సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఇంటి నంబర్ కనుక్కోవడం ‘కత్తి మీద సామే’. ఒకరకంగా పజిల్‌ను తలపిస్తుంది. ఈ సంక్లిష్టతను ఛేదిస్తూ ఇంటి నంబర్ల ఆచూకీని సులభతరం చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌ను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటి నంబర్ల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది.
ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు(టీఎండీపీ) కింద డిజిటల్ డోర్ నంబరింగ్(డీడీఎన్) సిస్టంను ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని శ్రీరాంనగర్‌లో పైలట్ ప్రాజెక్టు కింద విజయవంతంగా అమలు చేశారు. దానిని మరింత అభివృద్ధి చేస్తూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ 5వ, బాచుపల్లి 17వ, బండ్లగూడ 19వ డివిజన్‌లో కూడా డిజిటల్ నంబరింగ్ విధానం తీసుకొస్తున్నారు.
అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. ప్రతి ఇంటికీ కేటాయించిన ‘క్యూఆర్’కోడ్‌ను స్కాన్ చేస్తే ఇంటి యజమాని పేరు, చిరునామా వివరాలన్నీ తెలుస్తాయి. జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేసి, ఇతర ప్రభుత్వ శాఖలకు లింక్ చేయడంతో పన్నుల వసూళ్లు, ఇతర వివరాలన్నీ ఆ నంబర్ ద్వారా తెలిసిపోతుంది.
క్యూఆర్ కోడ్, డిజిటలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ దేశంలోని వివిధ పట్టణాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ఆధార్ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఈ డీడీఎన్ ప్రాజెక్టును అనుసంధానించాలని సర్కార్ నిర్ణయించింది. ముందుగా 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 16 అంకెల డిజిటల్ నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్నారు.
అన్ని నగరాలు, మునిసిపాలిటీల్లో ...
గత కొన్నేళ్లుగా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లను మార్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ఏదీ విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సహాయంతో డిజిటల్ డోర్ నంబరింగ్ విధానాన్ని రూపొందించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. డిజిటల్ డోర్ నంబరింగ్‌లో 16 అంకెలతో కూడిన కోడ్ ఉంటుంది. ఈ అంకెల్లోనూ మూడు విభాగాలుంటాయి. నగరం/పట్టణాన్ని తెలిపే కోడ్‌తోపాటు స్థానిక డివిజన్/వార్డును తెలిపేందుకు మరో కోడ్, స్థానిక కాలనీని తెలిపేందుకు ఇంకో కోడ్ ఉంటుంది.
ఈ మూడు కోడ్‌ల తర్వాత ఇంటికి ప్రత్యేక డోర్ నంబరును కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఆధారంగా ఇల్లు ఏ నగరం /పట్టణం... ఏ వార్డు/డివిజన్‌లో ఉన్నదో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఇంటి పలకపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన సమగ్ర వివరాలతోపాటు ఇంటి పన్ను, ఇతర పన్నుల వివరాలన్ని తెలిసిపోతాయి. చెల్లింపులు, బకాయి వివరాలు ప్రత్యక్షమవుతాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో క్యూ ఆర్ కోడ్ విధానంలో డిజిటల్ నంబరింగ్ సిస్టమ్‌ను త్వరగా అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆయా ఇళ్ల నుంచి చెత్త సేకరించేవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, రోజుకు ఎన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారన్న విషయం తెలుస్తుంది.
ఆస్తుల బదిలీకి అనుసంధానం
డిజిటల్ డోర్ నంబరింగ్‌లో కొత్తగా కేటాయించే డిజిటల్ నంబర్, క్యూఆర్ కోడ్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే లావాదేవీలకు అనుసంధానం చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో డిజిటల్ నంబర్ కేటాయింపు అనంతరం మనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఈ నంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వచ్చేలా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment