సాక్షి, తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అదనంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు పలు అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబు వద్ద లెక్కలు చూపని నగదు రూ.54,100 స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల వసూలుకు ప్రైవేటుగా కొందరు వ్యక్తులను నియమించుకున్నట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేసి సంబంధిత అధికారులకు నివేదిస్తామన్నారు. ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. రాత్రంతా తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు కె.శ్రీనివాస్, కె.నాగేంద్రప్రసాద్, కె.ఏసుబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment