ఏ1 స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం
హిందూపురం రూరల్ : అధిక ఉష్ణోగ్రత వద్ద ముడి ఇనుమును కరిగిస్తున్న సమయంలో బాయిలర్ పేలిపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న క్రేన్ ఆపరేటర్ మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. హిందూపురం రూరల్ మండల పరిధిలోని మణేసముద్రం గ్రామం సమీపంలో ఏవన్ స్టీల్ పరిశ్రమలో ముడి ఇనుమును బాయిలర్‌లో కరిగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాయిలర్ పేలింది. అక్కడే ఉన్న క్రేన్ ఆపరేటర్ అవిదేష్ యాదవ్ (35)పైన ద్రవ పదార్థంలో ఉన్న ముడి ఇనుము పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
పరిశ్రమలో పని చేస్తున్న తోటి కార్మికులు వెళ్లి చూడగా అప్పటికే గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరగడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఆ సమయంలో అక్కడే పని చేసే కార్మికులు భోజనానికి వెళ్లగా అతను ఒక్కడే అక్కడ ఉన్నాడు. గత నెలలో ఇదే ఫ్యాక్టరీలో క్రేన్‌ఆపరేటర్‌గా పని చేస్తున్న శివాజీ యాదవ్ ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. మృతిచెందిన ఇద్దరూ బావబావమరదులు కావడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.