సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వైద్యో.. నారాయణో హరి’ అన్నారు పెద్దలు. వైద్యం చేసేవాడు దేవుడితో సమానమని దానర్థం. కానీ.. జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశ్రీ డయాలసిస్ యూనిట్‌లో మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడుతున్న వైద్యులు రోగుల ప్రాణాలనే బలిపెడుతున్నారు. రక్త పరీక్షలు చేయకుండానే చేసినట్లు ప్రైవేటు ల్యాబ్‌ల నుంచి రిపోర్టులు తీసుకుని రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఆ పరీక్షలు చేసినందుకు ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మును యూనిట్‌కు చెందినవారు జేబులో వేసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా ప్రతినెలా లక్షలాది రూపాయలను స్వాహా చేస్తున్నారు. దీంతో చాలామంది కిడ్నీ రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకుని అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని ఆరోగ్యశ్రీ డయాలసిస్ యూనిట్‌లో ఈ భాగోతం నిరాటంకంగా జరుగుతోంది.
ప్రైవేటు కంపెనీ ఇష్టారాజ్యం
ప్రభుత్వాసుపత్రితో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సంస్థ పర్యవేక్షణలో బిబ్రాన్ అనే ప్రైవేటు కంపెనీ ఈ యూనిట్‌ను నిర్వహిస్తోంది. కిడ్నీ వ్యాధులతోపాటు కిడ్నీలు దెబ్బతిన్న రోగులు వందలాది మంది ప్రతి నెలా ఈ యూనిట్‌లో చేరుతున్నారు. వారికి కొన్ని నెలలపాటు డయాలసిస్ తప్పనిసరి అవుతుంది. పూర్తిగా
కిడ్నీలు పాడైన వారికైతే జీవితాంతం (కిడ్నీలు మార్పిడి చేసుకుంటే తప్ప) డయాలసిస్ చేయకతప్పదు. ఇలాంటివారికి ఆరోగ్యశ్రీ పథకం కింద నెలకు 8సార్లు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్, ఇంజెక్షన్లతోపాటు రక్తపరీక్షలకు ప్రతినెలా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి రోగికి రూ.10,500 మంజూరవుతోంది. డయాలసిస్‌కు ముందు రోగులు ఆసుపత్రికి వచ్చినప్పుడు క్రియాటిన్, హెచ్‌బీ, హెచ్‌సీవీ, హెచ్‌ఐవీ పరీక్షలు జరపాల్సివుంటుంది. క్రియాటిన్ పరీక్ష కిడ్నీ పరిస్థితిని తెలిపేది. ఆ పరీక్ష రిపోర్టును బట్టి డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ యూనిట్ ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో ఉండటంతో రోగుల రక్తం శాంపిళ్లను సేకరించి ప్రైవే టు ల్యాబ్‌లకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు.
ఇక్కడే యూనిట్ నిర్వాహకులు, లేబొరేటరీ లకు చెందినవారు కుమ్మక్కై రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మొదటి నెల పరీక్షలు తప్పనిసరికావడంతో పరీక్షలు కచ్చి తంగా చేయిస్తున్నారు. ఆ తర్వాత నుంచి డయాలసిస్ సందర్భంలో పరీక్షలు చేయిం చడం ఆపేస్తున్నారు. ప్రైవేటు ల్యాబ్‌కు చెందిన వారితో మాట్లాడుకుని అంతకుముందు రిపోర్టులను బట్టి కొంచెం అటుఇటు మార్చి కొత్త రిపోర్టులు తెప్పిస్తున్నారు. పరీక్షలు జరిపినట్లు భ్రమ కల్పించేందుకు రోగుల నుంచి రక్తాన్ని మాత్రం సేకరిస్తున్నారు. ఆ శాంపిళ్లను ప్రైవేటు లేబొరేటరీలకు పంపకుండా పక్కనపడేసి వారిచ్చే ఉత్తుత్తి రిపోర్టులను చూపిస్తున్నారు.
ఒక్కో రిపోర్టుపై రూ.1,300పైనే లాభం!
పరీక్షలు చేయకుండానే రిపోర్టు ఇచ్చినందుకు ఒక్కో రిపోర్టుపై రూ.60 చొప్పున ల్యాబ్‌కు ఇస్తున్నట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఇచ్చే రూ.10,500లో రక్త పరీక్షల నిమిత్తం రూ.1,420 కలిపి ఉంటోంది. ల్యాబ్‌వాళ్లకు ఇవ్వగా మిగి లిన సుమారు రూ.1,370 మొత్తాన్ని యూనిట్ నిర్వాహకులు జేబులో వేసుకుంటున్నారు. ఇలా ప్రతి నెలా లక్షలాది రూపాయలను డయాలసిస్ యూనిట్‌నుంచి స్వాహా చేస్తున్నట్లు విశ్వసనీ యంగా తెలిసింది. దీంతోపాటు ప్రతినెలా రోగికి చేయాల్సిన రెండు ఇంజెక్షన్లు కూడా సరిగా ఇవ్వడం లేదని సమాచారం. స్టాకు లేదనే సాకుతో ఇంజెక్షన్లు చేయడం లేదు. ప్రతినెలా 80నుంచి 120డయాలసిస్ కేసులు ఈ యూనిట్‌కు వస్తాయి. ఇందులో కొత్తగా వచ్చేవి 10 నుంచి 20 కేసులు మాత్రమే.
మిగిలిన వారు తరచూ డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చే పాత రోగులే. వారు ప్రతినెలా డయాలసిస్ కోసం రెన్యువల్ చేయించుకున్నప్పుడు రక్త పరీక్షలు చేయించకుండా ఆ డబ్బును మింగేస్తున్నారు. ఇలా ప్రతినెలా 60 నుంచి 80 కేసులకు సంబంధించిన సొమ్ము బొక్కేస్తున్నారు. సుమారుగా నెలకు రూ.లక్ష వరకూ ఈ రిపోర్టుల మీదే తినేస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం డయాలసిస్ యూనిట్ నిర్వాహకులు ఇలా పరీక్షలు చేయకుండా ఇచ్చే రిపోర్టును ఇంకా తక్కువ ధరకు ఇవ్వాలని ల్యాబ్ వారితో బేరం ఆడినట్లు తెలిసింది. ఆ ల్యాబ్‌వాళ్లు అందుకు ఒప్పుకోకపోవడంతో వేరే ల్యాబ్ నుంచి ఈ రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు సమాచారం.
అవినీతి జబ్బు
Published Tue, Dec 3 2013 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement