విజయవాడ నుంచి స్టాంపుల సరఫరా
విజయవాడ నుంచి స్టాంపుల సరఫరా
Published Sat, Oct 22 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
– గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయి
– జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య
కోవెలకుంట్ల: జిల్లాలోని రిజస్టర్ కార్యాలయాల్లో రూ. 10, రూ. 20, రూ. 50 స్టాంపుల కొరత ఉందని, అయితే విజయవాడ నుంచి అవి సరఫరా కావాల్సి ఉందని జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య చెప్పారు. శనివారం కోవెలకుంట్ల రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కోవెలకుంట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ. 4.50 కోట్లు, ఆళ్లగడ్డకు రూ. 6.67కోట్లు, బనగానపల్లెకు రూ. 6.58కోట్లు, నంద్యాలకు రూ. 29.06కోట్లు, అవుకుకు రూ.2.22కోట్లు, పాణ్యంకు రూ. 2.42 కోట్లు, శిరువెళ్లకు రూ. 4.47కోట్లు, బండి ఆత్మకూరుకు రూ. 2.38కోట్లు, బేతంచెర్లకు రూ. 2.45కోట్లు, ఆత్మకూరుకు రూ. 4.16 కోట్లు రెవెన్యూ రాబడిని లక్ష్యంగా పెట్టినట్లు వెల్లడించారు.మార్చి ఆఖరుకల్లా ఈ లక్ష్యాన్ని అధిగమిస్తామని చెప్పారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు తగ్గాయని చెప్పారు. గ్రామకంఠం స్థలాల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకి తొలగిపోయిందని, ఈ సర్వే నంబర్లలోని స్థలాలను క్రమ విక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సబ్ రిజిస్టర్ నాగన్న, సీనియర్ అసిస్టెంట్ షంషుద్దీన్ పాల్గొన్నారు.
22కెకెఎల్04: సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య
Advertisement