నకిలీ డీఎస్పీ, డ్రైవర్ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అంకినీడు
ఆదోని టౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ డీఎస్పీ శాంతరాజు, కార్ డ్రైవర్ సోమశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణం టీచర్స్ కాలనీలో నివాసముంటున్న శాంతరాజు, పంపన్నగౌడు కాలనీకి చెందిన కార్‌డ్రైవర్ సోమశేఖర్ రెడ్డి కొంతకాలంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ పేరుతో వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు.
సోమవారం ఆస్పరి సబ్ రిజిస్ట్రార్ ఆదినారాయణను రూ. లక్ష డిమాండ్ చేయగా అంత సొమ్ము లేదని సిబ్బంది నుంచి సేకరించి రూ.50వేలు వసూలు అందజేశారు. కొంతసేపటికి నకిలీ డీఎస్పీ అని తేలడంతో మోసపోయానని తెలుసుకున్న ఆదినారాయణ ఆస్పరి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఆలూరు వైపు వెళ్లారని తెలసుకొని సీఐ దస్తగిరి బాబుకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ, ఎస్‌ఐ నరసింహులతో కలిసి తనిఖీలు నిర్వహించగా ఆస్పరి నుంచి కారు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.75 వేల నగదు, టాటా జెస్ట్ కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారని డీఎస్పీ వివరించారు. గంట వ్యవధిలోనే నకిలీ డీఎస్పీని అరెస్ట్ చేసినందుకు సీఐ, ఎస్‌ఐలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment