అన్నకు కమీషన్‌.. ఆ తర్వాతే పర్మిషన్‌ | Bribery Demanding In Subregister Office Anantapur | Sakshi
Sakshi News home page

అన్నకు కమీషన్‌.. ఆ తర్వాతే పర్మిషన్‌

Published Mon, Feb 25 2019 11:56 AM | Last Updated on Mon, Feb 25 2019 11:56 AM

Bribery Demanding In Subregister Office Anantapur - Sakshi

ఇక్కడ కనిపిస్తున్నది ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకుడు. ఆ పార్టీ లెక్క ప్రకారం హార్డ్‌కోర్‌ టీం సభ్యుడు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయనేంటి ఆఫీస్‌లో లెక్కలు రాస్తున్నారనుకుంటున్నారా..? అవును ఆయన ప్రతి రోజూ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వచ్చి ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. ఏయే భూమి రిజిస్ట్రేషన్‌ వాల్యూ ఎంత.. అని నమోదు చేసుకుని ప్రజాప్రతినిధికి అందజేస్తారు. ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో రిజి        స్ట్రేషన్‌ అయిన భూముల విలువకు లెక్కగట్టి మరీ స్థానిక ప్రజాప్రతినిధి మామూళ్లు వసూలు చేస్తారన్నమాట..

ఇసుకలో కూడా నూనెపిండటానికి అలవాటు పడ్డ ధర్మవరం తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా భూములను తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘08’ స్కీం  (ప్రొహిబిటెడ్‌ ప్రాపర్టీ లిస్ట్‌) వీరికి మూడు రిజిస్ట్రేషన్లు.. ఆరు కమీషన్లు అన్న చందంగా లాభాలను ఆర్జిస్తున్నారు. ఏకంగా కార్యాలయంలో తన మనుషులను ఏర్పాటు చేసి, ప్రతి రోజూ జరిగే లావాదేవీల ఆధారంగా కమీషన్లు తీసుకున్నారు. సదరు ముఖ్యనేతకు తెలియకుండా ఏ ఒక్క రిజిస్ట్రేషన్‌ జరిగినా సబ్‌రిజిస్ట్రార్‌ నానా మాటలు పడాల్సిందే.  

అనంతపురం, ధర్మవరం: ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోకి ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, మండలాలతోపాటు ముదిగుబ్బ మండలంలో కొంత భాగం వస్తుంది. ప్రస్తుతం భూములకు విలువలు పెరగడం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల పరిధితోపాటు ధర్మవరం పట్టణ పరిధిలో రిజిస్ట్రేషన్లు సగటున 30 నుంచి 40 దాకా జరుగుతాయి. ఒక గ్రామంలో సగటున వెయ్యి సర్వే నంబర్లు ఉంటే దాదాపు 200 దాకా సర్వే నంబర్లు నిషేధిత జాబితాలోకి చేర్చారు. ప్రతి పట్టణంలోనూ కనీసం 30 శాతం సొంత స్థలాలు అసైన్డ్‌ ల్యాండ్స్‌గా రికార్డుల్లో నమోదయ్యాయి. సొంత స్థలాలను తమ అవసరాల నిమిత్తం అమ్ముకోవడానికి, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి, ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు వీలులేకుండా పోయింది. మరికొన్ని ప్రాంతాల్లో టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (మున్సిపల్‌ అప్రూవల్‌) అయిన లేఅవుట్లు,  ఒక ధర్మవరం çమున్సిపాలిటీ పరిధిలో సుందరయ్యనగర్, దుర్గానగర్, తారకరామాపురం, టీచర్స్‌కాలనీ, గూడ్స్‌షెడ్‌కొట్టాల, శివానగర్‌ తదితర కాలనీల్లో కాలనీకి 100 నుంచి 150 దాకా సర్వే నంబర్లు ప్రొహిబిటెడ్‌ జాబితాలోకి చేర్చారు. దీన్ని ఆసరాగా చేసుకుని నియోజకవర్గంలో రాజకీయాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. మీ భూములు రిజిస్ట్రేషన్‌ అయ్యేలా చేస్తాం.. పార్టీలోకి చేరండి.. మీ భూమి వివాదంలో ఉంది.. పార్టీలోకి చేరితే ఆ సమస్యను ‘అన్న’ పరిష్కరిస్తారనేంత స్థాయికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని వాడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ఎకరాలు రాయించుకున్న వైనం
ఈ ‘08’ వ్యవహారం కారణంగా చాలా ప్రాంతాల్లో వెంచర్లు వేసి రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడ్డ రియల్టర్లు ఉన్నారు. ఈ వ్యహారాన్ని స్థానిక టీడీపీ ముఖ్యనాయకుడు చాలా తెలివిగా క్యాష్‌ చేసుకున్నాడన్న ఆరోపణలు లేకపోలేదు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ రియల్టర్‌ వెంచర్‌ వేయగా, దాన్ని రిజిస్ట్రేషన్‌ కాకుండా అడ్డుకుని అందులో కొంత భాగం ఇచ్చిన తరువాత రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

చెప్పినట్లు వింటే ఉండు..  లేకపోతే వెళ్లిపో!
ఈ వ్యహారాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా ఉంటేనే ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్లను పనిచేయనిచ్చారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు భరించలేక ఎంతోమంది అధికారులు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ధర్మవరం సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. వారు చెప్పినట్లు వినలేము.. వారు అడిగినంత మామూళ్లు ఇచ్చుకోలేమంటూ ఇక్కడి నుంచి బయటికి పడితే చాలు స్వామీ..? అంటూ హడలెత్తిపోతున్నారు. దాదాపు ఎనిమిది మంది సబ్‌రిజిస్ట్రార్లు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లిపోయారు. తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులను అవినీతి నిరోధకశాఖకు పట్టిస్తామని బెదిరించి పనులు చేయించారు. ఆఖరుకు తనకు బాగా తెలిసిన వ్యక్తిని ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు ఇప్పించి, ఆయన అడుగులకు మడుగులొత్తేలా చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement