వైద్యం అందించడంలో వైద్యశాఖ విఫలం: నారాయణ
నెల్లూరు(అర్బన్): పేదలకు వైద్య సేవలందించడంలో జిల్లా వైద్యశాఖ విఫలమైందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. స్థానిక దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో ఆయన పేదలకందే ఆరోగ్య సేవలపై అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం చంద్రబాబు జనవరి 1న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, టెలిరేడియాలజి, ప్రైవేటు లాబొరేటరీల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు చేసే మూడు పథకాలకు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ మూడింటినీ ఉపయోగించుకోవడంలో జిల్లా వైద్య శాఖ రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ఉందని తెలిపారు.
ఎంఎంఆర్, ఐఎంఆర్ వివరాల గురించి ప్రశ్నించగా జిల్లా అధికారులు తటపటాయించారు. మంత్రి స్పందిస్తూ ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్లెట్ కంప్యూటర్లు వైద్యశాఖకు ఇచ్చినప్పటికీ వాటిని ఉపయోగించడం లేదన్నారు. అందువల్లనే లెక్కలు అడిగితే చెప్పలేకపోతున్నారన్నారు. మళ్లీ ఈనెల 26వ తేదీన వైద్యశాఖలో సేవలపై తాను సమీక్షిస్తానని అప్పుడైనా తగిన సమాధానాలు చెప్పాలన్నారు. అనంతరం మెడికల్ కళాశాల, డీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై అక్కడి విషయాలను చర్చించారు.
చాట్లకు ఎమ్మెల్యే కోటంరెడ్డి అభినందన
మెడికల్ కళాశాల టీచింగ్ ఆసుపత్రిని అభివృద్ధి చేసే క్రమంలో చాట్ల నరసింహారావుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి ఇచ్చామని మంత్రి నారాయణ తెలిపారు. అనంతరం చాట్ల నరసింహారావును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శాలువా కప్పి సన్మానించారు. మంత్రి నారాయణను బలిజ సంఘం నాయకులు సన్మానించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, డీఎంహెచ్‌ఓ వరసుందరం, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమూర్తి శాస్త్రి, డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు, డీఎస్సార్ ఆసుపత్రి సూపరింటె ండెంట్ డాక్టర్ భారతి పాల్గొన్నారు.