గుడిసెలో టీవీ ఉంటే.. పక్కా ఇల్లు కోత! | Govt cheating the people in Grant the house to poor | Sakshi
Sakshi News home page

గుడిసెలో టీవీ ఉంటే.. పక్కా ఇల్లు కోత!

Published Sat, Dec 9 2017 4:40 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM

Govt cheating the people in Grant the house to poor - Sakshi

సాక్షి, అమరావతి: ఈ రోజుల్లో టీవీలు లేని ఇళ్లు ఎక్కడున్నాయి? కాయకష్టం చేసే పేదలైనా, కాలు కదపని ధనికులైనా వినోదంతో సేదతీరే సాధనం అది. ఇప్పుడదే పేదలకు శాపంగా మారుతోంది. గూడులేని పేదల సొంతింటి కలను సర్కారు నీరుగారుస్తోంది. గుడిసెల్లో నివసించే వారికి చిన్నపాటి టీవీ ఉన్నా సరే ఉన్నత వర్గాల గాటన కట్టేస్తోంది. టీవీ, ద్విచక్రవాహనం, ఫ్రిజ్‌లలో ఏ ఒక్కటి ఉన్నా వారిని ప్రభుత్వం పక్కా ఇళ్లకు అనర్హులుగా తేల్చేసింది. గుడిసెల్లో ఉంటున్న 10.92 లక్షల పేద కుటుంబాల సొంతింటి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. 

1/3 వంతు పేదల ఏరివేత
రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న 31.52 లక్షల కుటుంబాలు సొంతిం టి కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిం చిన ప్రజా సాధికార సర్వేలో తేలింది. గుడిసెల్లో నివాసముంటున్న వీరం దరికీ గృహ నిర్మాణ పథకం కింద పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రకరకాల పేరుతో 1/3 వంతు మందిని ఏరివేసి అనర్హులుగా చెబుతోంది. గుడిసెల్లో నివసిస్తున వారిలో దాదాపు పది లక్షల మందిని పక్కా ఇళ్లకు అనర్హులుగా నిర్ధారించినట్లు సమాచార, ప్రసార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు సైతం కొద్ది రోజుల కిత్రం అధికారులతో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు.

అవి లేని ఇళ్లున్నాయా?
ప్రజా సాధికార సర్వే ఆధారంగా గుడిసెల్లో నివాసముంటున్న 10.92 లక్షల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత వర్గాలుగా పేర్కొంది. వారు ప్రభుత్వం ఇచ్చే సొంతింటికి అనర్హులని తెలిపింది. దీనికి సర్కారు చెబుతున్న కారణం వారు టీవీ, ద్విచక్రవాహనం, ఫ్రిజ్‌ లాంటివి కలిగి ఉండటం. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఇలాంటి వస్తువులు కనిపిస్తున్నాయి. స్తోమత లేనివారు పాతవి కొనుగోలు చేయటం లేదంటే ఎవరైనా ఉదారంగా ఇచ్చినవి వాడుకోవటం చేస్తున్నారు. ఇవి ఉన్నాయనే కారణాలతో తమను అనర్హులుగా ప్రకటించటంపై పేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించిన సర్వేలో సొంతిళ్లు లేవని నిర్థారించిన తరువాత అనర్హులుగా పేర్కొనటం ఏమిటని మండిపడుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకూ బిల్లులివ్వలేదు..
గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరై నిధుల కొరత కారణంగా 2.60 లక్షల ఇళ్లు రూఫ్‌ లెవల్‌లో ఆగిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం గతంలో గుర్తించింది. వీటిని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్‌ ధర రూ.70 వేలుకు అదనంగా మరో రూ.25 వేలు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా ‘ఇందిరమ్మ’ ఇళ్ల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు పేదలు నిర్మించుకునే ఇళ్లకు యూనిట్‌ ధరను రూ.70 వేలు నుంచి రూ.1.50 లక్షలకు పెంచినట్లు ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం ఆ మేరకు బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద మంజూరు చేసిన వాటిలో 1.12 లక్షల ఇళ్లు, ఇందిరమ్మ పథకం కింద మంజూరై వివిధ దశల్లో ఆగిపోయిన వాటిలో 10,426 ఇళ్లు పూర్తి చేశామని మంత్రి కాలువ శ్రీనివాసులు ఇటీవల ప్రకటించారు. అయితే వీటిలో ఏ ఒక్క ఇంటికి కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement