హుదూద్ ఇళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న శిలాఫలకం
శ్రీకాకుళం, అరసవల్లి: అనర్హుల అక్రమాలు, రాజకీయ నేతల ఒత్తిళ్ల మధ్య.. జిల్లాకు వన్నె తెచ్చిన ఓ ఐఎఎస్ అధికారి ‘నిజాయితీ’ ఓడిపోయింది. జిల్లా కేంద్రంలో కంపోస్ట్ కాలనీలో నిర్మించిన హుదూద్ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలున్నాయని, అర్హులుగా చూపిన వారిలో అత్యధికంగా అనర్హులే ఉన్నారంటూ కలెక్టర్ ధనంజయరెడ్డి ఈ హుదూద్ ఇళ్ల ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశం రాజకీయ వ్యవహారంగా మారి జిల్లాలో పెనుదుమారమే రేపింది. ఎట్టకేలకు అధికార అగ్ర రాజకీయ నేతల ఒత్తిళ్ల ఫలితంగా వారి అక్రమాలకు ‘అడ్డు గోడ’లా ఉన్న ధనంజయరెడ్డిని పంపించేసి మరీ ఈ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈమేరకు శనివారం ఉదయం కంపోస్ట్ కాలనీలోని మొత్తం 192 ఇళ్లను రాష్ట్ర బీసీ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఈ కార్యక్రమంపై ఎటువంటి సమాచారం లేకపోగా, మంత్రి అచ్చెన్న షెడ్యూల్‌లో ఈ కార్యక్రమాన్ని చేర్చడంతో రాత్రికి రాత్రే శిలాఫలకాన్ని సిద్ధం చేసేశారు.
తుఫాన్‌కి మించి...
హుదూద్ తుఫాన్ వల్ల జిల్లా కేంద్రానికి పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఆ పేరుతో నిర్మించిన ఇళ్లు మాత్రం ఏకంగా కలెక్టర్ సీటుకే ఎసరు పుట్టేలా చేసినంత ప్రభావం చూపాయంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఓ అక్రమాల పుట్ట అని.. ఇళ్లు దక్కినట్లు తయారైన జాబితాలో దాదాపు 90 శాతం మంది వరకు అనర్హులే అని పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఈ హుదూద్ ఇళ్ల వ్యవహారం చర్చనీయాంశమైంది. అనర్హుల జాబితాను ఇటీవలే ‘సాక్షి’లో ప్రచురించడంతో ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. దీంతో సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ ధనంజయరెడ్డి, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఈ జాబితాను పక్కనపెట్టారు. దీనిపై సంతకం చేసేది లేదంటూ తేల్చి చెప్పేశారు. దీంతో అధికార పార్టీ నేతలు పట్టుబట్టి ఆయన్ను బదిలీ చేయించినట్లు తెలిసింది. అయితే కొద్ది నెలల క్రితమే బదిలీ చేస్తే అదంతా రాజకీయ బదిలీగా కన్పిస్తుందని, తాజాగా ఎన్నికల సమయం అంటూ బదిలీ చేసి, కలెక్టర్ నుంచి ఓ శాఖకు సీఈవోగా పంపించారు. హుదూద్ ఇళ్ల కేటాయింపు వ్యవహారంలో అక్రమాలుండడంతోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అనుకున్న ఈ ప్రారంభోత్సవం రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 2016లో నిర్మించిన ఇళ్లు మూడేళ్లు దాటినంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సిద్ధం చేసిన 192 మందితో కూడిన జాబితాపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అర్హులే లేరా...!
హుదూద్ ఇళ్ల కేటాయింపు జాబితాలో టీడీపీ నేతలే అత్యధికంగా ఉన్నారని, వీరి అక్రమాలకు వత్తాసు పలికేలా ఉండాలనే ఉద్దేశంతో సుమారు 38 మంది పత్రికా విలేకరులకు కూడా ఇళ్లు కేటాయించారనే విమర్శలున్నాయి. కంపోస్ట్ కాలనీలో మొత్తం 192 ఇళ్లు నిర్మిస్తే, ఇందులో వాస్తవంగా హుదూద్ తుఫాన్‌లో ఇళ్లు కోల్పోయిన ఇద్దరికి గృహాలు కేటాయించకపోవడం గమనార్హం. కేవలం టీడీపీ నేతలు, వారి బంధువులకే ఈ ఇళ్లన్నీ కేటాయించారని తేలడంతో కలెక్టర్ ధనంజయరెడ్డి దీనిపై విచారణకు ఆదేశించారు. 10 మంది రెవెన్యూ బృందంతో అర్హులని సిద్ధం చేసిన జాబితాలో వ్యక్తులను స్క్రూట్నీ చేశారు. ఇందులో కేవలం 53 మంది వరకు మాత్రమే నిజమైన అర్హులని తేలినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల కోడ్ రాకమునుపే తమ వారికి ఇళ్లు కేటాయించాలనే ఏకైక లక్ష్యంతో జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయించారు. శనివారం ప్రారంభోత్సావానికి సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment