దగ్గరుండి పని పూర్తి చేయిస్తారు..! | Irregularities In Sub Registrars Office Kurnool District | Sakshi
Sakshi News home page

దగ్గరుండి పని పూర్తి చేయిస్తారు..!

Published Wed, Jan 15 2020 8:39 AM | Last Updated on Wed, Jan 15 2020 8:54 AM

Irregularities In Sub Registrars Office Kurnool District - Sakshi

ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదా చేస్తున్న ఏసీబీ అధికారులు(ఫైల్‌)

సాక్షి, ఆదోని: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లో పబ్లిక్‌ డేటా ఎంట్రీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం అమల్లోకి వచ్చినా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారులకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ నెల 10న ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో 11 మంది దళారుల నుంచి రూ. 88,120, సిబ్బంది నుంచి రూ.3,100 అనధికారిక సొమ్మును స్వాధీనం చేసుకోవడం ఇందుకు అద్దం పడుతోంది. జిల్లాలో 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ఎదుట పదుల సంఖ్యలో డాక్యుమెంట్‌ రైటర్లు ప్రత్యేక దుకాణాలు తెరిచారు.

వీరిలో చాలా మంది అటు అధికారులు, ఇటు  క్రయ విక్రయదారులకు మధ్య దళారులుగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ప్రమేయంతోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో పెద్దఎత్తున అవినీతి, అక్రమార్కులు జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గత ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి పబ్లిక్‌ డేటా ఎంట్రీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని తీసుకొచ్చింది. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లోనూ ఈ విధానం అమలవుతోంది. అయితే.. ఈ విధానంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దాదాపు 70 శాతం రిజిస్ట్రేషన్లు మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయి.
 
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఎంతో సులువు 
పబ్లిక్‌ డేటా ఎంట్రీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ను సులువుగా చేసుకోవడానికి ప్రభుత్వం సరళమైన విధానం ప్రవేశ పెట్టింది. ఇంటి వద్దే సొంతంగా డాక్యుమెంట్లు రాసుకోవడానికి వీలుగా  తెలుగు, ఇంగ్లిష్‌లో 16 రకాల నమూనాలను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఇందులో తమకు సరిపోయే నమూనాలో వివరాలు పొందుపరిచిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో పెట్టి.. రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంది. ఇలా చేసుకోవడం వల్ల అధికారుల అవినీతికి ఆస్కారం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. ఈ కొత్త విధానంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్‌ అధికారులపై ఉంది. ప్రత్యేక సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు అవగాహన సదస్సులను తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులిపేసుకున్నారు.
 
అక్రమార్జనకు బ్రేక్‌ పడుతుందని.. 
కొత్త విధానంపై ప్రజలలో అవగాహన పెరిగితే తమ అక్రమార్జనకు బ్రేక్‌ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్లే ఎక్కడా చిత్తశుద్ధితో సదస్సులు నిర్వహించలేదు. ఈ విధానం గురించి తెలియని చాలామంది క్రయవిక్రయదారులు ఇప్పటికీ దళారులను ఆశ్రయిస్తున్నారు. వారిని దళారుల అవతారమెత్తిన డాక్యుమెంట్‌ రైటర్లు తమ దుకాణాల్లో కూర్చోబెట్టి కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి సమాచారం ఇస్తున్నారు. మార్కెట్‌ విలువ తెలుసుకుని, బ్యాంకుకు వెళ్లి ఆ మేరకు ఫీజులు చెల్లించి చలానాలు సిద్ధం చేస్తున్నారు. డాక్యుమెంట్లు సిద్ధం చేసిన తరువాత క్రయవిక్రయదారుల సంతకాలు పెట్టించి.. కార్యాలయంలో దగ్గరుండి రిజిస్ట్రేషన్లను పూర్తి చేయిస్తున్నారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయో రాత్రికి లెక్కగట్టి..అక్రమంగా వసూలు చేసిన సొమ్మును అధికారులు, సిబ్బంది చెప్పిన చోట, వాళ్లు నియమించుకున్న వారికి అందజేస్తున్నారు. ప్రతి రిజి్రస్టేషన్‌ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతోంది. ప్రతి సేవకూ ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అయితే ఎక్కడా నేరుగా డబ్బు తీసుకోవడం లేదు. దళారుల సాయంతోనే మొత్తం దందా సాగిస్తున్నారు. వీరి తీరు వల్ల అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి గండి పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement