నిర్మాణంలో ఉన్న గృహం
సాక్షి, కర్నూలు(అర్బన్): జిల్లాలో ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం పక్కదారి పడుతోంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహాలకు బిల్లుల చెల్లింపు వరకు అనేక ప్రాంతాల్లో అడ్డగోలు వ్యవహారాలే నడుస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామాలు, పట్టణాల్లో జన్మభూమి కమిటీల సిఫారసుకు వదిలి వేయడంతో అధిక శాతం గృహాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి, తెలుగు తమ్ముళ్లకు ముడుపులు చెల్లించుకున్న వారికి మాత్రమే దక్కుతున్నాయి. ఇప్పటికే పలు మండలాల్లో ఆర్థికంగా ఒక స్థాయి ఉన్న టీడీపీ నేతలకు కూడా ఎన్‌టీఆర్ గృహాలు మంజూరయ్యాయి.
ఈ విషయం తెలిసినా..సంబంధిత డీఈ, ఏఈలు నోరుమెదపడం లేదు. పైపెచ్చు గృహాలు నిర్మించుకోకున్నా.. పాతవాటికి బిల్లులు మంజూరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో గృహాలు మంజూరైనా, నిర్మించుకోకుండా ఉన్న వారి జాబితాలను పరిశీలించి తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లను జాబితాల్లో చేరుస్తున్నారు. ముఖ్యంగా ఆదోని, పత్తికొండ, ఆలూరు, నందికొట్కూరు, నంద్యాల ప్రాంతాల్లోని గ్రామాల్లో అక్రమాలు భారీగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలకు కొందరు గృహ నిర్మాణ సంస్థకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది కూడా చేతులు కలపడంతో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
మున్సిపాలిటీల్లో దందా ...
జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు 2017–18 ఆర్థిక సంవత్సరానికి 19,185 గృహాలు మంజూరయ్యాయి. రూ.3.50 లక్షలతో ఒక్కో గృహాన్ని నిర్మిస్తుండడంతో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు మంజూరు అయినా, పలు కారణాల వల్ల రిజెక్టు అయిన వారి స్థానంలో మరొకరిని చేర్చేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు, మాజీలు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందాకు సంబంధించి జిల్లా గృహ నిర్మాణ సంస్థకు చెందిన అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి.
- మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో 15 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద బిల్లులు మంజూరు చేస్తున్నారు. అలాగే గ్రామంలో రెండు, మూడు అంతస్తుల సొంత ఇళ్లు కలిగిన యజమానులకు కూడా బిల్లులు మంజూరు చేశారు.
- ∙ఆదోని మండలం ఇస్వి గ్రామానికి ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 25 గృహాలు మంజూరు కాగా.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో గతంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించుకున్న ఐదు ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.80 వేలను మంజూరు చేశారు.
- ∙2017–18 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు బెనిఫీషరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ ( బీఎల్‌సీ ) కింద 19,185 గృహాలు మంజూరు కాగా.. వీటిలో అధికశాతం గృహాలు ముడుపులు చెల్లించిన వారికే మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
17,419 గృహాలు మాత్రమే పూర్తి ...
జిల్లాలో ఎన్‌టీఆర్ గృహ రూరల్, గ్రామీణ్, అర్బన్ పథకాల కింద మొత్తం 65,080 గృహాలు మంజూరు కాగా..ఇప్పటి వరకు 41,302 గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటిలో 17,419 గృహాలు పూర్తి అయ్యాయి. వీటిలో అనేక గృహాలకు గత నెల రోజులుగా బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం.
ఫిర్యాదులు అందిన మాట వాçస్తవమే
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న గృహ నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే. నాతోపాటు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఆదోని మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదోని ఈఈకి ఆదేశాలు జారీ చేశాం. ఈఈ విచారణ నివేదికలు అందిన వెంటనే చర్యలు చేపట్టి, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– కేబీ వెంకటేశ్వరరెడ్డి, హౌసింగ్ పీడీ
Comments
Please login to add a commentAdd a comment