
టీడీపీ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు నిలువనీడ లేకుండా చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన ఇందిరమ్మ పథకాన్ని ఎన్టీఆర్ గృహకల్ప పథకంగా మార్చిన ప్రభుత్వం ఆ పథకంలో మంజూరైన గృహాలను లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకనే రద్దుచేసి ఆన్‌లైన్ నుంచి వివరాలను తొలగించింది. వైఎస్‌ఆర్ హయాంలో 3దశల ఇందిరమ్మ పథకం ద్వారా 3,23,473 గృహాలను పేదలకు మంజూరుచేశారు. అనంతరం టీడీపీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిర్మాణంలోని ఇళ్లకు బిల్లులు ఆపేసింది. వివిధ దశల్లోని నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
చిత్తూరు, బి.కొత్తకోట: జిల్లాలో మూడు విడతల్లో మంజూరైన ఇందిరమ్మ గృహాల్లో 70,483 గృహ నిర్మాణాలను లబ్ధిదారులు చేపట్టలేకపోయారు. పేదలు కావడంతో నిర్మాణాలు చేపట్టేందుకు జాప్యం చేశారు. గత ప్రభుత్వం వరకు ఈ గృహాలు అధికారికంగా మనుగడలోనే ఉన్నాయి. మంజూరైన వాటిలో ఇవి ఇంకా ప్రారంభం కాని గృహాల జాబితాలో ఉంచి లబ్ధిదారులు నిర్మాణాలను ఎప్పుడైనా చేపట్టే వీలు కల్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు. ఇందిరమ్మ పథకానికి రూపాయి విదల్చలేదు. ఫలితంగా జిల్లాలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. చేసిన ఖర్చంతా వృథా అయ్యింది. చివరకు ఈ ఇళ్లను ప్రారంభం కాని జాబితా నుంచి తొలగించి రద్దు చేశారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పక్కా గృహాలు కోల్పోయారు. కాగా ఇందిరమ్మ పథకంలో పునాదులు, గోడల స్థాయిలో జరిగిన ఇంటి నిర్మాణాలకు అప్పటి యూనిట్ విలువకు అదనంగా రూ.25వేలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల కూడా లబ్ధిదారులకు ప్రయోజనం లేదు. ఇందిరమ్మ పథకంలో పునాదుల స్థాయిలో 4,085 గృహాలు, గోడల స్థాయిలో 27,774 గృహాలు ఉండగా అందులో 11,238 గృహాలకు మాత్రమే అదనపు చెల్లింపులు వర్తింపజేశారు. మిగిలిన గృహాలు దీనావస్థలో అసంపూర్తిగా మిగిలిపోయాయి.
ఇందిరమ్మ స్థానంలో ఎన్టీఆర్..
ఇందిరమ్మ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం దాని స్థానంలో ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని తీసుకొచ్చింది. 70,483 గృహాలను రద్దుచేసిన ప్రభుత్వం 2016–17 నుంచి 2019–20 వరకు నాలుగు విడతల్లో గ్రామీణ, పట్టణ, గ్రామీణ్ పథకాల ద్వారా 95,295 ఇళ్లు ఇచ్చింది. రద్దయిన ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించి ఉంటే పేదలకు ప్రయోజనం కలిగి అదనంగా పేదలకు ఇళ్లు దక్కేవి. 70,483 ఇళ్లను రద్దుచేసిన ప్రభుత్వం వీటికి అదనంగా 24,812 ఇళ్లను కలిపి 95,295 గృహాలను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల రద్దుతో గృహాల మంజూరుకు అవసరమైన పేదల సంఖ్య పెరిగింది. ఇళ్లకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మంజూరు కోసం ఎదురుచూస్తుంటే పల్స్ సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కట్టబెట్టారు.
రద్దయ్యాయి
జిల్లాలో నిర్మాణాలు ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లు రద్దయ్యాయి. మంజూరైన లబ్ధిదారులు ఇళ్లు కోల్పోయారు. వీరికి ఇందిరమ్మ పథకంలో అవకాశం లేదు. పునాదులు, గోడల వరకు నిర్మాణాలు చేసుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు యూనిట్ విలువకు అదనంగా రూ.25వేలు చెల్లిస్తున్నాం. –రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment