ప్రతీకాత్మక చిత్రం
ఈయన పేరు ఎం.రాఘవేంద్ర. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం. ట్రిపుల్ ఎంఏ, ఎంబీఏ, పీజీడీసీఏ చదివారు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ఇంటర్‌నెట్, జిరాక్స్ షాపు పెట్టుకునేందుకు రూ.5 లక్షల ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. అర్హత సాధించలేదు. డిగ్రీ చదివి, ఈయనకంటే తక్కువ వయసున్న వారికి రుణం మంజూరైంది.
నంద్యాల మండలం చాబోలుకు చెందిన ఎం.గురుస్వామి ఎంఏ, ఎంఈడీ, పీహెచ్‌డీ చదివారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ కింద రూ.5 లక్షల రుణం కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశారు. ఎంపిక జాబితాలో ఈయన పేరు కనిపించలేదు.
కర్నూలు(అర్బన్) : జిల్లా షెడ్యూల్ కులాల ఆర్థిక సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ యువతకు నేషనల్ షెడ్యూల్డు క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా
స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందిస్తుంటారు. దీనికింద 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 161 యూనిట్లు మంజూరయ్యాయి. 2,016 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 24, 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 1,119 మంది హాజరయ్యారు. లఘు వ్యవసాయ పథకాలకు రూ.3 లక్షలు, చిన్నతరహా ఉపాధి యూనిట్లకు రూ.5 లక్షలు, పెద్దతరహా ఉపాధి యూనిట్లకు రూ.10 లక్షల చొప్పున రుణం ఇస్తామని అధికారులు ప్రకటించారు.
ఈ రుణం అందితే స్వయం ఉపాధి పొందవచ్చని ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అధికార, ఆర్థిక బలం ఉన్నవారికే రుణం మంజూరైంది. ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగాలు రాక ఖాళీగా ఉంటున్న చాలామందికి అన్యాయం జరిగింది. నోటిఫికేషన్‌లో అధికారులు కోరిన ధ్రువీకరణ పత్రాలతో పాటు సీఏ ద్వారా ప్రాజెక్టు రిపోర్టు అందజేసినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. సీఏ రిపోర్టు అందించని వారు కూడా అనేక మంది ఎంపికయ్యారని చెబుతున్నారు. సీఏ ద్వారా ప్రాజెక్టు రిపోర్టు తీసుకువచ్చేందుకే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేశామని, అధికారులు మాత్రం పైసలు ఇచ్చిన వారిని, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు లేఖలు ఇచ్చిన వారిని మాత్రమే ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.
విచారణ జరిపిస్తాం
ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకానికి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల్లో అనేకమంది అనర్హులు ఉన్నారని ఫిర్యాదులు అందాయి. వయసు, విద్యార్హత తక్కువగా ఉన్న వారిని ఎంపిక చేసినట్లు పలువురు అభ్యర్థులు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం. అనర్హులకు పథకం వర్తింపజేసి ఉంటే తప్పక చర్యలు తీసుకుంటాం.
–బి.పుల్లయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
Comments
Please login to add a commentAdd a comment