గొంతులో గరళం | Poison in Throat | Sakshi
Sakshi News home page

గొంతులో గరళం

Published Sun, Mar 11 2018 1:31 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

Poison in Throat - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు నగరవాసులు కలుషిత జలాలతోనే గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. నగరంలో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) పనుల పేరుతో రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. తాగునీటి పైపులైన్లు పగిలినా పట్టించుకోవడం లేదు. చాలా వరకు పైపులైన్లు డ్రెయిన్లకు సమీపంలోనే ఉన్నాయి. పైపులైన్లు దెబ్బతినడంతో తాగునీటిలోకి మురుగు చేరి కలుషితమవుతోంది. ఫలితంగా తాగునీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా ఉందని తేలింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా ప్రబలిందని వైద్యాధికారులు నిర్ధారించారు.

సాక్షి, గుంటూరు: రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరుకు అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ) మంజూరైందనగానే నగర ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే యూజీడీ పనులు జరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు. రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి, పైపులైనులు వేసిన అనంతరం జరిగా పూడ్చకపోవడంతో నగరం మొత్తం గుంతలమయంగా మారింది. యూజీడీ పనుల కోసం చేపట్టిన తవ్వకాల వల్ల భూమిలోని తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా తాగునీటిలోకి మురుగు చేరింది. దీంతో నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా వృద్ధి చెందింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా వ్యాధి ప్రబలి తొమ్మిది మందిని బలితీసుకుంది.

నిబంధనలు బేఖాతరు
నిబంధనల ప్రకారం రోడ్డును తవ్వి యూజీడీ పైపులైను వేసి మ్యాన్‌హోల్, ఇన్‌స్పెక్షన్‌ చాంబర్లను నిర్మించిన 15 రోజుల్లో రోడ్డును మళ్లీ పునర్నిర్మించాలి. అయితే నిబంధనల మేరకు రోడ్డును పునర్నిర్మించడంలేదు. యూజీడీ పనులు నిర్వహిస్తున్న పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు మధ్య సమన్వయం కరువైంది. అనేక ప్రాంతాల్లో యూజీడీ కోసం తవ్విన చోట వాటర్‌ పైపులైనులు పగిలిపోయాయి. అపార్టుమెంట్‌లు, ఇళ్లకు వెళ్లే పైపులైనులు ధ్వంసమవుతున్నా వాటిని బాగు చేయించిన దాఖలాలు లేవు. దీనిపై కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం.  

ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం
యూజీడీ పనుల వల్ల నగరంలో మంచినీటి పైపులైనులు లీకవడం, కొన్ని చోట్ల పగిలిపోయి మురుగునీరు అందులో చేరడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ మంచినీటి పైపులైనులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఇంజినీరింగ్‌ అధికారులకే తెలియదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట, సంగడిగుంట వంటి ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారు. అయితే ఆప్రాంతంలో యూజీడీ పనులు జరగలేదని, దాని వల్ల లీకులు ఏర్పడ్డాయనేది వాస్తవం కాదని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.


పొన్నూరు రోడ్డులో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కోసం తవ్విన చోట వాటర్‌ పైపులైనుకు లీకేజీ (ఇన్‌సెట్‌) పరిశీలిస్తున్న కార్మికుడు 

అయితే నగరంలోని మిగతా ప్రాంతాల్లో యూజీడీ పనుల వల్ల మంచినీటి పైపులైనులు లీకవుతున్న ఘటనలపై మాత్రం స్పందించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని గుజ్జనగుండ్ల, విద్యానగర్, పట్టాభిపురం, నల్లచెరువు, చంద్రబాబునాయుడు కాలనీ, కంకరగుంట, సంపత్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే డయేరియా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మరి కొందరు వ్యాధి బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. 

ఆందోళనలో నగర ప్రజలు 
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పైపులైనులు లీకై మురుగునీరు చేరింది. దీంతో తాగునీరు కలుషితమైంది. ఆ నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా చేరింది. ఈ బ్యాక్టీరియా కారణంగా వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారని డీఎంహెచ్‌ఓ జొన్నలగడ్డ యాస్మిన్‌ పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో సైతం యూజీడీపనుల వల్ల పైపులైనులు లీకవడం, పగిలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులను యూజీడీ పనులపై ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటూ సమాధానం చెబుతున్నారని నగరప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నగరంలో జరుగుతున్న యూజీడీ పనులపై పూర్తి స్థాయిలో సమీక్షించి మంచినీటి పైపులైనులు ఉన్నప్రాంతాల్లో తవ్వకాలు జరుపకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

కలెక్టర్‌ సమీక్షస్తున్నా..
నగరంలో రెండేళ్ల క్రితం మొదలైన యూజీడీ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పనులతీరుఐ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ పనులు నిర్వహించే సంస్థకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో వారు ఎవరినీ లెక్క చేయడం లేదని తెలుస్తోంది. కొద్దికాలంగా కలెక్టర్‌ కోన శశిధర్‌ ప్రతి వారం యూజీడీ పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement