♦హైదరాబాద్‌లో అదో ప్రముఖ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్. అందులో ఆర్‌టీ– పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. అయితే పరీక్షకు ముందు బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అక్కడ చేసే పరీక్షల వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు చేరడం లేదు.
♦ఖమ్మంలో ఓ ప్రైవేట్ లేబొరేటరీ ఉంది. దానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కానీ యాంటిజెన్ కిట్లను తెచ్చి పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుకు రూ.500 ధర కాగా, ఈ లేబొరేటరీ నిర్వాహకులు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంటికెళ్లి చేస్తే రూ.3,500 వరకు తీసుకుంటున్నారు. ఈ పరీక్షలు ఎన్ని జరుగుతున్నాయో లెక్కాపత్రం లేదు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ప్రైవేట్ లేబొరేటరీల్లో ఇష్టారాజ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగు తున్నాయి. కొన్ని కనీస ప్రొటోకాల్‌ను కూడా పాటించడం లేదు. అనేక కేంద్రాలపై వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల పర్యవేక్షణ కరువైంది. దీంతో వాటిల్లో ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయో కూడా ప్రభుత్వ వర్గాలకు సమాచారం లేకుండా పోయింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులను, వారి ప్రాథమిక, సెకండరీ కాంటా క్టులను గుర్తించడం కష్టంగా మారింది. ఫలి తంగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. బాధితులు తక్షణమే వైద్య సాయం అందించే పరిస్థితే లేకుండా పోవడంతో కొందరికి వ్యాధి తీవ్రమవుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు లేవు..: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 చోట్ల, ప్రైవేట్‌లో 35 డయాగ్నస్టిక్ సెంటర్లు, కొన్ని ఆసుపత్రుల్లోని లేబొరేటరీల్లో ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అలాగే 1,076 ప్రభుత్వ కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరుగుతున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీలు, ఆసుపత్రుల్లో ఆర్‌టీ– పీసీఆర్ పద్ధతిలోనే పరీక్షలకు అనుమతి ఉంది.
ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతి లేదు. ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే ముందుగా అతని ఫోన్ నంబర్ సహా వివరాలను ప్రభుత్వం నిర్ధేశించిన వెబ్‌సైట్లో ముందుగా అప్‌లోడ్ చేయాలి. తక్షణమే ఆ ఫోన్‌కు ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని లేబొరేటరీ నిర్వాహకు లకు చెప్పాక, వెబ్‌సైట్లో ఒక కోడ్ నంబర్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారమే శాంపిల్ సేకరించి పరీక్షకు పంపించాలి. ఈ ప్రక్రియను చాలా లేబొరేటరీలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా ఆర్‌టీ–పీసీఆర్ బదులు కొన్నిచోట్ల యాంటిజెన్ టెస్టులు చేసి పంపిస్తున్నారు. యాంటిజెన్ టెస్టుకు రూ.500 ఖర్చు అవుతుంటే, ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష ధరతోపాటు పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్‌ల ధరలను బాధితులపై వేసి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకుండా, అందుకు సంబంధించిన కోడ్ లేకుండా ఇచ్చే టెస్ట్ రిపోర్టుకు విలువ ఉండటంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. పైగా ఎంతమంది పాజిటివ్‌గా ఉన్నారో కూడా సమాచారం బయటకు రావడంలేదు.
అనుమతిలేని లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు...
రాష్ట్రవ్యాప్తంగా అనుమతిలేని వందలాది చిన్నాచితక లేబొరేటరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. వాస్తవంగా ప్రైౖ వేట్ లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు అనుమతే లేదు. కానీ వాటిల్లో అక్రమంగా ఈ దందా కొనసాగుతోంది. తయారీ కంపెనీల నుంచి యాంటిజెన్ కిట్లను కొనుగోలు చేసి పరీక్షలు చేస్తున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీల్లోని కొందరు టెక్నీషియన్లకు స్వాబ్ శాంపిళ్లు తీసే శిక్షణ కూడా ఉండదు. కానీ ఏదో రకంగా శాంపిళ్లు తీసి అరగంటలోపే ఫలితం వెల్లడిస్తున్నారు. కొన్ని లేబొరేటరీలైతే ఇళ్లకు పంపించి టెస్టులు చేయిస్తున్నాయి. ఒక్కో టెస్టుకు రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా నిర్వహించే కరోనా టెస్టులు, పాజిటివ్ వ్యక్తుల వివరాలు ప్రభుత్వ సంఖ్యలోకి రావడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు వేలాది పరీక్షలు జరుగుతున్నా, ప్రజలు ప్రైౖ వేట్ లేబొరేటరీలను ఆశ్రయిస్తున్నారంటే ఎక్కడో లోపం ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లా కేంద్రాల్లోనే టెస్టులు చేయించుకోవడం గగనంగా మారింది. అది ప్రైవేట్ లేబొరేటరీలకు వరంగా మారింది. ఇంత జరుగుతున్నా కిందిస్థాయి వైద్య, ఆరోగ్య అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment