
పెబ్బేరులో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ల స్థలం ఇదే..
వనపర్తి: రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటి వరకు చూడని కొత్త మోసం వనపర్తి జిల్లా పెబ్బేరులో వెలుగు చూసింది. అధికారుల అలసత్వం కారణంగా.. ఓ మహిళ తన రూ.కోటి విలువ చేసే ఆస్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎంతో విలువైన ఆస్తుల హక్కులను మార్పిడి చేసే సమయంలో రిజిస్ట్రేషన్ చేసే అధికారులు సంబంధిత లింకు డాక్యుమెంట్, పట్టాదారు పాసు పుస్తకాలు, లింకు డాక్యుమెంట్‌లోని ఫొటోలు, ఆధార్ నంబర్లు, సంతకాలను సరిపోల్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసేశారు. ఎట్టకేలకు గుర్తించిన బాధితురాలు ఎస్పీని ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం..
తహసీల్దార్ కార్యాలయంలోనే..
కొన్ని నెలలుగా తహసీల్దార్ కార్యాలయంలోనే మండలానికి చెందిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తహల్దార్లే సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహించేలా.. ప్రభుత్వ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అదునుగా చేసుకుని ఓ మాయలేడి, కొందరు వ్యక్తులు పెబ్బేరులో కర్నూలు పట్టణానికి చెందిన షరీఫాబీకి చెందిన సుమారు రూ.కోటి విలువ చేసే 12 ప్లాట్లపై కన్నేశారు. తానే నిజమైన షరీఫాబీని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఆరుగురు వ్యక్తులపై 2018 అక్టోబర్ 11వ తేదీన రిజిస్టర్ చేసింది. 2019 మార్చిలో నిజమైన యజమానురాలు ఈసీ తీసేందుకు ప్రయత్నించగా.. ప్లాట్లను షరీఫాబీ ఇతరులకు విక్రయించినట్లు గుర్తించింది. ఒక్కసారిగా అవాక్కైన ఆమె తన భర్త ఎం.మక్బూల్‌పాషా తనకు 2016 డిసెంబర్ 6వ తేదీన 12 ప్లాట్లను గిఫ్ట్ డీడీ చేయించి ఇచ్చారని ఆధారాలతో వనపర్తికి వచ్చి ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదును పంపించడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
స్పందన కరువు..
మాయలేడి చేసిన డాక్యుమెంట్లను పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో డూప్లికేట్ కాపీలను తీసుకుని బాధితురాలు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు. ఏప్రిల్‌లో పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయితే.. ఇప్పటి వరకు డూప్లికేట్ షరీఫాబీ గాను.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని గాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టలేదు. డాక్యుమెంట్‌లో ఉన్న అడ్రస్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపడితే.. అక్కడి ఇళ్లు తాళం వేసి ఉన్నాయని పోలీసులు సమాధానం చెప్పినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో తన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తాయనుకున్న ప్లాట్లను ఇలా కాజేస్తారని ఊహించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఎస్పీ, సబ్ రిజిస్ట్రార్, పెబ్బేరు పోలీసులను వేడుకుంటోంది.
అధికారుల నిర్లక్ష్యమే కారణం
బాధితురాలు షరీఫాబీ రూ.కోటి విలువైన ఆస్తి కోల్పోవడానికి ప్రధాన కారణం లింకు డాక్యుమెంట్లు, ఈసీ అడ్రస్, ఫొటో సరిచూసుకోకుండా.. కాసుల కోసం ఆశపడి హక్కులను ఇతరుల పేరున మార్చడమేనని చెప్పవచ్చు. భూముల విలువ రూ.లక్షల్లో పలుకుతుండటంతో మాయగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడటం సర్వసాధారణమైంది. చిన్న పొరపాటు వలన పెద్ద నష్టం వాటిల్లింది. ఇందుకు బాధ్యత ఎవరు వహిస్తారు. పోలీసుల వద్దకు వెళ్తే.. కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. అయితే డూప్లికేట్ మహిళ రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దారే.. మళ్లీ కొన్న వారిని.. అమ్మిన వారిని పిలిపించి సదరు ఆస్తిపై హక్కుదారులు మీరు కాదు కాబట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేస్తున్నట్లు మరో డాక్యుమెంట్ తయా రు చేసి రిజిస్టర్ చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment