private laboratories
-
ప్రైవేటు ల్యాబ్‌ల దందా: మోసం గురో..!
పలమనేరుకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్‌కు స్వలంగా జ్వరం రావడంతో ఆందోళనకు గురయ్యాడు. కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని స్థానిక మారెమ్మవీధిలోని ఓ ల్యాబ్‌కు వెళ్లాడు. సదరు ఇంజినీర్ టెన్షన్‌ను గుర్తించిన ల్యాబ్ నిర్వాహకుడు 10నిమిషాల్లో టెస్ట్ రిజల్ట్ ఇస్తానని, అందుకు రూ.5వేలు చెల్లించాలని స్పష్టం చేశాడు. దీంతో చేసేదిలేక ఆ వ్యక్తిరూ.5వేలు ముట్టజెప్పి పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. బైరెడ్డిపల్లెకు చెందిన ఓ రైతుకు ఒళ్లునొప్పులతో కూడిన జ్వరం వచ్చింది. ఇరుగుపొరుగు వారు కరోనా వచ్చిందేమో అని భయపెట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పరీక్ష చేయించుకుంటే అందరికీ తెలిసిపోతుందని అతను ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లాడు. ఆ రైతు పరిస్థితిని గమనించిన ల్యాబ్ నిర్వాహకుడు రూ.3వేలు ఇస్తేనే కోవిడ్ పరీక్ష చేస్తానని తేలి్చచెప్పాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిర్వాహకుడు అడిగింది రైతు చెల్లించుకోవాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు.. కోవిడ్ విజృంభణతో జనం బెంబేలెత్తుతున్నారు.. వైరస్ నిర్ధారణ పరీక్షలకు పరుగులు తీస్తున్నారు.. కరోనా టెస్ట్‌లను ప్రభుత్వమే నిర్వహిస్తున్నా పలువురు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల భయాందోళనను ల్యాబ్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు మాత్రమే చేస్తూ ఇష్టారాజ్యంగా నగదు వసూలు చేస్తున్నారు. కచ్చితత్వం లేని ఫలితాలతో కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. నమ్మి వచ్చినవారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలమనేరు: జిల్లాలో దాదాపు 458 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేని ల్యాబ్‌లలో కోవిడ్ పరీక్షలు చేయకూడదు. అయితే పలు ల్యాబ్‌ల నిర్వాహకులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. డిమాండ్ మేరకు ధరలు పెంచి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. కోవిడ్ నిర్థారణకు ప్రస్తుతం మూడు రకాల పరీక్షలు చేస్తున్నారు. అందులో ట్రూనాట్ పరీక్ష ఫలితాలు 24 గంటల్లో వస్తాయి. వీటి కచ్చితత్వం 85శాతంగా ఉంది. ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలకు ప్రస్తుతం 3రోజులు పడుతోంది. దీని కచ్చితత్వం 90 శాతంగా ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని కొంతమంది ప్రైవేటు ల్యాబ్‌లలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లకు మొగ్గుచూపుతున్నారు. దీని కచ్చితత్వం కేవలం 70 శాతం మాత్రమే. ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్ టెస్ట్‌కోసం ఆధార్, మొబైల్ నెంబర్లను ఐసీఎంఆర్( ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెబ్‌లో నమోదు చేసి ఐడీ నెంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికీ ఇదే ప్రామాణికం. కానీ ప్రైవేటు ల్యాబ్‌లో ఇవేమీ లేకుండానే పరీక్షలు చేసేసి ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇందుకోసం ఇష్టానుసారంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. గంటలో ఫలితం కావాలంటే రూ.2వేలు అరగంటలో కావాలంటే రూ.3 వేలు, 10నిమిషాల్లో స్పాట్ రిజల్ట్ కావాలంటే రూ.5వేలని ప్రజలను పిండేస్తున్నారు. ప్రాణాలకే ప్రమాదం ప్రైవేట్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకున్న పాజిటివ్ వ్యక్తులు సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో రోగం ముదరబెట్టుకుంటున్నారు. చివరకు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ గురై శ్వాస సమస్యలు ఉత్పన్నమైన తర్వాతే ఆస్పత్రులకు వెళుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు. ఇక కొంతమంది పాజిటివ్ వ్యక్తులకు కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో నెగటివ్ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో వారు యథేచ్ఛగా సంచరిస్తూ కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీనిపై పలమనేరు కోవిడ్ అధికారి డాక్టర్ విశ్వనాథ్‌ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ల్యాబ్‌లలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నది నిజమేనన్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా పెద్ద వ్యాపారంగా మారిందని తెలిపారు. ప్రజల భయాన్ని ఆసరాగా తీసుకుని అనధికారికంగా పరీక్షలు చేస్తూ నగదు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు ల్యాబ్‌ల దందాను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. చదవండి: ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ 1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు -
‘కరోనా’ దోపిడీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో ప్రైవేట్ ల్యాబ్‌లు బాధితులను దోచుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధరల్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. తాజాగా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గినా, తెలంగాణలో మాత్రం తగ్గిన ధరలు అమలు కావట్లేదు. ఆ మేరకు తక్కువ వసూలు చేయాలన్న ఆదేశాలనూ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఇవ్వలేదు. ఇదే అదనుగా ప్రైవేట్ లేబొరేటరీలు తక్కువ ధరకు కిట్లను కొని ఎక్కువ ధరకు టెస్టులు చేస్తుండటంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసినందుకు రూ. 3 వేలపైనే వసూలు చేస్తున్నారు. మరోవైపు పీపీఈ కిట్ల ధరలను కూడా అధికంగా వేస్తూ లేబరేటరీలు సహా ఆసుపత్రులు బాధితుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. అలాగే కరోనా రోగులు వాడే రెమిడెసివీర్ ఇంజక్షన్ ధర కూడా మార్కెట్లో తగ్గినా, పాత ధరనే ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రైవేట్‌లో 50చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 చోట్ల, ప్రైవేట్ లేబొరేటరీల్లో 50 చోట్ల ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. 1,200 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పాజిటివ్‌గానే పరిగణిస్తారు. అందులో నెగెటివ్ వచ్చి, కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్ట్పీసీఆర్ పరీక్ష చేయాలన్నది భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిబంధన. దీంతో ర్యాపిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి లక్షణాలున్నవారు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు బాధితులు ప్రైవేట్ లేబొరేటరీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్ లేబరేటరీల్లో రోజూ 2,500 నుంచి 3 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. 90 శాతం ధరలు తగ్గినా.. తగ్గని దోపిడీ కరోనా విజృంభించిన కొత్తలో ఒక్కో ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.2,500 ఖర్చయ్యేది. దేశంలో రెండు మూడు కంపెనీలే కరోనా నిర్ధారణ కిట్లను తయారుచేయడం, డిమాండ్ ఎక్కువుండటంతో కిట్ల ధరలు ఆ స్థాయిలో ఉండేవి. పైగా చాలా తక్కువచోట్ల పరీక్షలు జరిగేవి. తెలంగాణలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం మొదట్లో పుణేకు కారులో శాంపిళ్లను పంపించేవారు. తర్వాత గాంధీ వైరాలజీ లేబొరేటరీల్లో కరోనా పరీక్షలు మొదలయ్యాయి. ఆపై ప్రభుత్వం ప్రైవేట్ల లేబ్ల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలకు అనుమతిచ్చింది. అప్పటికి కిట్ల ధరలు కాస్తంత తగ్గడంతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షకు ప్రభుత్వం రూ.2,200 ధర నిర్ధారించింది. ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకెళ్లి టెస్ట్చేస్తే రూ.2,800 వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అయినా కొన్ని లేబ్లు పీపీఈ కిట్ ధరను కూడా కలిపి రూ.4 వేల వరకు వసూలు చేసేవి. ప్రస్తుతం కూడా రూ.3,500 వరకు వసూలు చేస్తున్న లేబొరేటరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ కిట్లను దేశంలో దాదాపు 180 కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే అవన్నీ పోటీపడి బిడ్లు వేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కిట్ల ధర రూ.250కి పడిపోయిందని వైద్య ఆరోగ్య వర్గాలే చెబుతున్నాయి. అంటే ఒకప్పుడు సుమారు రూ.2,500 ఉన్న కిట్ ధర, ఇప్పుడు రూ.250కి పడిపోయింది. అంటే 90 శాతం మేర కిట్ల ధరలు తగ్గాయన్నమాట. దీంతో కేంద్రం గతంలో రూ.2,200 ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫీజును రూ.950కి తగ్గించింది. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రైవేట్ లేబొరేటరీలు రూ.2,800 నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నాయి. అంతేగాక ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ ధర ఒకప్పుడు రూ.504 వరకు ఉండగా, ఇప్పుడు రూ.275కు తగ్గింది. కానీ అనుమతి లేకున్నా కొన్ని ప్రైవేట్ లేబొరేటరీలు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తూ రూ.2 వేలపైనే వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ కిమ్మనడం లేదు. రెమిడెసివీర్ ధర వెయ్యి తగ్గుదల ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగులకు వైరస్ తీవ్రతను బట్టి రెమిడెసివీర్ ఇంజక్షన్ ఇస్తారు. గతంలో దీని ధర రూ.3 వేలు ఉండగా, ఇప్పుడది రూ.2 వేలకు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని ఆసుపత్రులు మాత్రం పాత ధర కాదు కదా రూ.4 వేలకు మించి వసూలు చేస్తున్నాయని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతెందుకు పీపీఈ కిట్ ధర మొదట్లో రూ.600 వరకు ఉండేది. ఇప్పుడది రూ.250 నుంచి రూ.300 మధ్యకే దొరుకుతుంది. కానీ ఆసుపత్రులు మాత్రం రూ.600 నుంచి రూ.1,000 వరకు పీపీఈ కిట్ ధర ఫీజులో కలిపి బిల్లు వేస్తున్నాయి. ఇక రూ.200 – రూ.250 ఉండే ఎన్–95 మాస్క్ ధర ఇప్పుడు రూ.13కి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఆసుపత్రుల్లో రూ.250 వరకు ఫీజులో కలిపి చూపిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ లేబొరేటరీల్లో సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసినప్పుడు బాధితులు తప్పనిసరిగా ఎన్–95 మాస్క్ ధరించాల్సిందేనంటూ రూ.250 వసూలు చేస్తున్నాయి. ఇక త్రీలేయర్ సర్జికల్ మాస్క్ ధర గతంలో రూ.8 నుంచి రూ.10 వరకు ఉండగా, ఇప్పుడు వాటి ధర 80 పైసలకు పడిపోయింది. అయినా ప్రైవేట్ ఆసుపత్రులు, లేబొరేటరీలు మాత్రం పాత ధరలనే వసూలు చేస్తూ కరోనా బాధితుల్ని పిండేస్తున్నాయి. ఔను.. కిట్ల ధరలు తగ్గాయి కరోనా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గాయి. ఆర్టీపీసీఆర్ కిట్ ధర రూ.250కి, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ధర రూ.275కి తగ్గింది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా చేస్తున్నందున తగ్గిన ధరల ప్రకారమే కిట్లను కొనుగోలు చేస్తాం. దీనివల్ల ప్రభుత్వం కిట్లకు అధికంగా సొమ్ము కేటాయించాల్సిన అవసరం లేదు. ఇక రెమిడిసివీర్ ఔషధం, ఎన్–95 మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌ల ధరలు భారీగా తగ్గాయి. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
ప్రైవేట్ లేబొరేటరీల మాయాజాలం
♦హైదరాబాద్‌లో అదో ప్రముఖ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్. అందులో ఆర్టీ– పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. అయితే పరీక్షకు ముందు బాధితుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అక్కడ చేసే పరీక్షల వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు చేరడం లేదు. ♦ఖమ్మంలో ఓ ప్రైవేట్ లేబొరేటరీ ఉంది. దానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కానీ యాంటిజెన్ కిట్లను తెచ్చి పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుకు రూ.500 ధర కాగా, ఈ లేబొరేటరీ నిర్వాహకులు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంటికెళ్లి చేస్తే రూ.3,500 వరకు తీసుకుంటున్నారు. ఈ పరీక్షలు ఎన్ని జరుగుతున్నాయో లెక్కాపత్రం లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ప్రైవేట్ లేబొరేటరీల్లో ఇష్టారాజ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగు తున్నాయి. కొన్ని కనీస ప్రొటోకాల్‌ను కూడా పాటించడం లేదు. అనేక కేంద్రాలపై వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల పర్యవేక్షణ కరువైంది. దీంతో వాటిల్లో ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయో కూడా ప్రభుత్వ వర్గాలకు సమాచారం లేకుండా పోయింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులను, వారి ప్రాథమిక, సెకండరీ కాంటా క్టులను గుర్తించడం కష్టంగా మారింది. ఫలి తంగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. బాధితులు తక్షణమే వైద్య సాయం అందించే పరిస్థితే లేకుండా పోవడంతో కొందరికి వ్యాధి తీవ్రమవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు లేవు..: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 చోట్ల, ప్రైవేట్‌లో 35 డయాగ్నస్టిక్ సెంటర్లు, కొన్ని ఆసుపత్రుల్లోని లేబొరేటరీల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అలాగే 1,076 ప్రభుత్వ కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరుగుతున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీలు, ఆసుపత్రుల్లో ఆర్టీ– పీసీఆర్ పద్ధతిలోనే పరీక్షలకు అనుమతి ఉంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతి లేదు. ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే ముందుగా అతని ఫోన్ నంబర్ సహా వివరాలను ప్రభుత్వం నిర్ధేశించిన వెబ్సైట్లో ముందుగా అప్లోడ్ చేయాలి. తక్షణమే ఆ ఫోన్‌కు ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని లేబొరేటరీ నిర్వాహకు లకు చెప్పాక, వెబ్సైట్లో ఒక కోడ్ నంబర్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారమే శాంపిల్ సేకరించి పరీక్షకు పంపించాలి. ఈ ప్రక్రియను చాలా లేబొరేటరీలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా ఆర్టీ–పీసీఆర్ బదులు కొన్నిచోట్ల యాంటిజెన్ టెస్టులు చేసి పంపిస్తున్నారు. యాంటిజెన్ టెస్టుకు రూ.500 ఖర్చు అవుతుంటే, ఆర్టీ–పీసీఆర్ పరీక్ష ధరతోపాటు పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్‌ల ధరలను బాధితులపై వేసి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకుండా, అందుకు సంబంధించిన కోడ్ లేకుండా ఇచ్చే టెస్ట్ రిపోర్టుకు విలువ ఉండటంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. పైగా ఎంతమంది పాజిటివ్‌గా ఉన్నారో కూడా సమాచారం బయటకు రావడంలేదు. అనుమతిలేని లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు... రాష్ట్రవ్యాప్తంగా అనుమతిలేని వందలాది చిన్నాచితక లేబొరేటరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. వాస్తవంగా ప్రైౖ వేట్ లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు అనుమతే లేదు. కానీ వాటిల్లో అక్రమంగా ఈ దందా కొనసాగుతోంది. తయారీ కంపెనీల నుంచి యాంటిజెన్ కిట్లను కొనుగోలు చేసి పరీక్షలు చేస్తున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీల్లోని కొందరు టెక్నీషియన్లకు స్వాబ్ శాంపిళ్లు తీసే శిక్షణ కూడా ఉండదు. కానీ ఏదో రకంగా శాంపిళ్లు తీసి అరగంటలోపే ఫలితం వెల్లడిస్తున్నారు. కొన్ని లేబొరేటరీలైతే ఇళ్లకు పంపించి టెస్టులు చేయిస్తున్నాయి. ఒక్కో టెస్టుకు రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా నిర్వహించే కరోనా టెస్టులు, పాజిటివ్ వ్యక్తుల వివరాలు ప్రభుత్వ సంఖ్యలోకి రావడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు వేలాది పరీక్షలు జరుగుతున్నా, ప్రజలు ప్రైౖ వేట్ లేబొరేటరీలను ఆశ్రయిస్తున్నారంటే ఎక్కడో లోపం ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లా కేంద్రాల్లోనే టెస్టులు చేయించుకోవడం గగనంగా మారింది. అది ప్రైవేట్ లేబొరేటరీలకు వరంగా మారింది. ఇంత జరుగుతున్నా కిందిస్థాయి వైద్య, ఆరోగ్య అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
రేపట్నుంచి ప్రైవేటులో పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతించిన ప్రైవేటు లేబొరేటరీ లు, వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో ప్రభుత్వ ఆదేశాలతో నిలిచిన కరోనా నిర్ధారణ పరీక్షలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని లేబొరేటరీలు నిబంధనలకు విరుద్ధంగా కరోనా పరీక్షలు చేయడం, మరి కొన్ని చోట్ల లక్షణాలు లేకున్నా పరీక్షలు నిర్వహించడం, ఐసీఎంఆర్ పోర్టల్‌లో పరీక్షల వివరాలను అప్లోడ్ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం లోపాలున్న వాటికి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు కొన్ని లేబొరేటరీలు వివరణ ఇచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు నిబంధనలను పాటిస్తూ తిరిగి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు కొన్ని లాబ్‌ల యాజమాన్యాలు తెలిపాయి. ఐసీఎంఆర్ పోర్టల్‌లో ఇప్పటివరకు చేసి న పరీక్షల వివరాల్ని నమోదు చేసే ప్ర క్రియ పూర్తి కావొచ్చిందని వివరించాయి. విన్నపాల వెల్లువ కరోనా కేసులు రోజు రోజుకూ విజృంభిస్తున్నాయి. రోజూ దాదా పు 2 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేయించుకోవాలంటే అక్కడ టెస్టుల సామర్థ్యం పూర్తిస్థాయిలో లేదన్న భావన ప్రజల్లో నెలకొంది. మరోవైపు ప్రైవేటులో చేయించకుందామంటే వారం రోజులుగా వాటిల్లో పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది కరోనా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరైతే పక్క రాష్ట్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని వస్తున్నారు. కరోనా లక్షణాలు, అనుమానాలున్న వా రంతా తక్షణమే పరీక్షలు చేయాలని విన్నవిస్తున్నారని లాబ్‌ల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పక్కాగా ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు లేబొరేటరీల వర్గాలు వెల్లడించాయి. జర్మనీ కిట్లు వాడుతున్నాం మేం నాణ్యమైన కిట్లతోనే పరీక్షలు చేస్తున్నాం. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ కిట్స్ వాడుతున్నాం. నిర్ధారణ పరీక్షల్లో ఎక్కడా రాజీ పడట్లేదు. వైరస్ విజృంభణ సమయంలో వ్యాపార కోణంలో ఆలోచించట్లేదు. పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చా క 12 వేల మందికి పరీక్షలు చేశాం. వాటిల్లో పాజి టివ్ వచ్చిన వారి రిపోర్టులను తక్షణ వైద్యం కో సం వేగంగా అందజేశాం. వాటన్నింటినీ ఐసీఎంఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేయడంలో కొం త ఆలస్యం జరిగింది. అందుకే కొంత విరామం తీసుకొని వాటన్నింటినీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నాం. రోజూ ఉదయం 9 నుంచి రా త్రి 11 వరకు ఫలితాల అప్‌లోడ్‌కు సమయం కేటా యిస్తూ పనిచేస్తున్నాం. ఈ పని మంగళవారం ము గించి బుధవారం నుంచి కరోనా పరీక్షలు చేస్తాం. ఎంత మందికైనా పరీక్షలు చేయగలం.– సుప్రితారెడ్డి, ఎండీ, విజయ డయాగ్నస్టిక్స్ -
ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వాకం.. అధికారులకు టెన్షన్
-
కరోనా టెస్టులకు మరోసారి బ్రేక్
-
ఇది.. ఆ దగ్గేనా?
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి రావడంతో అనుమానితుల తాకిడి పెరిగింది. వైద్యుల ధ్రువీకరణతో ఈ పరీక్షలు చేయాల్సి ఉండగా.. కాస్త లక్షణాలు కనిపించిన వారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ ల్యాబ్‌లో నిర్దేశించిన లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షణాలు లేని వాళ్లను తిరస్కరిస్తుండటంతో ప్రైవేటు ల్యాబ్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష ఫీజును ప్రభుత్వం రూ.2,200గా నిర్ణయించింది. అయితే ఇంటి వద్దకు వచ్చి శాంపిల్ సేకరించే ప్రైవేటు ల్యాబ్‌కు పరీక్ష ఫీజును రూ.2,800గా స్వీకరించే వెసులుబాటు కల్పించింది.(ఈ మాస్క్ ఉంటే చాలు.. వైరస్ ఖతం) వాతావరణ మార్పులతోనే.. కరోనా వైరస్ పరీక్షల నిర్ధారణకు తీవ్రమైన దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తెమడ, వాసన, రుచి గుర్తించే గుణాల్ని కోల్పోవడం లాంటి లక్షణాలుండాలి. కానీ ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్‌లు ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా.. కొన్ని సందర్భాల్లో లేకున్నా పరీక్షలు చేస్తున్నా యి. వాతావరణంలో వస్తున్న మార్పులతో శరీరంలో మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో జలుబు, దగ్గు రావడం సహజమే. కానీ ఈ లక్షణాలను కరోనాకు సంబంధించినవిగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు విడుదల చేసినా కొందరు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు మొగ్గు చూపుతుండగా.. ప్రైవేటు ల్యాబ్‌లు దీన్ని సొమ్ము చేసుకుంటున్నాయి.(మళ్లీ లాక్డౌన్ ఉండదు) సాధారణంగా ప్రభుత్వ ల్యాబ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా రిజల్ట్ వస్తే వెంటనే వైద్య శాఖ యంత్రాంగం అప్రమత్తమవుతుంది. కానీ, మంగళవారం ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో కరోనా పరీక్ష నిర్వహించుకున్న ఓ అమ్మాయికి పాజిటివ్‌గా తేలింది. వైద్య శాఖ అధికారులు, స్థానిక ఏఎన్ఎం, ఆశ కార్యకర్త నుంచి ఫోన్ రాకపోవడంతో సదరు ల్యాబ్ నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా? లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షల వేగం పెరిగింది. క్షేత్రస్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 50 వేల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అలాగే ఇతర ప్రభుత్వ ల్యాబ్‌ల్లో, మెడికల్ కాలేజీల్లోనూ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. దీంతో ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. -
30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందుజాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇందుకోసం కరోనా నిబంధనలను అనుసరించి ప్రైవేటు లేబొరేటరీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని చెప్పారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతోందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని వెల్లడించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి... హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ 30 నియోజకవర్గాలు : ఉప్పల్, ఎల్.బి.నగర్, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, చార్మినార్, మలక్‌పేట్, అంబర్పేట్, ముషీరాబాద్, కార్వాన్, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, యాకుత్‌పురా, పటాన్చెరు తీవ్ర లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స... ‘తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరుప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎన్నో కొన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సిన అవసరం ఉంది. వచ్చే 7–10 రోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా ప్రైవేటు లేబొరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్‌గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స (హోం ట్రీట్మెంట్) అందించాలి’అని సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంత మందికైనా చికిత్స అందించేందుకు సిద్ధం... హైదరాబాద్‌ను కాపాడుకోవాలనే ముందుచూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంత మందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు వైరస్ సోకిన వారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి, అప్రమత్తతతో ఉంది’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
ఆ ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి కొన్ని ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతిచ్చింది.12 ప్రైవేటు ల్యాబ్‌తో కూడిన ఓ జాబితాను కేంద్రం సోమవారం విడుదల చేసింది. అందులో ల్యాబ్ పేరు, పూర్తి అడ్రస్‌ను పేర్కొంది. మహారాష్ట్రలో 5, హరియాణాలో 2, తమిళనాడులో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకలలో ఒక్కో ల్యాబ్ చొప్పున కరోనా నిర్ధారణ పరీక్షలకు అవకాశం కల్పించింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 433 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ల్యాబ్స్.. -
‘గాంధీ’లో దళారీ దందా
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేటు ల్యాబోరేటరీలు యథేచ్చగా దందా కొనసాగిస్తున్నాయి. మాయమాటలు చెప్పి నిరుపేదరోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి రెండుచేతులా సంపాదిస్తున్నాయి. ఇందుకుగాను ల్యాబ్ నిర్వాహకులు ప్రత్యేకంగా కొందరు దళారులను నియమించుకోవడం గమనార్హం. గైనకాలజీ విభాగం లేబర్‌వార్డులో ఓ మహిళారోగి నుంచి రక్తనమూనాలు సేకరిస్తున్న దళారిని శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆస్పత్రి పాలనయంత్రాంగం ఫిర్యాదు మేరకు దళారితోపాటు అతనికి సహకరించిన సెక్యూరిటీగార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, ఆర్ఎంఓ–1 జయకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్, నేహా ల్యాబ్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తిరుగుతూ రోగులు, రోగి సహాయకులను పరిచయం చేసుకుంటాడు. ఆస్పత్రి ల్యాబ్‌లో వైద్యపరీక్షల నిర్వహణలో తీవ్రజాప్యం జరుగుతుందని, నివేదికలు కూడా సరిగా ఉండవని, పక్కనే ఉన్న ప్రైవేటు ల్యాబ్‌లో అన్ని రకాల వైద్యపరీక్షలు తక్కువ ఖర్చుతో చేయిస్తానని నమ్మిస్తారు. అనంతరం రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి తన ల్యాబ్‌లో వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికలను అందించి డబ్బులు వసూలు చేసి తన కమీషన్ తీసుకునేవాడు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులనుంచి రక్తనమూనాలు సేకరించడం నేరమని తెలిసినా కమీషన్లకు ఆశపడి పదుల సంఖ్యలో దళారీలు నిత్యం ఆస్పత్రిలో రక్తనమూనాలు సేకరిస్తున్నారు. థైరాయిడ్ టెస్ట్ కోసం.. లేబర్‌వార్డులో చికిత్స పొందుతున్న దుర్గశ్రీ అనే మహిళ రోగితో థైరాయిడ్ టెస్ట్ కోసం బేరం కుదుర్చుకున్న రవికుమార్ శుక్రవారం ఉదయం ఎన్ఐసీయూ ప్రవేశద్వారం గుండా లోపలకు వచ్చి లేబర్‌వార్డులోకి వెళ్లి రోగి నుంచి రక్తనమూనాలు సేకరించాడు. అదే సమయంలో లేబర్‌వార్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఇన్చార్జి ప్రదీప్‌కుమార్ అనుమానాస్పదంగా తచ్చాడుతున్న రవికుమార్‌ను తనిఖీ చేయగా అతని జేబు నుంచి రక్తనమూనాలు బయటపడ్డాయి. దీనిపై విచారణ చేపట్టగా ఈ దందాలో ఎన్ఐసీయు వార్డు వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీగార్డు శ్యామూల్ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దళారి రవికుమార్‌తోపాటు సెక్యూరిటీగార్డు శ్యామూలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దళారులను నమ్మవద్దు గాంధీఆస్పత్రిలో అత్యాధునికమైన ల్యాబొరేటరీలు, సౌకర్యాలు ఉన్నాయని, దళారీల మాయమాటలు విని మోసపోవద్దని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ అన్నారు. ఓపీ విభాగంలో అన్ని హంగులతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని, సెంట్రల్ ల్యాబ్, ఎమర్జెన్సీల్యాబ్లు రౌండ్‌ది క్లాక్ సేవలు అందిస్తున్నాయన్నారు. క్షణాల్లో నివేదికలు అందిస్తున్నామన్నారు. ప్రైవేటు ల్యాబ్‌లకు చెందిన దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. –శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్ -
వైద్యం అందించడంలో వైద్యశాఖ విఫలం: నారాయణ
నెల్లూరు(అర్బన్): పేదలకు వైద్య సేవలందించడంలో జిల్లా వైద్యశాఖ విఫలమైందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. స్థానిక దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో ఆయన పేదలకందే ఆరోగ్య సేవలపై అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం చంద్రబాబు జనవరి 1న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, టెలిరేడియాలజి, ప్రైవేటు లాబొరేటరీల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు చేసే మూడు పథకాలకు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ మూడింటినీ ఉపయోగించుకోవడంలో జిల్లా వైద్య శాఖ రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ఉందని తెలిపారు. ఎంఎంఆర్, ఐఎంఆర్ వివరాల గురించి ప్రశ్నించగా జిల్లా అధికారులు తటపటాయించారు. మంత్రి స్పందిస్తూ ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్లెట్ కంప్యూటర్లు వైద్యశాఖకు ఇచ్చినప్పటికీ వాటిని ఉపయోగించడం లేదన్నారు. అందువల్లనే లెక్కలు అడిగితే చెప్పలేకపోతున్నారన్నారు. మళ్లీ ఈనెల 26వ తేదీన వైద్యశాఖలో సేవలపై తాను సమీక్షిస్తానని అప్పుడైనా తగిన సమాధానాలు చెప్పాలన్నారు. అనంతరం మెడికల్ కళాశాల, డీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై అక్కడి విషయాలను చర్చించారు. చాట్లకు ఎమ్మెల్యే కోటంరెడ్డి అభినందన మెడికల్ కళాశాల టీచింగ్ ఆసుపత్రిని అభివృద్ధి చేసే క్రమంలో చాట్ల నరసింహారావుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి ఇచ్చామని మంత్రి నారాయణ తెలిపారు. అనంతరం చాట్ల నరసింహారావును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శాలువా కప్పి సన్మానించారు. మంత్రి నారాయణను బలిజ సంఘం నాయకులు సన్మానించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, డీఎంహెచ్ఓ వరసుందరం, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమూర్తి శాస్త్రి, డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు, డీఎస్సార్ ఆసుపత్రి సూపరింటె ండెంట్ డాక్టర్ భారతి పాల్గొన్నారు. -
అవినీతి జబ్బు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వైద్యో.. నారాయణో హరి’ అన్నారు పెద్దలు. వైద్యం చేసేవాడు దేవుడితో సమానమని దానర్థం. కానీ.. జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశ్రీ డయాలసిస్ యూనిట్లో మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడుతున్న వైద్యులు రోగుల ప్రాణాలనే బలిపెడుతున్నారు. రక్త పరీక్షలు చేయకుండానే చేసినట్లు ప్రైవేటు ల్యాబ్‌ల నుంచి రిపోర్టులు తీసుకుని రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఆ పరీక్షలు చేసినందుకు ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మును యూనిట్‌కు చెందినవారు జేబులో వేసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా ప్రతినెలా లక్షలాది రూపాయలను స్వాహా చేస్తున్నారు. దీంతో చాలామంది కిడ్నీ రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకుని అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని ఆరోగ్యశ్రీ డయాలసిస్ యూనిట్లో ఈ భాగోతం నిరాటంకంగా జరుగుతోంది. ప్రైవేటు కంపెనీ ఇష్టారాజ్యం ప్రభుత్వాసుపత్రితో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సంస్థ పర్యవేక్షణలో బిబ్రాన్ అనే ప్రైవేటు కంపెనీ ఈ యూనిట్‌ను నిర్వహిస్తోంది. కిడ్నీ వ్యాధులతోపాటు కిడ్నీలు దెబ్బతిన్న రోగులు వందలాది మంది ప్రతి నెలా ఈ యూనిట్లో చేరుతున్నారు. వారికి కొన్ని నెలలపాటు డయాలసిస్ తప్పనిసరి అవుతుంది. పూర్తిగా కిడ్నీలు పాడైన వారికైతే జీవితాంతం (కిడ్నీలు మార్పిడి చేసుకుంటే తప్ప) డయాలసిస్ చేయకతప్పదు. ఇలాంటివారికి ఆరోగ్యశ్రీ పథకం కింద నెలకు 8సార్లు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్, ఇంజెక్షన్లతోపాటు రక్తపరీక్షలకు ప్రతినెలా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి రోగికి రూ.10,500 మంజూరవుతోంది. డయాలసిస్‌కు ముందు రోగులు ఆసుపత్రికి వచ్చినప్పుడు క్రియాటిన్, హెచ్‌బీ, హెచ్‌సీవీ, హెచ్ఐవీ పరీక్షలు జరపాల్సివుంటుంది. క్రియాటిన్ పరీక్ష కిడ్నీ పరిస్థితిని తెలిపేది. ఆ పరీక్ష రిపోర్టును బట్టి డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ యూనిట్ ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో ఉండటంతో రోగుల రక్తం శాంపిళ్లను సేకరించి ప్రైవే టు ల్యాబ్‌లకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. ఇక్కడే యూనిట్ నిర్వాహకులు, లేబొరేటరీ లకు చెందినవారు కుమ్మక్కై రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మొదటి నెల పరీక్షలు తప్పనిసరికావడంతో పరీక్షలు కచ్చి తంగా చేయిస్తున్నారు. ఆ తర్వాత నుంచి డయాలసిస్ సందర్భంలో పరీక్షలు చేయిం చడం ఆపేస్తున్నారు. ప్రైవేటు ల్యాబ్‌కు చెందిన వారితో మాట్లాడుకుని అంతకుముందు రిపోర్టులను బట్టి కొంచెం అటుఇటు మార్చి కొత్త రిపోర్టులు తెప్పిస్తున్నారు. పరీక్షలు జరిపినట్లు భ్రమ కల్పించేందుకు రోగుల నుంచి రక్తాన్ని మాత్రం సేకరిస్తున్నారు. ఆ శాంపిళ్లను ప్రైవేటు లేబొరేటరీలకు పంపకుండా పక్కనపడేసి వారిచ్చే ఉత్తుత్తి రిపోర్టులను చూపిస్తున్నారు. ఒక్కో రిపోర్టుపై రూ.1,300పైనే లాభం! పరీక్షలు చేయకుండానే రిపోర్టు ఇచ్చినందుకు ఒక్కో రిపోర్టుపై రూ.60 చొప్పున ల్యాబ్‌కు ఇస్తున్నట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఇచ్చే రూ.10,500లో రక్త పరీక్షల నిమిత్తం రూ.1,420 కలిపి ఉంటోంది. ల్యాబ్వాళ్లకు ఇవ్వగా మిగి లిన సుమారు రూ.1,370 మొత్తాన్ని యూనిట్ నిర్వాహకులు జేబులో వేసుకుంటున్నారు. ఇలా ప్రతి నెలా లక్షలాది రూపాయలను డయాలసిస్ యూనిట్‌నుంచి స్వాహా చేస్తున్నట్లు విశ్వసనీ యంగా తెలిసింది. దీంతోపాటు ప్రతినెలా రోగికి చేయాల్సిన రెండు ఇంజెక్షన్లు కూడా సరిగా ఇవ్వడం లేదని సమాచారం. స్టాకు లేదనే సాకుతో ఇంజెక్షన్లు చేయడం లేదు. ప్రతినెలా 80నుంచి 120డయాలసిస్ కేసులు ఈ యూనిట్‌కు వస్తాయి. ఇందులో కొత్తగా వచ్చేవి 10 నుంచి 20 కేసులు మాత్రమే. మిగిలిన వారు తరచూ డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చే పాత రోగులే. వారు ప్రతినెలా డయాలసిస్ కోసం రెన్యువల్ చేయించుకున్నప్పుడు రక్త పరీక్షలు చేయించకుండా ఆ డబ్బును మింగేస్తున్నారు. ఇలా ప్రతినెలా 60 నుంచి 80 కేసులకు సంబంధించిన సొమ్ము బొక్కేస్తున్నారు. సుమారుగా నెలకు రూ.లక్ష వరకూ ఈ రిపోర్టుల మీదే తినేస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం డయాలసిస్ యూనిట్ నిర్వాహకులు ఇలా పరీక్షలు చేయకుండా ఇచ్చే రిపోర్టును ఇంకా తక్కువ ధరకు ఇవ్వాలని ల్యాబ్ వారితో బేరం ఆడినట్లు తెలిసింది. ఆ ల్యాబ్వాళ్లు అందుకు ఒప్పుకోకపోవడంతో వేరే ల్యాబ్ నుంచి ఈ రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు సమాచారం.