మార్చికి గృహ నిర్మాణాలు పూర్తి
మార్చికి గృహ నిర్మాణాలు పూర్తి
Published Mon, Jan 23 2017 9:39 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
– అన్ని కాలనీల్లో క్రీడా ప్రాంగణం, పార్కులు
– మున్సిపాలిటీల్లో సొంత స్థలం ఉంటే
బీఎల్‌సీ గృహాలు
– గృహాల మంజూరులో
దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్
– మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని
కర్నూలు(అర్బన్): మార్చి నెలాఖరు నాటికి జిల్లాలో ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ప్రారంభించిన గృహ నిర్మాణాలన్ని పూర్తి కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిణి ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఆమె హౌసింగ్, డ్వామా, డీఆర్‌డీఏ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్, హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్, జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్, డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మృణాళిని మాట్లాడుతూ జిల్లాకు ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 14,750 గృహాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 11,883 గృహాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చారని, మిగిలిన గృహాలకు కూడా ఈ నెలాఖరు నాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. వచ్చే నెల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో నిర్మించే ఎన్‌టీఆర్ కాలనీల్లో డ్వామా, డీఆర్‌డీఏ సహకారంతో ఒక క్రీడా ప్రాంగణం, ఒక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్‌టీఆర్ గ్రామీణ్ పథకం కింద మంజూరైన గృహాలను కూడా మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఆయా పథకాలకు సంబంధించిన గృహాల మంజూరులో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
మున్సిపాలిటీల్లో సొంత స్థలం ఉంటే ఇళ్లు ...
జిల్లాలోని అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో సొంత స్థలాలు ఉంటే రూ.3.50 లక్షలతో ఇళ్లు నిర్మించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే బీఎల్‌సీ గృహాల మంజూరులో కర్నూలు చాలా వెనుకబడి ఉందన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో మాత్రమే ఈ పథకం కింద 650 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఈ విషయంపై హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్ మాట్లాడుతూ జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీల్లో హౌస్ ఫర్ ఆల్ పథకం కింద ఇళ్లు నిర్మించేందుకు దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. గత ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో ఆగిపోయిన గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఫారంపాండ్ తీసుకున్న రైతులకు 2,380 ఆయిల్ ఇంజన్లు ...
జిల్లాలో ఫాంపాండ్స్ తవ్వుకున్న రైతులకు ఇప్పటి వరకు 2,300 ఆయిల్ ఇంజిన్లు మంజూరు చేసినట్లు డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి చెప్పారు. సమీక్షలో భాగంగా మంత్రి మృణాళిని జిల్లాలోని వాటర్‌షెడ్, ఉపాధి పనులు, ఫారంపాండ్స్, ఎన్‌టీఆర్ జలసిరి తదితర వాటి గురించి సమీక్షించారు.
Advertisement
Advertisement