సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీ చేసున్న ఏసీబీ అధికారులు (రెడ్ సర్కిల్‌లో సబ్‌రిజిస్ట్రా్టర్
ప్రకాశం, చీమకుర్తి: చీమకుర్తిలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌లు ప్రతాప్, రాఘవరావు వారి సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాలననుసరించే ఈ దాడులను నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికారకంగా పనిచేస్తున్న బొడ్డు రామారావు అనే వ్యక్తి వద్ద రూ.1,03,750 నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ టీ.హేమలత , ఇతర అధికారుల సూచనల మేరకే రామారావు డబ్బును వసూలు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ నిర్ధారించారు. దాడి చేసిన అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సోమవారం మొత్తం 14 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ జరగగా వారి నుంచి ఫీజ్ టు ఫీజ్, ఇతర పార్టీల ద్వారానే ఈ డబ్బును వసూలు చేసినట్లు చెప్పారు.
గతంలో 2017 మార్చినెల 15న ఇదే కార్యాలయంలో ఈ సబ్‌రిజిస్ట్రార్ హేమలత విధుల్లో ఉండగానే ఏసీబీ దాడులు జరిగాయని, దానికి సంబంధించిన కేసుపై ఇంకా డిపార్టుమెంటల్ ఎంక్వైరీ జరుగుతోందని డీఎస్పీ తెలిపారు. అప్పట్లో 32 వేలు నగదు దొరికిన సంగతి తెలిసిందే. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన దాడి గురించి నివేదికను ప్రభుత్వానికి అందజేయునున్నట్లు ఆయన తెలిపారు.
ఉలిక్కిపడిన చీమకుర్తి అధికారులు: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చేసిన దాడి చీమకుర్తి పట్టణంలోని పలు కార్యాలయాలలోని అధికారుల్లో ఆందోళన కలిగించింది. రెవెన్యూ, మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే ఒకే దారిలో ఉండటంతో ఏసీబీ అధికారులు ఎవరి కోసం వచ్చారో తెలియక కొంతమంది అధికారులు కుర్చీలలో నుంచి మెల్లగా జారుకున్నారు. అవినీతి అక్రమాలకు నిలయాలుగా ఉన్న చీమకుర్తిలోని పలు కార్యాలయాల్లో ఏసీబీ దాడులు అధికారులను కలవరానికి గురిచేసిందని పలువురు స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment