
సాక్షి, హైదరాబాద్ : తపాలా బిళ్లల సేకరణ విద్యార్థులకు సరదా అలవాటు.ఇది వారిలో సృజనాత్మకతను, ఓ అంశంపై ఏకాగ్రతను పెంచుతుందని నిపుణులు చెబుతారు. ఇప్పుడు ఆ అలవాటు కాసులను కూడా రాల్చనుంది. తపాలా బిళ్లల సేకరణపై మనసు లగ్నం చేసేవారికి కేంద్రప్రభుత్వం ఏకంగా ఉపకార వేతనం (స్కాలర్‌షిప్) అందించనుంది. పోస్టాఫీసుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు వారిలో తపాలాబిళ్లల సేకరణ అలవాటును పెంచాలని నిర్ణయించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరిమిత సంఖ్యలో ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఎంపికైన వారికి రూ.ఆరు వేల ఆర్థిక సాయం అందుతుంది. దీన్ని ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున తపాలాశాఖ చెల్లిస్తుంది. దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో స్పర్శ్ (ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్)ను స్కాలర్‌షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీగా పేర్కొంది.
ఎంపిక విధానం ఇలా...: తొలివిడతగా దేశవ్యాప్తంగా 920 స్కాలర్‌షిప్స్ మంజూరయ్యాయి. ప్రతి తపాలా సర్కిల్‌కు మొదట 40 చొప్పున మంజూరు చేశారు. ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక్కో తరగతికి 10 చొప్పున పంచారు. ఇందులో పాల్గొనాలనుకుంటున్న విద్యార్థి కచ్చితంగా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతుండాలి. ఆ పాఠశాలకు ప్రత్యేకంగా తపాలా బిళ్లల సేకరణ క్లబ్ ఉండాలి. ఆ క్లబ్ లేనప్పటికీ నేరుగా విద్యార్థి ఫిలటెలీ డిపాజిట్ ఎకౌంట్ తీసుకుని ఉన్నా సరిపోతుంది. ఆ విద్యార్థి కనీసం 60 మార్కులతో ఉత్తీర్ణుడైన మెరిట్ అర్హత ఉండాలి. తపాలా తెలంగాణ సర్కిల్ నిర్వహించే తపాలా బిళ్లలకు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ చేయటంతోపాటు ఆ సర్కిల్ నిర్వహించే క్విజ్‌లో పాల్గొనాలి. ఇందులో మెరుగైన ప్రదర్శన నిర్వహించిన వారిని పోస్టల్ కమిటీ ఎంపిక చేస్తుంది. వారికి ఏడాది వరకు స్కాలర్‌షిప్ అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment