
ఇళ్లు.. ఇంకెన్నాళ్లు!
ఊరిస్తున్న ఎన్టీఆర్ గృహాలు
► జిల్లాకు మంజూరైంది 14,750
► ఇన్‌చార్జి మంత్రి ఆమోదం లభించిన ఇళ్లు 11,850
► 2,900 గృహాలకు నేటికీ అందని జాబితా
► ఆరు నిబంధనల పేరిట తొలగింపులు
కర్నూలు(అర్బన్): ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అరచేతిలో వైకుంఠాన్ని తలపిస్తోంది. ప్రభుత్వం ప్రజలను ఊహల పల్లకీలో విహరింపజేస్తుందే తప్ప.. ఆచరణలో విఫలమవుతోంది. జిల్లాలో కర్నూలు మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14,750 గృహాలు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి గృహ వసతి లేని నిరుపేదలను గుర్తించి రూ.2.75 లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నది పథకం ఉద్దేశం. గృహ వసతి లేని పేదల గుర్తింపు బాధ్యతను ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు అప్పగించింది. ఈ ప్రక్రియ పూర్తయినా వివిధ కారణాలతో పథకం నేటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. భూ సేకరణ, లబ్ధిదారుల ఎంపికను డిసెంబర్ 30, 2015 నాటికి పూర్తి చేసి.. జనవరి 30, 2016 నాటికి ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను తెరిచి పనులను ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాత 180 రోజుల్లో ఇళ్లు పూర్తి చేయాలనేది కార్యాచరణ. అయితే నేటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో లేఔట్లను కూడా గుర్తించకపోవడం గమనార్హం.
11,850 గృహాలకు ఇన్‌చార్జి మంత్రి ఆమోదం
జిల్లాలోని ఆదోని, నంద్యాల నియోజకవర్గాల్లో 500 ప్రకారం, మిగిలిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1250 ప్రకారం జిల్లాకు మొత్తం 14,750 గృహాలు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు 11,850 గృహాలకు మాత్రమే జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం లభించింది. ఇంకా 2,900 గృహాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసిన జాబితా ఆయా నియోజకవర్గాల్లోని జన్మభూమి కమిటీల నుంచి జిల్లా అధికారులకు అందాల్సి ఉంది.
లబ్ధిదారులకు ని‘బంధనాలు’
జన్మభూమి కమిటీలు సిఫారసు చేసినా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం లభించినంత మాత్రాన ఇళ్లు మంజూరైంది అనుకుంటే పొరపాటే. ఆ తర్వాత నుంచే అసలైన తతంగం ప్రారంభమవుతుంది. ఇన్‌చార్జి మంత్రి ఆమోదం లభించిన ఇళ్లకు సంబంధించి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆరు నిబనంధనలను విధించింది. ఈ మేరకు అన్ని అర్హతలు ఉంటేనే ఓ ఇంటి వారయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిబంధనల మేరకు లబ్దిదారుల ఎంపిక జరిగిందా? లేదా? అనే విషయాలను ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తారు. వీరి పర్యవేక్షణలో నిబంధనలకు లోబడిన వారిని ఎంపిక చేసి మిగిలిన వారిని ఎంపికైన జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి.
ని‘బంధనాలు’
► లబ్ధిదారునికి 5 ఎకరాల ఆయకట్టు, లేదా 10 ఎకరాలు మెట్ట భూమి ఉండరాదు.
► కుటుంబ సభ్యుల్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు.
► ప్రతి నెలా విద్యుత్ బిల్లు రూ.500 లోపు ఉండాలి.
► నాలుగు చక్రాల వాహనం ఉండరాదు.
► నాలుగు నెలలకు మించకుండా రేషన్ తెచ్చుకోవడంలో బ్రేక్ ఉండరాదు. ప్రతి నెలా ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ సరుకులు తీసుకుంటున్న వారే అర్హులు.
► ఆధార్ యుఐడీ ఇన్‌వ్యాలిడేషన్ ఉండరాదు.