♦ ఎన్ని సార్లు చెప్పినా మీ వైఖరి ఇంతేనా?
♦ గడువు ముగిసినా జియోట్యాగింగ్ చేయరా!
♦ 50 శాతం కంటే తక్కువ చేసిన కార్యదర్శులకు నోటీసులు
♦ చెత్త సంపద కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై చర్యలు
♦ పంచాయతీ అధికారులపై డీపీవో కోటేశ్వరరావు ఆగ్రహం
అరసవల్లి :
‘మీకు ఎన్ని సార్లు మీటింగులు పెట్టి చెప్తున్నా వైఖరిలో మార్పు రావడం లేదు. జియోట్యాగింగ్ ఎంతో కీలకమైందని చెప్పాం. గడువు పూర్తవుతున్నా ఇంకా పూర్తి చేయలేదు.. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకే జిల్లాలో 50 శాతం కంటే తక్కువ ట్యాగింగ్ చేసిన పంచాయతీల కార్యదర్శులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నా..’’ అని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాలో మూడు డివిజన్లలోని పంచాయతీ అధికారులతో స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
సగం కూడా పూర్తికాలేదు
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ జియోట్యాగింగ్, చెత్త నుంచి సంపద కేంద్రాల ఏర్పాటు తదితర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌కు ఫైలు పంపిస్తున్నామని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జియోట్యాగింగ్‌ను తొలుత ఆగస్టు 15 కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా ఇప్పటికీ సగం కూడా పూర్తికాకపోవడం దారుణమమన్నారు. పైలట్ ప్రాజెక్టుగా భావించిన సోంపేటలో మాత్రమే 100 శాతం పూర్తి అయ్యిందన్నారు. పాలకొండ, భామిని, బూర్జ, రేగిడి ఆమదాలవలస, ఇచ్ఛాపురం, సంతకవిటి, కోటబొమ్మాళి, జలుమూరు మండలాల్లో పనితీరు చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పంచాయతీలు ప్రిస్‌లో లాగిన్ కాలేదని వీరిపైనా చర్యలకు దిగుతామని స్పష్టం చేశారు.
అన్ని పంచాయతీల్లో సంపద కేంద్రాలు
డీపీఆర్సీ జిల్లా కో–ఆర్డినేటర్ హేమసుందరరావు మాట్లాడుతూ జిల్లాలో చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్మాణాలను అన్ని పంచాయతీల్లో చేపట్టాలని, స్థల వివాదాలుంటే తహసీల్దార్లను సంప్రదించాలన్నారు. జిల్లాలో పొగిరి, వీరఘట్టం, అవలింగి, పోలాకి తదితర చోట్ల ఆదర్శంగా ఉండే చెత్త సంపద కేంద్రాలను తయారుచేశామని, వీటిని నమూనాగా చేసుకుని ప్రతి పంచాయతీ కేంద్రంలోనూ వీటిని ఓ పార్కుల్లా నిర్మించుకోవాలని కోరారు. పెర్ఫార్మెన్స్ గ్రాంట్లను ఎలా వినియోగించాలో తెలియని కార్యదర్శులు న్నారని, ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా వాటిని ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల 2వతేదీ నాటికి ప్రతి పంచాయతీని శుభ్రంగా తయారుచేసేలా అందరూ కృషిచేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం, పాలకొండ డీఎల్‌పీవోలు రమాప్రసాద్, సత్యనారాయణ, డీపీఆర్సీ సభ్యుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మరీ ఇంత నిర్లక్ష్యమా?
Published Wed, Sep 13 2017 8:54 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
Advertisement