డాక్యుమెంట్ రైటర్‌పై హత్యాయత్నం
- సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘటన
- పరుగులు తీసిన జనం
- లొంగిపోయిన నిందితుడు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు, స్థల క్రయ, విక్రయదారులు, అధికారులు, సిబ్బంది అందరూ చూస్తుండగానే డాక్యుమెంట్ రైటర్‌పై ఓ వ్యక్తి మారణాయుధంతో హత్యాయత్నం చేశాడు.ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మడకశిరలో సంచలనం రేపింది.
మడకశిరకు చెందిన అతావుల్లా (52) కొన్నేళ్లుగా డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్న ఇతనిపై బసవరాజు అనే వ్యక్తి పదునైన కొడవలితో తలపై దాడి చేశాడు. అక్కడున్న కొంతమంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన అతావుల్లాను సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. భూముల డాక్యుమెంట్ తయారు చేసే విషయంలో తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే నిందితుడు దాడి చేసినట్లు చెప్పారు.
లొంగిపోయిన నిందితుడు
హత్యాయత్నం చేసిన తర్వాత నిందితుడు బసవరాజు పోలీస్‌స్టేçÙన్‌లో లొంగిపోయాడు. తనకు డాక్యుమెంట్ రైటర్ అన్యాయం చేయడంతోనే దాడి చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఆస్పత్రి వద్ద గుమిగూడిన జనం
డాక్యుమెంట్ రైటర్‌పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం అందుకున్న వందలాది మంది ప్రజలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సంఘటనపై ఆరా తీశారు. ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, గుడిబండ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసమూర్తి తదితర ప్రముఖులు కూడా అతావుల్లాను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి మెడికల్ ఆఫీసర్ మంజువాణి, డాక్టర్ బాబాబుడేన్ ఎమ్మెల్సీకి వివరించారు.