సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేసే ప్రధాన సర్వర్‌లో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌లో సరి సంఖ్యలో నమోదై ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శుక్రవారం వరకు సజావుగానే పనిచేసినా, శనివారం సరి, బేసి సంఖ్యలో (రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల క్రమసంఖ్యలోని సరి, బేసి సంఖ్యలు) ఉన్న అన్ని కార్యాలయాలకూ సమస్య వచ్చింది. దీంతో శనివారం అరకొరగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి.
మొదలైన మూడురోజులకే..
లాక్‌డౌన్ వేళలు సవరించిన తర్వాత మే 31 నుంచే రిజిస్ట్రేషన్ లావాదేవీలు మళ్లీ మొదలయ్యాయి. రెండు, మూడు రోజుల పాటు సజావుగానే జరిగిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడింది. తొలుత చిన్నదే అనుకున్నా తర్వాత పెద్దది అయ్యింది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి వివరాల కోసం సబ్ రిజిస్ట్రార్‌ల లాగిన్‌లోని కార్డ్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి తలెత్తడంతో ఏం జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. దీంతో గచ్చిబౌలి స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని తేలింది. తొలుత ఐటీ శాఖతో కలిసి ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆ సిబ్బంది చేసిన ప్రయత్నం మేరకు గురు, శుక్రవారాల్లో కొన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.
ప్రధాన సర్వర్‌లో సరి సంఖ్యతో ఉన్న కార్యాలయాల్లో ఇబ్బంది లేకుండానే కార్డ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక, బేసి సంఖ్యతో కూడిన కార్యాలయాల సమస్యను కూడా పరిష్కరించేందుకు సిబ్బంది యత్నించడంతో శనివారం సరి సంఖ్యలోని కార్యాలయాల్లో కూడా సర్వర్ డౌన్ అయినట్టు తెలుస్తోంది. సమస్య ఏమిటో తేలకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం రోజుకు సగటున 3,500కు పైగా లావాదేవీలు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం రోజుకు సగటున 900 వరకు మాత్రమే జరుగుతున్నాయి. శనివారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 500కు మించి జరగలేదని తెలుస్తోంది. అయితే ఆదివారం కల్లా సమస్య పరిష్కారమవుతుందని, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
Telangana: రిజిస్ట్రేషన్లకు ‘అంతుచిక్కని’ సమస్య
Published Sun, Jun 6 2021 2:47 AM | Last Updated on Sun, Jun 6 2021 2:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment