AP Government Arrangements For Digital‌ Stamp System - Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లలో సరికొత్త శకం.. ఏపీలో సేవలు మరింత చేరువ

Published Sat, Mar 19 2022 8:00 AM | Last Updated on Sat, Mar 19 2022 9:48 AM

AP Government Arrangements For Digital‌ Stamp System - Sakshi

సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్‌ విధానంలో సమూల మార్పులను తీసుకొచ్చి డిజిటల్‌ స్టాంపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, అవకతవకలకు ఈ విధానంతో తెర పడనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే డిజిటల్‌ స్టాంపులను అందుబాటులోకి తేవడంతోపాటు డిజిటల్‌ చెల్లింపులన్నీ అక్కడి నుంచే పూర్తి చేసే వ్యవస్థకు శ్రీకారం చుడుతుండడంతో వినియోగదారులకు రిజిస్ట్రేషన్ల సేవలు మరింత చేరువ కానున్నాయి.

చదవండి: AP: రూ.100 కోట్లతో ల్యాబ్‌లు బలోపేతం

తరలింపులో పలు సమస్యలు..
ప్రస్తుతం 90 శాతం నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల విక్రయాలు స్టాంపు వెండార్ల ద్వారానే జరుగుతున్నాయి. అవసరాన్ని బట్టి రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంప్‌ పేపర్లను ఆర్డర్‌ ఇచ్చి నాసిక్‌లోని కేంద్ర ముద్రణ సంస్థ నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ తెప్పిస్తోంది. వాటిని రాష్ట్రానికి తరలించడం, భద్రపరచడం, జిల్లా రిజిస్ట్రార్లకు పంపడం, అక్కడ నుంచి స్టాంపు వెండార్లకు సరఫరా చేయడం కష్టతరంగా మారింది. స్టాంపు పేపర్లకు ఆర్డర్‌ ఇవ్వడం నుంచి వెండార్ల ద్వారా విక్రయించడం వరకు పలు సమస్యలు, వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నాయి. పాత తేదీలతో స్టాంపుల విక్రయాలు లాంటి అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. రవాణా, నిల్వ, సరఫరా కోసం రూ.కోట్లలో ఖర్చు కావడంతోపాటు పని భారం పెరుగుతోంది. డిజిటల్‌ స్టాంపులతో ఈ సమస్యలన్నింటికీ తెర పడుతుంది.

స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలూ అక్కడే.. 
డిజిటల్‌ స్టాంపుల విక్రయాలు జరిగే కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌ చార్జీలు, యూజర్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే సౌలభ్యం తెస్తున్నారు. ప్రస్తుతం ఈ చార్జీలను వినియోగదారులు డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా బ్యాంకు చలానాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ చలానాలను తీసుకునే వద్ద ఇటీవల భారీ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. చలానాలు దుర్వినియోగం కాకుండా చెల్లింపుల్లో పారదర్శకత తెస్తూ ఎస్‌హెచ్‌íసీఐఎల్‌ కేంద్రాల్లోనే ఆన్‌లైన్‌లో చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనిద్వారా వినియోగదారులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ఈ కేంద్రాల వద్ద ఆన్‌లైన్‌లో డిజిటల్‌ స్టాంపులను కొనుగోలు చేసి అక్కడే స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు స్టాంప్‌ పేపర్లను కొనకుండా నేరుగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారానే ఆ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. స్టాంప్‌ డ్యూటీని ఆన్‌లైన్‌లోనే చెల్లించి రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్‌ను నేరుగా డిజిటల్‌గా పొందవచ్చు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు ఖర్చు, పని భారం తగ్గడంతోపాటు వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. అవకతవకలు, మధ్యవర్తుల ప్రమేయానికి తెర పడుతుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ విధానాన్ని తీసుకురావాలని గతంలో చాలా ప్రభుత్వాలు ప్రతిపాదించినా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దీన్ని సాకారం చేస్తూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతోంది.

ఎస్‌హెచ్‌సీఐఎల్‌తో ఒప్పందం.. 
దేశంలో డిజిటల్‌ స్టాంపుల వ్యవస్థ అమలు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు(ఎస్‌హెచ్‌సీఐఎల్‌) అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థ ద్వారానే డిజిటల్‌ స్టాంపుల విక్రయాల కోసం ఎంవోయూ కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈ సంస్థ గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, స్టాంప్‌ వెండార్లతో ఎక్కడికక్కడ ఒప్పందాలు చేసుకుని డిజిటల్‌ స్టాంపుల విక్రయాలను నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇంటర్‌ మీడియట్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోసుమారు 3 వేల కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్లకు వీటి విక్రయాల బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే 37 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు డిజిటల్‌ స్టాంపులను వినియోగదారులు అక్కడే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

త్వరలో అందుబాటులోకి...
డిజిటల్‌ స్టాంపుల వ్యవస్థ చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఎస్‌హెచ్‌సీఐఎల్‌తో ఒప్పందం చేసుకున్నాం. 10 రోజుల్లో ఆ సంస్థ రాష్ట్రంలో పని ప్రారంభిస్తుంది. త్వరలో డిజిటల్‌ స్టాంపుల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల పూర్తిస్థాయి పారదర్శకత ఏర్పడుతుంది.
వి.రామకృష్ణ, కమిషనర్‌ అండ్‌ ఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement