మంజూరు కాని ఇళ్లకు భూమి పూజలు
జన్మభూమి సభల్లో అధికార పార్టీ నేతల హంగామా
ప్రజలను మభ్యపెట్టేందుకే స్టంట్!
ఇళ్లు నిర్మించుకుంటే ఇబ్బందులేనంటున్న అధికారులు
మండపేట :
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత గృహనిర్మాణ రుణాల మంజూరుకు పచ్చ జెండా ఊపింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరిట నియోజకవర్గానికి 1,250 చొప్పున, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్‌కు 500 చొప్పున మొత్తం జిల్లాకు 19,750 ఇళ్లను మంజూరు చేసింది. ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద 6,213 ఇళ్లను మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జీవో 23 కింద మంజూరైన ఆర్‌పీహెచ్ ఇళ్లను 2015-16 ఐఏవై మంజూరుగా పేర్కొంటూ ఆయా ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు ఐఏవై నిధులను సర్దుబాటు చేసింది. సుమారు 3,912 జీవో 23లోని ఇళ్లను ఐఏవై పథకానికి మార్పు చేసి కొత్త మంజూరు చేసినట్టు చూపించారని అంచనా.
ఇదిలాఉండగా నిబంధనల వల్ల ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపిక ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందాన ఉంది. తొలుత 75 శాతం ఇళ్లను సేకరించిన స్థలాల్లోనూ, మిగిలిన 25 శాతం సొంత స్థలాలు కలిగి ఉన్న పేదలకు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా గతంలో సేకరించిన వందలాది ఎకరాల ఇందిరమ్మ స్థలాల్లో మెరక పనులు జరుగలేదు. ఇళ్ల నిర్మాణానికి వీలైన ఇందిరమ్మ స్థలాల గుర్తింపు కష్టమవుతోందని ఉన్నతస్థాయి అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో సేకరించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని 65 శాతానికి తగ్గించి, సొంత స్థలాలు ఉన్న వారిని 35 శాతానికి పెంచింది. అయినా స్థలాల గుర్తింపు కష్టతరం కావడంతో ఆ శాతాన్ని 50 : 50గా మార్చి డిసెంబరు నెలాఖరవు నాటికి లబ్ధిదారుల జాబితాను అందజేయాలని సూచించింది. ఇప్పటికీ ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
ఆన్‌లైన్ కాకుండానే భూమిపూజలు
సాధారణంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన అనంతరం వారి రిజిస్ట్రేషన్ కోడ్‌తో వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. నిర్దేశించిన రిజిస్ట్రేషన్ కోడ్‌తో స్థలాన్ని జియోటాగింగ్ చేస్తారు. అయితే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికీ జరగలేదు, ఆన్‌లైన్ ప్రక్రియ కూడా మొదలుకాలేదు. అయినా జిల్లాలోని అమలాపురం, అనపర్తి, రాజోలు, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలు జన్మభూమి- మా ఊరు గ్రామ సభల్లో ఐఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరిట ఇళ్ల నిర్మాణానికి భూమిపూజలు చేస్తుండటం గమనార్హం. నేతలు కొబ్బరికాయలు కొట్టారు కదా అని ఇళ్లు నిర్మించుకుంటే ఇబ్బందులు తప్పవని ఆ శాఖకు చెందిన అధికారులే చెబుతున్నారు. లబ్ధిదారుని రిజిస్ట్రేషన్ కోడ్‌తో ఖాళీ స్థలాన్ని జీయోటాగింగ్ చేయకుండా బిల్లులు విడదల సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. గృహాల భూమి పూజలపై జిల్లా హౌసింగ్ పీడీ సెల్వరాజ్‌ను వివరణ కోరగా, లబ్ధిదారుల ఆన్‌లైన్ పూర్తికాలేదని, చేయాల్సి ఉందని చెప్పారు.
‘గూడు’పుఠాణి
Published Fri, Jan 8 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement
Advertisement