
పత్రాలపై ముద్రించిన స్పెషల్ అడెసివ్ స్టాంప్
- కొత్తగూడెంలో ఏర్పడిన కొరత
- ఫ్లాంకింగ్ మిషన్ లేక ఇబ్బందులు
- దోచుకుంటున్న వెండర్లు, దళారులు
- పట్టించుకోని రిజిస్ట్రేషన్ల శాఖ
కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెంలో స్పెషల్ అడెసివ్ స్టాంప్(ఎస్‌ఏఎస్)ల కొరత ఏర్పడింది. స్టాంపులు కావాల్సిన వారు ఖమ్మం, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కొత్తగూడెంలో ముద్రణ యంత్రం లేకపోవడంతో.. ఖమ్మం, భద్రాచలం స్టాంప్ వెండర్ల వద్దకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇళ్లు కట్టుకోవాలన్నా.. పెళ్లి చేసుకోవాలన్నా.. పిల్లలను పై చదువులకు విదేశాలకు పంపించాలన్నా.. మార్ట్‌గేజ్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తదితర రుణాలు బ్యాంకు నుంచి పొందాలంటే.. ఎస్‌ఏఎస్ స్టాంప్‌లు తప్పని కావాల్సి ఉంది. కొత్తగూడెంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం రూ.10, రూ.20 విలువచేసే స్టాంప్‌లు మాత్రమే లభిస్తుంటాయి. కానీ.. రుణానికి సంబంధించి ఎంత మొత్తానికి రుణం కావాలనుకుంటామో.. దానికనుగుణంగా రూ.100 నుంచి ఎంత మొత్తానికైనా స్టాంపింగ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారానే రుణం పొందుతున్న వ్యక్తికి, బ్యాంకుకు మధ్య ఒప్పందం జరుగుతుంది. కేవలం రూ.10, రూ.20 స్టాంపులు మాత్రమే ఇక్కడ లభిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా.. 2012 వరకు రాము అనే వ్యక్తి ఫ్లాంకింగ్ యంత్రం లైసెన్స్ కలిగి.. స్టాంప్ వెండర్‌గా ఉండేవాడు. అతడు మృతిచెందడంతో ఆ లైసెన్స్ రద్దు చేశారే తప్ప తిరిగి ఎవరికీ కేటాయించలేదు.
దండుకుంటున్న దళారులు
ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయం, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, బూర్గంపాడు, వైరా, కల్లూరు, కూసుమంచి.. ఇలా 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఖమ్మం కార్యాలయృలో మాత్రమే స్టాంపులను ముద్రించే ఫ్లాంకింగ్ మిషన్ అందుబాటులో ఉంది. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రైవేటు లైసెన్స్‌డ్ స్టాంప్ వెండర్లు ఉండగా.. ఇతర ప్రాంతాల్లో స్టాంపులు అందుబాటులో లేవు. దీంతో దళారులు స్టాంప్ ముద్రలు అవసరమైన వారి నుంచి అధికంగా దండుకుంటూ.. వారే ఇతర ప్రాంతాలకు వెళ్లి స్టాంప్ వెండర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని స్టాంప్‌లు వేయిస్తున్నట్లు సమాచారం. స్టాంపునకు అవసరమైన దానితోపాటు దాని మొత్తానికి 10 నుంచి 20 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. రూ.వెయ్యి స్టాంప్ వేయాల్సి ఉంటే.. అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారని, రానుపోను చార్జీలు మరింత అదనంగా వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముద్రణ యంత్రాలు అందుబాటులో ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కొత్తగూడెంలో ఫ్లాంకింగ్ మిషన్ లైసెన్స్ కోృÜం ఆరు నెలల క్రితం రెండు దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ చెప్పారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ సుభాషిణిని వివరణ కోరగా.. జిల్లాలో ఫ్లాంకింగ్ మిషన్ ఒక్కటే ఉందని, దీనికోసం ముగ్గురు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. స్పెషల్ అడెసివ్ స్టాంపులు అందుబాటులో లేకపోతే నాన్ జ్యుడీషియల్ స్టాంపులు వాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.