సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
– కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫర్నిచర్లు
హిందూపురం అర్బన్ : హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో కొన్ని పాత మ్యానువళ్లు, కంప్యూటర్లు, ఫరిచర్లతో పాటు కార్యాలయం వరండాలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కార్యాలయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని కిటికీల గుండా నీటిని విరజిమ్మి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే వరండాలోని కంప్యూటర్లు, ఫర్నిచర్లు, కూలర్లు, ఫ్యాన్లు, పుస్తకాలు, రికార్డులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ అలీ సిబ్బందితో అక్కడికి చేరుకుని రికార్డులను శుభ్రం చేసి భద్ర పరచడానికి ప్రయత్నించారు. కాగా అప్పటికే నష్టం జరిగిపోయింది.
పథకం ప్రకారమేనా..?
అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కావాలనే కొందరు కిటికీల గుండా కిరోసిన్ చల్లి నిప్పు పెట్టి జారుకున్నారా? అనే అనుమానాలు పట్టణంలో చర్చనీయాంశమైంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభమైనప్పటి (18వ శతాబ్దం) నుంచి రికార్డులు భద్రపరిచారు. అయితే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాత మ్యానువళ్లు ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా అగ్ని ప్రమాదంలో పాత మ్యానువళ్లు, ప్రజలకు సంబంధించిన రికార్డులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే మంటల్ని అదుపు చేయడంతో కాపాడుకున్నామని స్టాంప్ ఎక్సైజ్ డ్యూటీ ఇన్‌చార్జ్ డీఐజీ దేవరాజ్ అన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది.