అప్పులు తీర్చేందుకు అడ్డదారి! | Illegal Registration Of Land In Chevella | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చేందుకు అడ్డదారి!

Published Mon, Aug 27 2018 8:59 AM | Last Updated on Mon, Aug 27 2018 8:59 AM

Illegal Registration Of Land In Chevella - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్‌ఐ  

చేవెళ్ల : అప్పుల ఊబిలో కూరుకుపోయిన రియల్టర్లు అక్రమ సంపాదనకు ఆశపడ్డారు. కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ సృష్టించి 5 ఎకరాల 12 గుంటల స్థలాన్ని విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. భూమి పట్టాదారు ఫిర్యాదుతో పోలీసులు కేసును ఛేదించారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ గురువయ్య, ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డిలు నిందితుల వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండలంలోని పామెన గ్రామానికి చెందిన శీలపురం పుష్పమ్మ అనే మహిళకు తన తండ్రి గ్రామంలోని సర్వే నంబర్‌ 122లో 5 ఎకరాల 12గుంటల భూమి ఇచ్చాడు. ఈ భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులకు అమ్మేందుకు అగ్రిమెంట్‌ చేసి కాగితాలను ఇచ్చింది.

అగ్రిమెంట్‌ చేసుకున్న వారు అమ్మేందుకు మార్కెట్‌లో పెట్టారు.   ఈ భూమి డాక్యుమెంట్లను పరిశీలించిన నల్లబోతుల చిన్న అనే వ్యక్తి పుష్పమ్మ అనే మహిళ స్థానంలో వేరే పేరుతో భూమిని కొనుగోలు చేసినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమ్మేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో డాక్యుమెంట్లు తయారు చేసిన నిందితులు వారికి సహకరించిన నల్లబోతుల చిన్న, సుంకే వెంకటేశ్వర్లు, రేనటి మున్నా, అనుముల యమున, మీనాక్షి, వడివేలు, హకీం బుచ్చిరాములు అలియాస్‌ కుమార్, కె. రంజిత్‌కుమార్, రాజేంద్రప్రసాద్, మహ్మద్‌ ముజాహిద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.  

కబ్జా కుట్ర జరిగిందిలా.. 

కర్నూల్‌ జిల్లా మహానంది గ్రామానికి చెందిన నల్లబోతుల చిన్నా 2015 సంవత్సరంలో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. జిల్లాలోని  సరూర్‌నగర్‌ మండలం హస్తీనాపురం గ్రామంలో నివాసం ఉంటూ పటాన్‌చెర్వులో ఓ కంపెనీలో పనిచేశాడు. రియల్‌ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని ఆశించి ఉద్యోగం మానేసి విజయవాడ, తిరుపతి పట్టణాల్లో వ్యాపారం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తెలిసిన వారి వద్ద అప్పు చేశాడు. ఇతని వద్ద పామురుకు చెందిన సుంకె వెంకటేశ్వర్లు, మున్నా అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. మూడు నెలల కిత్రం చేవెళ్ల ప్రాంతంలో వ్యాపారం చేసేందుకు అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లును పంపించాడు.

అతడు ఇక్కడ ఉన్న భూముల ధరలు, ఇతర వివరాలు సేకరించాడు. ఓ భూమికి సంబంధించిన కాగితాలను తీసుకొని చేవెళ్లలోని తాజ్‌జిరాక్స్‌ సెంటర్లో జిరాక్స్‌లు తీస్తుండగా అందులో ఉండే పామెన గ్రామానికి చెందిన రమేశ్‌తో భూములు అమ్మేవి ఉన్నాయా అని అడిగాడు. దీంతో రమేశ్‌ 5.12 ఎకరాల భూమి ఉందని చూపించి ధర రూ. 50 లక్షల వరకు ఉందని చెప్పడంతో వెంకటేశ్వర్లు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావాలని అడిగి తీసుకున్నాడు. వాటిని పరిశీలించిన చిన్నా, వెంకటేశ్వర్లు, మున్నాలు భూమిని కాజేయాలని, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాలని పథకం పన్నారు.

దీనికి సహకరిస్తే అసిస్టెంట్లకు రూ.20లక్షలు ఇస్తానని చిన్నా చెప్పాడు. పెద్ద వయస్సు ఉన్న ఆడమనిషి కావాలని తనకు రియల్‌ వ్యాపారం ద్వారా పరిచయం ఉన్న తిరుపతి రేణిగుంటకు చెందిన యమునకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. యుమునతో పాటు వడివేలు పెద్ద వయసున్న మహిళా మీనాక్షితో గత నెల 23వ తేదీన తిరుపతి నుంచి మెహిదీపట్నం వచ్చారు. ఈ అక్కడే ఉన్న యునిక్‌ సర్వీస్‌ మీసేవా సెంటర్‌లో వెంట వచ్చిన మహిళను పుష్పమ్మగా ఆధార్‌కార్డు సృష్టించారు.  

సబ్‌ రిజిస్ట్రార్‌తో ఒప్పందం 

వీటి ఆధారంగా జూలై 30వ తేదీన చేవెళ్లకు వచ్చి సబ్‌రిజిస్టార్‌ ఆఫీస్‌ వద్ద ఉన్న కుమార్‌ అలియాస్‌ బుచ్చిరాములు అనే టైపిస్టుతో ఏజీఏపీఏ డాక్యు మెంట్‌ తయారు చేయించారు. రూ. 25 వేలు ఇస్తానని చెప్పడంతో రజింత్‌కుమార్, జి. రాజేంద్రప్రసాద్‌లను కుమార్‌ సాక్షులుగా సంతకాలు చేయించాడు. డాక్యుమెంట్‌ తయారు చేసి సబ్‌రిజిస్ట్రార్‌ రాజేంద్రకుమార్‌ వద్దకు వెళ్లగా అతడు ఆ మహిళను పేరు అడిగితే ఆమె తెలుగు రాక తడబడింది. దీంతో ఆయన ఏజీఏపీఏ చేయడానికి ని రాకరించాడు. రంగంలోకి దిగిన చిన్నా సబ్‌రిజిస్ట్రార్‌తో ఒప్పందం చేసుకొని డాక్యుమెంట్స్‌ తయారు చేయించాడు.   

పథకం ప్రకారం పట్టుకున్న పోలీసులు 

మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకే ఎకరం రూ.30 లక్షలకే అమ్ముతానని చిన్నా మహబూబ్‌నగర్‌కు చెందిన ఒబెదుల్లా కొత్వాల్‌కు భూమిని చూపించాడు. అతని వద్ద రూ. 6లక్షల అడ్వాన్స్‌గా తీసుకొని వాటిని అప్పుల వారికి ఇచ్చాడు. అయితే ఈ విషయం అసలు పట్టాదారు పుష్పమ్మకు తెలియడంతో చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫోర్జరీకి సహకరించిన వడివేలు, మీనాక్షిలు డబ్బులు అడుగుతున్నారని యమున ఫోన్‌ చేయడంతో 24వ తేదీన రా వాలని చెప్పాడు.

24న అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, మున్నా, యుమున, వడివేలు, మీనాక్షిలు చేవెళ్ల రిజిస్టేషన్‌ ఆఫీస్‌కు వచ్చారు. అప్పటికే సివిల్‌లో ఉన్న పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. విచారణ అనంతరం మొత్తం పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ రాజేంద్రకుమార్, భూమి పత్రాలు అందించిన రమేశ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement