30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల పరీక్షలు | KCR Allows Private Hospitals And Labs To Conduct Corona Tests | Sakshi
Sakshi News home page

30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల పరీక్షలు

Published Mon, Jun 15 2020 2:09 AM | Last Updated on Mon, Jun 15 2020 9:48 AM

KCR Allows Private Hospitals And Labs To Conduct Corona Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందుజాగ్రత్త చర్యగా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఇందుకోసం కరోనా నిబంధనలను అనుసరించి ప్రైవేటు లేబొరేటరీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, సీనియర్‌ వైద్యాధికారులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉందని చెప్పారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతోందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలలో ఎక్కువగా  పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలున్నాయని వెల్లడించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి... హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఆ 30 నియోజకవర్గాలు : ఉప్పల్, ఎల్‌.బి.నగర్, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, చార్మినార్, మలక్‌పేట్, అంబర్‌పేట్, ముషీరాబాద్, కార్వాన్, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్,  గోషామహల్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, యాకుత్‌పురా, పటాన్‌చెరు

తీవ్ర లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స...
‘తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయ లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం. దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. హైదరాబాద్‌ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరుప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎన్నో కొన్ని పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సిన అవసరం ఉంది. వచ్చే 7–10 రోజుల్లో వైరస్‌ వ్యాప్తి జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా ప్రైవేటు లేబొరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్‌గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స (హోం ట్రీట్‌మెంట్‌) అందించాలి’అని సమావేశంలో సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఎంత మందికైనా చికిత్స అందించేందుకు సిద్ధం...
హైదరాబాద్‌ను కాపాడుకోవాలనే ముందుచూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంత మందికి పాజిటివ్‌ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు వైరస్‌ సోకిన వారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి, అప్రమత్తతతో ఉంది’అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement