లపై తీసుకునే చర్యలేమిటి? ► ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు తీసుకునే తక్షణ చర్యలేమిట ► మురుగునీటి వ్యవస్థ నిర్మాణంలో సదరు నీరు బయటకు వెళ్లే మార్గం అత్యంత ప్రధానమైనది. అటువంటి అవకాశం లేకుండా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు ఎలా సిద్ధమయ్యారు? ఉండలేకపోతున్నాం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం వేసిన పైపులు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. మురుగునీరు వెనక్కి తన్నుకొస్తోంది. ఇంట్లోకి కూడా దుర్వాసన వస్తోంది. వీధుల్లో కూడా అదే పరిస్థితి. ఉండలేకపోతున్నాం. మా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఏ డ్రైనూ లేనప్పుడే బాగుంది. – జి.వెంకటలక్ష్మి మరీ దారుణం మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కానీ పనులు మాత్రం చేసేశారు. అవి కూడా అత్యంత దారుణంగా చేశారు. అసలు ఈ గొట్టాల నిర్మాణం చూస్తే ఇందులో నుంచి నీరు ఎలా వెళ్తుందని వేశారో అర్థం కావడం లేదు. అధికారులు, నాయకులు ఇక్కడకొచ్చి చూస్తే మా బాధలు అర్థమవుతాయి. – ఎం.కుమారి -
కారు కాబట్టి సరిపోయింది..!
ఒంగోలు: అవును మీరు విన్నది నిజమే..అక్కడ కారు కాబట్టి సరిపోయింది..అదే ఏ మనిషో అయితే∙ప్రాణాలు గోవిందా.. నిత్యం రద్దీగా ఉండే నాలుగురోడ్ల కూడలిగా ఉన్న ఒంగోలు గాంధీరోడ్డులో గాంధీబొమ్మకు ఎదురుగా మున్సిపల్ అధికారులు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాన్ని ఎప్పటి నుంచో ఏర్పాటు చేశారు. అయితే గత పదిరోజుల క్రితం ఈ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేసే ఉద్దేశ్యంతో దానిపైన ఉన్న మూతను తొలగించారు. అనంతరం మూతను ఏర్పాటు చేయడం మరిచారు. అటుగా వచ్చే వాహనాలు రద్దీలో గుంతను గమనించక పోవడంతో గుంతలో వాహనాల చక్రాలు దిగబడి పోతున్నాయి. ఫలితంగా గాయాల పాలవుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఒక కారు గుంతలో చిక్కుకు పోయింది. దీంతో కారును పైకి లేపేందుకు వాహనదారునితోపాటు స్థాని కులు పడరాని పాట్లు పడ్డారు. ఇది నిత్యం పట్టణంలో జరుగుతున్నా మున్సిపల్ సిబ్బందికి ఏ మాత్రం చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు. పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రతపై ఉండటం లేదని స్థాని కులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దృష్టి సారించి తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై మూత ఏర్పాటు చేయించి ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
గొంతులో గరళం
గుంటూరు నగరవాసులు కలుషిత జలాలతోనే గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. నగరంలో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) పనుల పేరుతో రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. తాగునీటి పైపులైన్లు పగిలినా పట్టించుకోవడం లేదు. చాలా వరకు పైపులైన్లు డ్రెయిన్లకు సమీపంలోనే ఉన్నాయి. పైపులైన్లు దెబ్బతినడంతో తాగునీటిలోకి మురుగు చేరి కలుషితమవుతోంది. ఫలితంగా తాగునీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా ఉందని తేలింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా ప్రబలిందని వైద్యాధికారులు నిర్ధారించారు. సాక్షి, గుంటూరు: రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరుకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మంజూరైందనగానే నగర ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే యూజీడీ పనులు జరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు. రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి, పైపులైనులు వేసిన అనంతరం జరిగా పూడ్చకపోవడంతో నగరం మొత్తం గుంతలమయంగా మారింది. యూజీడీ పనుల కోసం చేపట్టిన తవ్వకాల వల్ల భూమిలోని తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా తాగునీటిలోకి మురుగు చేరింది. దీంతో నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా వృద్ధి చెందింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా వ్యాధి ప్రబలి తొమ్మిది మందిని బలితీసుకుంది. నిబంధనలు బేఖాతరు నిబంధనల ప్రకారం రోడ్డును తవ్వి యూజీడీ పైపులైను వేసి మ్యాన్‌హోల్, ఇన్స్పెక్షన్ చాంబర్లను నిర్మించిన 15 రోజుల్లో రోడ్డును మళ్లీ పునర్నిర్మించాలి. అయితే నిబంధనల మేరకు రోడ్డును పునర్నిర్మించడంలేదు. యూజీడీ పనులు నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు మధ్య సమన్వయం కరువైంది. అనేక ప్రాంతాల్లో యూజీడీ కోసం తవ్విన చోట వాటర్ పైపులైనులు పగిలిపోయాయి. అపార్టుమెంట్లు, ఇళ్లకు వెళ్లే పైపులైనులు ధ్వంసమవుతున్నా వాటిని బాగు చేయించిన దాఖలాలు లేవు. దీనిపై కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం యూజీడీ పనుల వల్ల నగరంలో మంచినీటి పైపులైనులు లీకవడం, కొన్ని చోట్ల పగిలిపోయి మురుగునీరు అందులో చేరడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ మంచినీటి పైపులైనులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అధికారులకే తెలియదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట, సంగడిగుంట వంటి ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారు. అయితే ఆప్రాంతంలో యూజీడీ పనులు జరగలేదని, దాని వల్ల లీకులు ఏర్పడ్డాయనేది వాస్తవం కాదని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. పొన్నూరు రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం తవ్విన చోట వాటర్ పైపులైనుకు లీకేజీ (ఇన్సెట్) పరిశీలిస్తున్న కార్మికుడు అయితే నగరంలోని మిగతా ప్రాంతాల్లో యూజీడీ పనుల వల్ల మంచినీటి పైపులైనులు లీకవుతున్న ఘటనలపై మాత్రం స్పందించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని గుజ్జనగుండ్ల, విద్యానగర్, పట్టాభిపురం, నల్లచెరువు, చంద్రబాబునాయుడు కాలనీ, కంకరగుంట, సంపత్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే డయేరియా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మరి కొందరు వ్యాధి బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఆందోళనలో నగర ప్రజలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పైపులైనులు లీకై మురుగునీరు చేరింది. దీంతో తాగునీరు కలుషితమైంది. ఆ నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా చేరింది. ఈ బ్యాక్టీరియా కారణంగా వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారని డీఎంహెచ్ఓ జొన్నలగడ్డ యాస్మిన్ పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో సైతం యూజీడీపనుల వల్ల పైపులైనులు లీకవడం, పగిలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను యూజీడీ పనులపై ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటూ సమాధానం చెబుతున్నారని నగరప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నగరంలో జరుగుతున్న యూజీడీ పనులపై పూర్తి స్థాయిలో సమీక్షించి మంచినీటి పైపులైనులు ఉన్నప్రాంతాల్లో తవ్వకాలు జరుపకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్ సమీక్షస్తున్నా.. నగరంలో రెండేళ్ల క్రితం మొదలైన యూజీడీ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పనులతీరుఐ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ పనులు నిర్వహించే సంస్థకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో వారు ఎవరినీ లెక్క చేయడం లేదని తెలుస్తోంది. కొద్దికాలంగా కలెక్టర్ కోన శశిధర్ ప్రతి వారం యూజీడీ పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
గ్రామాల్లోనూ భూగర్భ డ్రైనేజీ!
– నియోజకవర్గానికి ఓ పల్లె ఎంపిక – ఇక మిగిలింది సర్వే మాత్రమే – సర్వే యంత్రానికి రూ.10 లక్షలు అద్దె అనంతపురం సిటీ: 5,000 జనాభాపైగా గ్రామాల్లో అండర్ డ్రైనేజీ పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆదేశాలతో ఆ శాఖ అధికారులు ఈ సర్వే చేపట్టారు. ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల ఎంపికను పూర్తి చేసినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. డ్రైనేజీ పనులు చేపట్టేందుకు గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంది. గ్రామంలో ఎంత పొడవు ఈ డ్రైనేజీని వేయాలి, ఎంత వ్యయంతో వేయవచ్చన్న అంచనాలను రూపొందించాలి. ఆయా డివిజన్ల డీఈ, జేఈలు ఇప్పటికే ఈ సర్వేపై కూడా ఒక అంచనాకు వచ్చామని చెబుతున్నారు. సర్వే ఇలా 5,000 మంది జనాభ కలిగిన గ్రామంలో అండర్ డైనేజీ వేయాలంటే కనీసం 9 కిలో మీటర్లు పొడవు నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఒక కిలోమీటర్‌కు రూ. 20 నుంచి 25 లక్షలు నిర్మాణ వ్యయం అవుతుంది. 14 నియోజకవర్గాల్లోని 14 గ్రామాల్లో పనులు చేపట్టాలి. సర్వే చేపట్టేందుకు టోటల్ స్టేషన్ అనే యంత్రాన్ని తెప్పించాల్సి ఉంది. నేతల జేబులు నింపేందుకే నియోజక వర్గానికి ఒక గ్రామాన్ని అండర్ డ్రైనేజీ పనుల కోసం ఎంపిక చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అందిన ఆదేశాల వెనుక అసలు కుట్ర నేతల జేబులు నింపేందుకేనని స్పష్టమౌతోంది. నియోజక వర్గానికి చెందిన ప్రతి నేతకు ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అందించనుందని సమాచారం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చే సర్వే రిపోర్టు ఆధారంగా ఈ నిర్మాణాలు ఉండవని శాఖలో కొందరు అధికారులు చెబుతున్న వాదన. ఆ గ్రామాలు కూడా నేతలు చెప్పినవే సర్వే చేయబడతాయని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు కొళ్లగొట్టేందుకు ఈ ప్రణాళిక అధికారపార్టీకి బాగా కలిసి వస్తుందని చర్చ జరుగుతోంది. ఉన్న డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దండి జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలు మురికి కూపాలుగా మారిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. వీటిని శుభపరిచే దిక్కులేక ప్రజలు అనారోగ్యాలతో మంచాలు పడుతున్నారు. గ్రామాలకు గ్రామాలు విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో అల్లాడిపోతుంటే పట్టించుకోని పాలకులు...తాజాగా దోపిడీకి మరో శ్రీకారం చుట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీల్లో ఎలాగూ ప్రజల సౌకర్యాలు అరకొరగా ఉంటాయని, మారు గ్రామాల పరిస్థితే దయనీయంగా ఉందని గ్రామీణులు వాపోతున్నారు. కేవలం ఓట్ల కోసం మేజర్ పంచాయతీలపై కపట ప్రేమను చూపడం సరైంది కాదంటున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. -
గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వెలుగులు
– అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి తీర్మానాలు పంపండి – డీపీఓ పార్వతీ కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పీఆర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని జిల్లా పంచాయతీ అధికారిణి బీ పార్వతీ చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకున్నారని, అయితే కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసి తమ కార్యాలయానికి ఆ కాపీలను పంపాలన్నారు. జిల్లాలో ఏప్రెల్ 30వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలుకు పీఆర్ కమిషనర్ గడువు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. మొత్తం రూ.24 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.20.40 కోట్లను వసూలు చేసినట్లు చెప్పారు. మిగిలిన 15 శాతం కూడా ప్రభుత్వ భవనాలు, మొండి బకాయిలు ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బిల్లులకు సంబంధించి సర్‌చార్జీలను ప్రభుత్వం మినహించిన దృష్ట్యా కేవలం రెగ్యులర్‌గా వాడే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి బకాయిలు లేకుండా చూసుకోవాలన్నారు. -
కరీంనగర్ డ్రైనేజి పనుల్లో పేలుడు
కరీంనగర్లో పేలుడు సంభవించింది. సుభాష్ నగర్‌లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భూగర్భం గుండా మురుగునీటిని పంపించే పనుల్లో భాగంగా కాలువ తవ్వుతుండగా అడ్డొచ్చిన రాళ్లను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చడంతో ఒక్కసారిగా మట్టి పెళ్లలు ఎగిరిపడ్డాయి. అవి కాస్తా అక్కడ ఇద్దరు పిల్లలకు తగలడంతో వారికి గాయాలయ్యాయి. కాగా, పనులు చేసే వాళ్లు ముందుచూపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా పేలుడు సంభవించిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.