పోలీసుల అదుపులో నిందితుడు శాంతరాజు
ఆస్పరి/ ఆలూరు: తాను విజిలెన్స్ డీఎస్పీ నంటూ ఓ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్‌ను బురిడీ కొట్టించి కటకటలా పాలయ్యాడు. మండల కేంద్రమైన ఆస్పరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారితో సోమవారం ఆస్పరి సబ్ రిజిస్టర్ కార్యాలయం కిటకిటలాడుతుంది. మధ్యాహ్నం ఏపీ 21, బీఎన్ 1899 నంబరు గల కారు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా వచ్చి ఆగింది. కారు డ్రైవర్ కార్యాలయంలోకి నేరుగా వెళ్లి సబ్ రిజిస్టార్ ఆదినారాయణతో విజిలెన్స్ డీఎస్‌పీ మహబూబ్ బాషా వచ్చారని చెప్పాడు. ఆయన వెంటనే కారుదగ్గరికెళ్లి విజిలెన్స్ డీఎస్పీకి నమస్కారం చేసి కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. మీ మీద చాలా కంప్లెంట్స్ ఉన్నాయి.. ప్రభుత్వ భూములను కూడా రిజిస్టర్ చేస్తున్నారంట కదా అని అదినారాయణను దాబాయించారు. డాక్యూమెంట్ రైటర్స్ ఎంత మంది ఉన్నారని ప్రశ్నిస్తూ ఫీజులు ఇష్టాను సారంగా వసూలు చేస్తున్నారని బెదిరించారు. చివరకు వారివురు కారులోకి వెళ్లి మాట్లాడుకునేందుకు వెళ్లారు.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఎవరో అధికారి వచ్చారని స్థానిక విలేకరులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని డీఎస్‌పీతో మాట్లాడతామని సబ్‌రిజిస్ట్రార్‌ను కోరగా భోజనం చేసిన తరువాత సార్ ప్రెస్ మీట్ పెడతారని సమాధానం చెప్పారు. అయినా, కొందరు విలేకరులు వారిద్దరు కారులో మంతనాలు జరుపుతున్న ఫొటోలు తీశారు. గమనించిన నకిలీ విజిలెన్స్ డీఎస్పీ విషయం ఎక్కడ బయటపడుతుందోనని తన సెల్ ఫోన్ అడ్డుపెట్టుకుని కొద్దిసేపు ఫోజులు కొట్టారు. తర్వాత సబ్ రిజిస్టర్‌ను ఆయన కారులోనే ఆస్పరి నుంచి ఆలూరు వెళ్లే రోడ్డు వైపు తీసుకెళ్లారు. అక్కడ సబ్‌రిజిస్టార్‌ను బెదిరించి రూ. 50 వేలు తీసుకుని ఆలూరు వైపు ఉడాయించాడు. తర్వాత ఆఫీసుకు వచ్చిన ఆదినారాయణ సహచర సబ్ రిజిస్ట్రార్లతో ఫోన్లో మాట్లాడగా మహబూబ్ బాషా పేరుతో విజిలెన్స్ డీఎస్పీ ఎవరూ లేరని తెలియడంతో తెల్లమొహం వేశాడు. మోసం పోయానని తెలుసుకొని వెంటనే సీఐ దస్తగిరిబాబుకు సమాచారమిచ్చాడు. నకిలీ విజిలెన్స్ డీఎస్పీతో కారులో కూర్చున్న సమయంలో విలేకరులు తీసిన కొన్ని ఫోటోలను తీసుకొని సీఐకు వాట్సాప్‌లో పంపారు.
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
సబ్‌రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఆలూరు ఎస్‌ఐ సీవీ నరసింహులు, పోలీసులు ఆలూరు సమీపంలో తిష్టవేశారు. నకిలీ డీఎస్పీ కారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ నకిలీ డీఎస్పీ ఎమ్మిగనూరు పట్టణ కేంద్రానికి చెందిన శాంతరాజు కాగా కారు డ్రైవర్ పేరు సోమశేఖరరెడ్డి అని తేలింది. శాంతరాజు బస్విని పునరావాస, జోగిని సంఘం రాష్ట్రం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి çఈ ఏడాది ఫిబ్రవరి 20న సంఘం అధ్యక్షుడిగా నియామక పత్రం సైతం తీసుకున్నారు.
రూ. 2 లక్షల డిమాండ్
నిందితుడు శాంతరాజు ఆస్పరి సబ్‌రిజిస్ట్రార్‌ను రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా రూ. 50 వేలు ఇచ్చారు. ఆలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రార్‌ను బెదిరించాడు. తర్వాత అసలు విషయం తెలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులకు చిక్కాడు. ఆస్పరి, ఆలూరు సబ్ రిజిస్ట్రార్లు ఆదినారాయణ, సునందను నిందితుడు శాంతరాజు ఎలా బెదిరించారనే దానిపై విచారణ చేస్తున్నట్లు సీఐ విలేకరులకువెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment