అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు.. నిషేధిత భూములనూ వదలని వైనం | West Godavari District: Vigilance investigation on Illegal Land Registrations | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు.. నిషేధిత భూములనూ వదలని వైనం

Published Fri, Aug 5 2022 5:42 PM | Last Updated on Fri, Aug 5 2022 5:42 PM

West Godavari District: Vigilance investigation on Illegal Land Registrations - Sakshi

ఏలూరులో జిల్లా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ల దందా సాగించారు. నిబంధనలతో నిమిత్తం లేదు. ఫీజు టూ ఫీజ్‌ చెల్లించి ఆపైన భారీగా ముట్టచెప్పితే చాలు ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ల చేస్తా రు. రెడ్‌మార్క్‌లో ఉన్నా, నిషేధిత భూములైనా, నాన్‌ లేఅవుట్‌ అయినా ఇలా ఏ భూమి అయినా కా సులు ఇస్తే ఉమ్మడి పశ్చిమగోదావరిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. జిల్లాలోని 9 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గడిచిన మూడేళ్లలో 500కుపైగా ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖపై వరుస ఫిర్యాదులు అందుతుండటంతో ప్రభు త్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా విజి లెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించగా ప్రతి సబ్‌ రిజిస్ట్రా్టర్‌ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

అవినీతికి చిరునామాగా.. 
జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అవినీతికి చిరు నామాగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉండే భూములకు డాక్యుమెంట్లు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ప్రభుత్వం 22ఏ, రెడ్‌మార్క్, నిషేధిత భూములు, నాన్‌ లేఅవుట్‌ సర్వే నంబర్లు అ న్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపి ఆ రిజిస్ట్రేషన్లను చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. నిషేధిత భూములు, 22ఏ భూములు కలెక్టర్‌ అనుమతితో నిషేధిత జాబితా నుంచి తొలిగించిన తరువాత మాత్రమే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించాలి. అయితే జిల్లాలో భిన్నంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

ప్రధానంగా ఏలూరు, పాలకోడేరు, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, భీమవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా నిర్ధారించారు. మరీ ముఖ్యంగా కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 2019 నుంచి 2022 వరకు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించింది. దీనిలో భాగంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిషేధిత భూముల జాబితాను తీసుకుని ఆ జాబితాలోని నంబర్లతో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. దాదాపు మూడు నెలలకుపైగా విజిలెన్స్‌ అధికారులు శ్రమించి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలించారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది.  

సగటున 30కి పైగా..  
ప్రధానంగా నాన్‌లేఅవుట్‌ భూముల్లో ప్లాట్ల కొనుగోలుపై ప్రభుత్వం నిషేధం విధించింది. నాన్‌లేఅవుట్‌ను ముందుగా ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసి సంబంధిత రుసుం చెల్లించి డీటీసీపీ నుంచి అనుమతి తీసుకుని అప్రూవ్‌ లేఅవుట్‌గా మార్చి విక్రయాలు చేయాలి. అయితే దీనికి విరుద్ధంగా నాన్‌ లేఅవుట్లల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిషేధిత భూములు, నాన్‌లేవుట్‌ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా మొగల్తూరు, నరసాపురం, అత్తిలి, భీమవరం, ఏలూరులో అత్యధికంగా జరిగాయి. ఈ ఐదు కార్యాలయాల్లో సగటున 30కుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారించారు. మొత్తంగా 9 కార్యాలయాల్లో 500లకుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయగా, భీమవరంలోనే ఎక్కువగా జరిగినట్టు సమాచారం.  

భారీ గోల్‌మాల్‌ 
ఏలూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అయితే వట్లూరు గ్రామంలో ఒక ఎన్‌ఆర్‌ఐకు చెందిన 8 ఎకరాల భూమి విషయంలో భారీ గోల్‌మాల్‌ జరిగినట్టు విజిలెన్స్‌ అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఎకరా నుంచి 5 ఎకరాలలోపు నాన్‌లేఅవుట్లు వేసి పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించేశారు. దీనిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రత్యక్షంగా గండికొట్టారు. 500లకుపైగా డాక్యుమెంట్లల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సమగ్ర విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు సమాచారం. అలాగే కొందరు సబ్‌రిజిస్ట్రార్లు, కొన్ని కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్లపైనా చర్యలకు సిఫార్సు చేశారు. (క్లిక్‌: ఏలూరులో ఏసీబీ సోదాలు.. రికార్డుల తనిఖీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement