రెండు రోజుల క్రితం వేసిన క్రషర్
సాక్షి, టెక్కలి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో ఆ పార్టీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది.. అయితే అప్పట్లో వారు చేపట్టిన పనుల్లోని డొల్లతనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. టెక్కలి మండలం పాతనౌపడలో గత టీడీపీ హయాంలో గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పరపటి చిన్నయ్యరెడ్డి (టీడీపీ) కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తూ గ్రామంలోనే సుమారు రూ.15 లక్షల అంచనా మేరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా శివాలయం వీధి నుంచి దెప్పినౌపడలో ఎస్‌డబ్ల్యూపీసీ సెంటర్ వరకు రోడ్డు పనులు చేశారు. అప్పట్లో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఈ పనులు నిలిపివేశారు.
అసంపూర్తిగా వదిలేసిన సుమారు 80 మీటర్ల రోడ్డుకు క్రషర్ వేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు తప్ప.. రోడ్డుపై క్రషర్ వేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఎటువంటి పనులు చేపట్టలేదు. రెండు రోజుల క్రితం ఇదే పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటపడింది. క్రషర్ వేయకుండా రికార్డుల్లో ఎలా నమోదు చేశారంటూ అధికారులు నిలదీయడంతో సదరు టీడీపీ మాజీ ఎంపీటీసీ బిత్తరపోయారు. చదవండి: సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక!
హడావుడిగా క్రషర్ వేయడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. గతంలో రికార్డుల్లో నమోదు చేసి క్రషర్ వేయకుండా.. ఇప్పుడు అధికారులు తనిఖీలు చేసిన తర్వాత క్రషర్ వేయడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో గ్రామస్తులు కొంత మంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ పనులు నిలిపివేశారు. గత ప్రభుత్వ హాయాంలో పాతనౌపడలో జరిగిన అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్న అక్రమాలు వెలుగు చూస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment